కొండగాలి తగిలితే.. మేఘం వర్షిస్తుంది. మెట్ట పరవశిస్తుంది. అదే కొండపల్లి చేయి కదిపితే.. వన్నెలు పులకిస్తాయి. వెన్నెల్లు విరుస్తాయి. ఆయన కుంచె నుంచి ఉదయించిన ప్రతి చిత్రమూ అపురూపమే! ఆయన రంగులద్దిన ప్రతి గీతా.. చిత్రకారులకు గీతాపాఠమే! దశాబ్దాల తరబడి రంగులను రంగరించుకున్న ఆయన జీవితం మనోహరం. తెలంగాణ గడ్డపై పూసిన కొండపల్లి శేషగిరిరావు పోత పోసిన చిత్రాల్లో కొన్ని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అచ్చికలాడుతున్నాయి. ఆ మహనీయుడి శత జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ చిత్ర ప్రదర్శన తిలకించి, పులకించి అర్పిస్తున్న అక్షర కైమోడ్పులివి..
2011లో వరుసపెట్టి వారానికో పెద్ద ఆర్టిస్టును కలవాలి అనుకొని ఒక నియమం పెట్టుకున్నా. ఆ వరుసలో నాకు మొదట తట్టిన పేరు కొండపల్లి. గతంలో బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్లో, అమీర్పేట్ మైత్రీవనం కాంప్లెక్స్ ప్రవేశ ద్వారంలో ఆయన గీసిన 14×8 సైజు మ్యూరల్స్ (కుడ్య చిత్రాలు) చూసినప్పుడు కలిగిన అనుభూతి ఆ పెద్దాయనను కలిసేందుకు ప్రేరణ. అలాగే నల్లకుంట శంకరమఠంలోని శంకరాచార్యుల పోర్ట్రెయిట్ చూసినప్పుడు నాలో కలిగిన ఆనందం ఇప్పటికీ, ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది. ఆ నేపథ్యంలోనే దోమలగుడాలో ఉన్న కొండపల్లి ఇంటికి వెళ్లా ఒకసారి. వారి కోడలు నీహారిణి సాదరంగా లోనికి ఆహ్వానించారు.
‘మామగారూ, ఈ తరం ఆర్టిస్టులు మీ బొమ్మలంటే ఇష్టపడి మిమ్మల్ని కలవడానికి వచ్చారు’ అని నన్ను వారికి పరిచయం చేశారు. అప్పుడు ఆ చేయి తిరిగిన చిత్రకారుడు అల్జీమర్స్తో పోరాడుతున్నారు. గతమంతా దాదాపు మర్చిపోయారనిపించింది. అయినప్పటికీ, నా కోరిక మేరకు ఓ చిత్రం గీసివ్వడం విచిత్రం. కొండపల్లి గీసిన చిట్టచివరి స్కెచ్చు బహుశా ఆనాడు నేను అడిగి గీయించుకున్నదే కావొచ్చు. అయితే, వారు అడిగిందే పదేపదే అడుగుతూ ఉండటం వల్ల.. మా సంభాషణ అంతగా ఫలవంతం కాలేదు. నీహారిణితోనే మాట్లాడాను. కొండపల్లి తనయుడు వేణుగోపాల్ తండ్రి గీసిన బొమ్మలను చూపించారు. వాటన్నిటినీ తదేకంగా చూసి, ఏదో పుణ్యం చేసుకున్న వాడిలా ఆ చిత్రాలయం నుంచి తిరుగుముఖం పట్టాను. మామయ్యపై అభిమానంతో నీహారిణి ఆయన జీవిత చరిత్ర రాశారు. అంతేకాదు, ఆ పెద్దాయన జయంతి, వర్ధంతి రోజుల్లో ప్రధాన పత్రికలకు ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. కొండపల్లి గురించి ఈ తరానికి గోరంతైనా తెలిసిందంటే ముమ్మాటికీ ఆమె వల్లే!
2002లో ఆర్టిస్టు, కార్టూనిస్టు అయిన బాపును తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమంలో బాపు, కొండపల్లి ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు పరస్పరం పాదాభివందనం చేసుకున్నారట. ఆ ఘట్టం చూసి షాక్కు గురైన మరో ఆర్టిస్టు మోహన్.. తన కలంలో ఆనందాశ్రువులు నింపుకొని ‘కొండకు కొండ నమస్కారం’ అని తన భావనను వ్యక్తీకరించారు. ‘తెలుగు చిత్రకళా చరిత్రలో ఒకే ఒక భువనగిరి కోట, ఆదిలాబాద్ పచ్చల కొండ, కరీంనగర్ అడివితల్లి వంగి తెలుగు రేఖకీ రంగుకీ నమస్కారం చేసింది. ఈ నర్సాపురం నది సిగ్గుతో మెలికలు తిరిగి ఆ నూనె రంగుల బృహత్పాదాలను కడిగింది. భక్తిపరుడైన కొండపల్లిగారి దేవతామూర్తుల భంగిమలూ ఆ రంగులూ చూస్తే మొండి నాస్తికులు కూడా మోకాళ్లపై వంగి నమస్కారాలు చేయాల్సిందే’ అంటూ ఒక వ్యాసం రాశారు మోహన్. కరకు కామ్రేడ్ కనుబొమల మధ్య నుంచి పాపిట వరకు విష్ణు సహస్ర నామం దిద్దిన దిట్ట కొండపల్లి.
