e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిందగీ నారీ సైన్యం!

నారీ సైన్యం!

నారీ సైన్యం!

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో రాణించాలన్న ఆశ, తమదైన రంగంలో నైపుణ్యం పెంచుకోవాలన్న తపన.. ఇలా ఏ అంశమైనా సరే, మహిళలకు అండగా నిలుస్తుంది నారీసేన. తమకోసం తాము శ్రమిస్తూనే, సాటి మహిళలకూ తోడుండాలన్న సంకల్పంతో వ్యాపారవేత్త లతా చౌదరి బొట్ల ఏర్పాటు చేసిన సంస్థ ఇది.

40 మంది సభ్యులతో ప్రారంభమై, అతి తక్కువ కాలంలోనే 6,200 మంది మహిళల ఆశలకు వేదికైంది
ఆర్థిక విజయంతో మహిళలకు ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడే అద్భుతాలు సాధ్యం. కాబట్టే, నారీసేన మహిళల స్వావలంబనకు అంత ప్రాధాన్యం ఇస్తున్నది. ఇదొక మహిళల పరివారం. ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకొనేందుకు.. టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, జువెలరీ మేకింగ్‌, బేకింగ్‌, అల్లికలు, బొమ్మల తయారీ తదితర విభాగాల్లో శిక్షణ అందిస్తున్నది. పోటీని తట్టుకొని, మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి అవసరమైన మనోబలాన్ని ప్రసాదిస్తున్నది.

వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యే సంక్షోభాలను తట్టుకోవడానికి సరిపడా చైతన్యాన్నీ కలిగిస్తుంది. శిక్షణతోనే ఆగకుండా, మహిళలు తమ ఉత్పత్తులను డిజిటల్‌ మార్కెట్‌లో విక్రయించి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నది. ఈ కొద్దికాలంలోనే, 150 మందికి పైగా మహిళలు తమ కలలను నిజం చేసుకొన్నారు. వాళ్లంతా ఫ్యాషన్‌ డిజైనర్లుగా, బ్యుటీ షియన్లుగా, వ్యాపారులుగా విజయాలు సాధిస్తున్నార

వ్యక్తిగత సమస్యలపైనా..

ఒకరికి తీవ్రమైన వరకట్న వేధింపులు, మరొకరిపట్ల ఇంట్లో దారుణమైన వివక్ష, వేరొకరిపై నిత్యం భౌతిక దాడులు.. ఇలాంటి బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు మాత్రం వింటారు? ఎవరు ఒడ్డున పడేస్తారు? ఆ బాధ్యతను నారీసేన తీసుకున్నది. గ్రూప్‌లోని సభ్యులు తమ సమస్యలను నలుగురితో చర్చించి, పరిష్కరించుకొనే అవకాశం ఉందిక్కడ. ఆరోగ్య సమస్యలకు గ్రూప్‌లోని వైద్యులు సలహాలిస్తారు. న్యాయపరమైన అంశాలపై నారీసేన లీగల్‌ సెల్‌ సూచనలిస్తుంది. మానసిక రుగ్మతలైతే మనో నిపుణులు రంగంలోకి దిగుతారు. ఆర్థిక సమస్యలైతే బ్యాంకింగ్‌ దిగ్గజాల నుంచి భరోసా దక్కుతుంది.

దయగల వీధి…

మనకూ నూతిలోని కప్పకూ తేడా ఉండాలి కదా! అందుకే, సమాజం గురించి ఆలోచించాలి. నలుగురి కోసమూ కృషిచేయాలి. ఇందుకు ‘దయగల వీధి’ పేరుతో నారీసేన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. సభ్యులు తమ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను వృథాగా పడేయకుండా, అటకలకే పరిమితం చేయకుండా.. స్తోమత లేని కుటుంబాలకు అందజేయాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం. నిజమే, పాతబడిపోయిందని పక్కనపెట్టిన సెల్‌ఫోన్‌ ఓ పేద విద్యార్థి ఆన్‌లైన్‌లో పాఠాలు వినడానికి ఆసరా అవుతుంది. తూకానికి వేయాలనుకున్న పాత వీల్‌ చెయిర్‌ ఒక నిరుపేద రోగికి సౌకర్యాన్ని ఇస్తుంది. మనకు అవసరం లేనివి, ఎక్కడో ఎవరికో తప్పక అవసరం అవుతాయి. ఇవ్వడం దానం కాదు, బాధ్యత.

