తనకు బాలీవుడ్ సినిమాలు చేయాలనే కోరిక బలంగా ఉన్నదని అంటున్నది టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి. కెరీర్ మొదట్లోనే హిందీలో అవకాశాలు వచ్చినా.. అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నది. ఇండస్ట్రీలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన కృతి శెట్టి.. తొలిచిత్రంతోనే భారీ ఫ్యాన్‌బేస్‌ను సొంతం చేసుకున్నది. అయితే, ఆ విజయాన్ని మాత్రం పెద్దగా క్యాష్ చేసుకోలేక పోయింది. భారీ విజయంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టినా.. ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. దాంతో, ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగానే ఉంటూ.. తమిళ, మలయాళ పరిశమ్రలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ క్రమంలో కృతి బాలీవుడ్‌పై కన్నేసిందని సోషల్ మీడియా కోడై కూస్తున్నది. హిందీలో ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నదని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై కృతి ఇటీవల స్పందించింది. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ ముచ్చట్లను పంచుకున్నది. “నా కెరీర్ మొదట్లోనే హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ, డేట్స్ కుదరకపోవడం, అక్కడి పని విధానం భిన్నంగా ఉండటంతో ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాను. పైగా.. నేను చేయబోయే తొలి హిందీ సినిమాపై నాకంటూ కొన్ని ఆశలు, అంచనాలు ఉండేవి.
ఆ సమయంలో వచ్చిన అవకాశాలు.. వాటిని అందుకోలేక పోయాయి. త్వరలోనే హిందీలో మంచి అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ముంబయిలో పుట్టి పెరిగిన తనకు అక్కడి పరిశ్రమలో పని చేయాలన్న కోరిక మొదటి నుంచే ఉండేదట. ఎందుకంటే.. హిందీ తనకు మాతృభాష లాంటిదనీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషలు నేర్చుకోవాల్సి వచ్చినా.. సినిమా చర్చలన్నీ హిందీలోనే సాగేవనీ వెల్లడించింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో ఆకట్టుకున్నది. అయితే ఆ తరువాత వచ్చిన కస్టడీ, మనమే, ది వారియర్, మాచెర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దాంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చింది కృతి. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టిపెట్టి.. అట్నుంచి అటే బాలీవుడ్ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నది.