హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు రంగంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనలపై చర్చకు సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేశామన్న కేసీఆర్ మాటల్లో వాస్తవంలేదని స్పష్టం చేశారు. యూనిట్‌కు రూ.3.90 పెట్టి కొన్నామని కేసీఆర్ ప్రకటించారని, కానీ యూనిట్‌కు రూ.20 చొప్పున చెల్లించి కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ నుంచి యూనిట్‌కు రూ.15 చొప్పున కొనుగోలు చేస్తామంటే ఒప్పుకోలేదని కేసీఆర్ అన్నారని, కానీ ఎన్టీపీసీ రూ.5.60కే యూనిట్ చొప్పున 1600 మెగావాట్లు సరఫరా చేసిందన్నారు. 2023 డిసెంబర్ నుంచి తెలంగాణ డిస్కమ్‌లు కొనుగోలు చేసిన విద్యుత్తు ఒక్కో యూనిట్ ధర రూ.5.34 మాత్రమేనన్నారు. 2012లోనే హైదరాబాద్ పవర్ ఐలాండ్‌కు తాము రూపకల్పన చేశామని, ఆయా అంశాలపై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులొచ్చేందుకు సహకరించిన వారికి మంత్రి భట్టి ధన్యవాదాలు తెలిపారు. ఎన్జీటీ సూచించిన షరతు ల మేరకు అన్నింటినీ పూర్తి చేసి అనుమతులు సాధించడం గొప్పవిషయమని ఓ ప్రకటనలో ప్రశంసించారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. నెలల్లో సమీక్షించి, పనుల్లో వేగం పెంచినందునే పర్యావరణ అనుమతుల జారీ అయ్యాయని చెప్పారు.