రోజుకో విజయగీతం

చదువుకోవడానికి ఏ యూనివర్సిటీకో వెళ్లాల్సిన పన్లేదు. ఓ మంచి బృందంలో సభ్యులుగా ఉంటే చాలు. ఆ చర్చలూ, సంభాషణలే పాఠాలవుతాయి. వికాసానికి బాటలువేస్తాయి. కాబట్టే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా మహిళల్లో వివిధ రంగాలపట్ల ఆసక్తిని, ఆలోచనలను ప్రోత్సహించేందుకు నారీసేన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
సోమవారం ‘ప్రేరణ’
ఫిట్‌నెస్‌, యోగా, న్యూట్రిషన్‌, హెల్త్‌, స్ఫూర్తిదాయక కథనాలు, నారీశక్తి అవగాహన కార్యక్రమాలు.
మంగళవారం ‘ట్రెండింగ్‌’
ఆహారం, వంటకాలు, వంటింటి చిట్కాలు, ఇంటీ రియర్స్‌, చట్టపరమైన సలహాలు.
బుధవారం ‘ఆసమ్‌’
అందం, జుట్టు, చర్మం, మేకప్‌, క్రియేటివ్‌ ఆర్ట్స్‌తోపాటు వివిధ సమస్యలకు నారీసేన పరిష్కారాలు.
గురువారం ‘థ్రిల్లింగ్‌’
ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, గార్డెనింగ్‌, వివిధ అంశాలపై ఆలోచనలు పంచుకోవడం.
శుక్రవారం ‘భక్తి’
ఆధ్యాత్మికత, దేవాలయాలు, సంగీతం, ప్రేరణాత్మక పుస్తకాలపై చర్చ, పొదుపు, మదుపు తదితర అంశాలపై అవగాహన.

శ‌నివారం ‘సిండికేట్’
ఆటలు, సరదాలు, క్రీడలు, ఫ్యాషన్‌, ట్రెండ్స్‌, కిడ్స్‌ టాలెంట్‌, సామాజిక సేవ.

ఆదివారం ‘వినోదం’

ప్రయాణం, అతిథులు, మహిళల సమస్యలపై సమీక్షలు, ఆన్‌లైన్‌లో గ్రూప్‌ చర్చలు.

రోజూ కొంతసేపు, వారంలో కొన్ని గంటలు చాలు! ఈ సత్సాంగత్యం ఆలోచనలను మెరుగుపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎదగాలనే తపనను రగిలిస్తుంది. ‘నారీసేన’ లక్ష్యం కూడా అదే.

నా జీవితంలో.. ఎదురైన సంఘటనలే

హైదరాబాద్‌లోని బీహెచ్‌యీఎల్‌ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నా బాల్యంలో మా నాన్నకు వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేశాయి. పెద్దయ్యాక ఎదురైన అనుకోని మార్పులూ నన్ను బలంగా ప్రభావితం చేశాయి. ప్రైవేటు స్కూల్‌ టీచర్‌గా మొదలైన నా ప్రయాణం.. యాంకరింగ్‌ వైపు మళ్లింది. ఆ తర్వాత సీరియల్‌ ఆర్టిస్టుగా మారాను. టీవీ సీరియళ్లలో అవకాశాలు వస్తున్న సమయంలోనే అమెరికా వెళ్లాలన్న ఆలోచన కలిగింది. అక్కడి తెలుగు అసోసియేషన్‌ సహకారంతో కాటన్‌ చీరల అమ్మకం చేపట్టాను. తక్కువ సమయంలోనే మంచి ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా గుర్తింపు పొందాను. ఆర్థికంగా ఎదుగుతున్న సమయంలో మావారి ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. నేను, నా జీవితం, నా సమస్యలు.. ఎంతకాలమిలా? నలుగురి కోసం పనిచేయాలన్న సంకల్పంతో నారీసేన గ్లోబల్‌ ఉమెన్స్‌ ఫోరంను ప్రారంభించాను. గడచిన ఆరు నెలల నుంచి మా ఫోరం చేపట్టిన కార్యక్రమాల నుంచి దేశ విదేశాల మహిళలు స్ఫూర్తి పొందారు. దాదాపు 6,200 మంది నారీసేనలో చేరారు. –లతా చౌదరి బొట్ల,నారీసేన వ్యవస్థాపకురాలు

-వ‌ర‌క‌వుల దుర్వాస‌రాజు

ఇవీ కూడా చదవండి

రైలు ప్ర‌మాదం.. 48కి చేరిన మృతుల సంఖ్య

రిపోర్ట‌ర్ల‌ను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్

ఏపీ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నారీ సైన్యం!

ట్రెండింగ్‌

Advertisement