హలో డాక్టర్ గారు. ఇటీవల అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అనే పదాన్ని వింటున్నాం. అంటే ఏమిటి? ఇది మనదేశంలోని దంపతుల్లోనూ కనిపిస్తున్నదా?
భార్యాభర్తలిద్దరిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఎలాంటి లోపమూ లేకపోయినా పిల్లలు కలగకపోవడాన్ని ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. మనదేశంలోనూ ఈ కేసులు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే కారణం ఏమిటీ అన్నది అర్థం కాని సమస్య ఇది. పిల్లలు పుట్టడం లేదంటూ మా దగ్గరికి వచ్చే భార్యాభర్తలిద్దరికీ డాక్టర్లుగా మేం కొన్ని పరీక్షలూ, ప్రయత్నాలూ చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి సందర్భంలో దాన్ని ఇలా పిలుస్తాం అంటే…
అమ్మాయికి గర్భాశయంలో లోపం లేదు, సరిగ్గా అండం విడుదల అవుతున్నది, గర్భాశయ నాళాలు తెరుచుకునే ఉన్నాయి.. సంభోగానికి ఏ విధమైన అడ్డంకీ లేదు. వయసు 35 లోపే ఉంది. అటు అబ్బాయికి సంభోగ సమయంలో ఎలాంటి సమస్య లేదు, వీర్యంలో కణాల కదలికలు, వీర్యం నాణ్యత.. ప్రామాణికంగానే ఉన్నాయి! తరచుగా సెక్స్‌లో పాల్గొంటున్నారు. పెండ్లయి రెండేండ్లయింది. ఇద్దరిలో షుగర్ లేదు, హార్మోన్లు సమతులంగానే ఉన్నాయి! ఇవన్నీ తేలాక… ఆరు నెలలు అండం సరిగ్గా సమయానికి విడుదల అవ్వడానికి మందులు ఇస్తాం. ఆ సమయంలో సంభోగం చేయమని చెబుతాం. ఇలా అండం ఏ సమయంలో విడుదల అవుతుంది అని తెలుసుకునేందుకు ఫాలిక్యులర్ స్టడీ అని ప్రత్యేక పరీక్ష చేస్తాం. ఓవులేషన్ కిట్స్ ద్వారా కూడా ఇది తెలుస్తుంది. ఈ ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే…. అమ్మాయి లోపలి అవయవాలను నేరుగా చూసేందుకు ఎండోస్కోపీ చేస్తాం. గర్భాశయం, గర్భాశయంలోపల ఎలా ఉన్నది అన్నది పరీక్ష చేస్తాం. మరో పద్ధతి ద్వారా గర్భాశయపు లోపలి పొరనూ చూస్తారు. ఇవన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. కానీ పిల్లలు కలగడం లేదు అంటే… దాన్ని ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు.
సంభోగం సమయానికి సవ్యంగా జరిగినా అండం ఫలదీకరణ చెందిందా లేదా అన్నది మనకు తెలియదు. అండం విడుదల అవుతున్నదని తెలుసు, వీర్య కణాలు బాగున్నాయని తెలుసు.. కానీ ఎందుకు ఫలదీకరణం చెందడం లేదు, ఎందుకు పిండం ఏర్పడట్లేదు అన్నది మనకు తెలియదు. దానికి ఇంకా పరీక్షలు రాలేదు. ఫెర్టిలిటీ సెంటర్ల వాళ్లు ఇంకాస్త లోపలికి వెళ్లి… జన్యువుల్ని అర్థం చేసుకోవడానికి మగవాళ్లలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేస్తారు. మహిళల్లో అయితే గర్భాశయపు లోపలి పొర తీసి పరీక్ష చేస్తారు. అయినా కొన్నిసార్లు ఏమీ తేలదు. కొన్ని సందర్భాల్లో అండం ఫలదీకరణం చెందుతుంది. కానీ అది ఇమడదు. ఇక అప్పుడు ఫెర్టిలిటీ సెంటర్‌కి వెళ్లమని చెబుతాం. అక్కడ ముందుగా ఐయూఐ చేస్తారు. అంటే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అండం విడుదలయ్యేలా చేసి, వీర్యకణాలను సేకరించి శుభ్రపరచి నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అదే అండం క్రమం తప్పకుండా సమయానికి విడుదలయ్యే వారిలో అయితే, ఆ సమయాన్ని గుర్తించి వీర్య కణాలు ప్రవేశపెడతారు. ఇలా మూడుసార్లు చేస్తారు. అయినా నెలతప్పక పోతే… అప్పుడు ఐవీఎఫ్‌కు వెళతారు. అంటే అండాన్ని పరీక్షనాళికలోనే ఫలదీకరణం చెందించి దాన్ని గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబీ అంటారు. అయితే పేరు పొందిన ఫెర్టిలిటీ సెంటర్లలోనూ ఇందులో 50 శాతం కేసులు మాత్రమే విజయవంతం అవుతున్నాయి. అంటే, దానిద్వారా ప్రసవం అయ్యి పాపాయి చేతుల్లోకి రావడానికి అక్కడా సగమే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతి ద్వారా కూడా బిడ్డలు పుడతారని గ్యారెంటీ ఏమీ లేదు. అయితే… ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇక వాళ్లకు పిల్లలే కలగరు అని చెప్పలేం. అన్ని ప్రయత్నాలు చేసి, విసిగిపోయి సాదా జీవితాన్ని గడుపుతున్న వాళ్లకు పిల్లలు కలిగిన సందర్భాలూ ఉన్నాయి. ఎవరో ఒకరిని దత్తత తెచ్చుకున్నాక గర్భం వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.
నిజానికి ఇలా పిల్లలు పుట్టడం లేదు… అని గైనకాలజిస్టు దగ్గరికి వచ్చినప్పుడు మేం పరీక్ష చేసి అండం విడుదల అవుతున్న సమయం గుర్తించి, ఆ సమయంలో కలవమని చెబుతాం. 90 శాతం మంది అప్పుడే నెలతప్పుతారు. కేవలం పది శాతం మందికే ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లమని సూచిస్తాం.