కొండపల్లి శతజయంతి ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన ఆయన బొమ్మల కొలువులో వరూధిని, ప్రవరాఖ్యుడు, శకుంతల, అభినవగుప్తుడు, పోతన, హరిహర బుక్కరాయలు, శారదాంబ, దమయంతి, గాయత్రి, జగన్మాత ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. శ్రీరాముడు రాతిని నాతిగా మార్చిన అహల్య ఘట్టం.. ఆహా..!! గుహుడు సీతారాములను పడవ దాటిస్తున్న చిత్రంలో సీతాదేవి ప్రేమగా రాముడిపై వాలినప్పుడు.. రామనామాల లాంటి తన నడుము ముడతలకు ప్రణమిల్లుతాం. కరి, మకరి పెనుగులాడుతుండగా త్రికూట పర్వతం మీది సరోవరంలో కల్లోలమైన కలువలు, తామరలను చూస్తుంటే.. గజేంద్రమోక్షాన్నీ, గడ్డిపరకనూ రెండిటినీ ఒకే రకమైన ఆరాధనా భావంతో గీసిన కొండపల్లి వైనానికి తాదాత్మ్యతను చెందకుండా ఉండలేం. పర్ణశాలలో సీతారాముల వైపు తల తిప్పిచూసే జింక అవేర్నెస్, నేలపై ఉన్నా రెక్కలు విప్పి కొట్టుకుంటున్న పావురం కాన్షస్నెస్ కండ్లకు ఇంపుగా గోచరం అవుతాయి. శరన్నవరాత్రుల్లో ఆయన కుంచె అంచుల నుంచి జారిన నవదుర్గల రూపాలు చూస్తుంటే… చిత్రకళపై కొండపల్లి వారి సత్యదీక్ష, నిష్ఠ ప్రస్ఫుటమవుతాయి.
ముంగిస, జింక వెంట్రుకలు, ఎలుక మీసాలతో తయారుచేసిన ఫ్లాట్బ్రష్లు వాడటం వల్ల మారే లైనియర్ క్యారెక్టర్, చైనా ‘మోకు’ ైస్టెల్ ప్రభావంతో గీసిన బొమ్మలను ఎంత కాలమైనా కన్నార్పకుండా చూడగలం. మనుచరిత్రకు మణిపూసలైన వరూధినీ-ప్రవరాఖ్యులు, బృందావనం పొన్నచెట్టు నీడలో రాధాకృష్ణులు, జమ్మికొమ్మపై పాలపిట్టలు, గంతులేసే లేడి పిల్లలు, రవీంద్రుడి శాంతినికేతనంలోని ఇప్ప, జిట్ట, రేగు, టేకు, నల్లమద్ది, దిరిశనమాకు, కొబ్బరితోట.. ఊట! ఇవన్నీ కొండపల్లి క్యాన్వాస్పై వర్ణశోభితంగా, లలిత రమ్యంగా కొలువుదీరాయి.
సోషల్ మీడియాలో కృత్రిమ మేధ చిత్తరువులు కమ్ముకుంటున్న ఈ రోజుల్లో… లేత వెన్నెలల సిత మయూఖుని రేఖ వోలె అల మాదాపూర్ కావూరి కొండపై కొండపల్లిని దర్శిస్తే జన్మ ధన్యం కావడం ఖాయం. ఆయిల్ రంగులు, వాటర్ కలర్స్, ఆక్రిలిక్ల త్రివేణి సంగమమై శోభిల్లుతున్న కొండపల్లి కుంభమేళాలో మునిగి పునీతులమవుదాం.
ఈ ప్రదర్శనను నేను దర్శించి వస్తుండగా.. ఆర్టిస్టు మిత్రుడు ‘మధు కురవ’ కలిసి ఒక మాటన్నాడు. ‘అన్నా! ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీని ఇటీవల రెనోవేట్ చేశారు, ఇలాంటి పెయింటింగులు ప్రదర్శనకు పెట్టినప్పుడు హాల్లో మంద్రస్థాయిలో వీణా నాదమో, వేణు గానమో వినిపించేలా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటుచేస్తే బాగుండేది కదా!’ అని. ఆ వ్యవస్థ లేకున్నా… ఆ వాద్య విన్యాసాలు నాకు వినిపించాయి. పడి పడి పరుగులు పెట్టే పాకాల, రామప్ప చెరువుల హోరు, వేయిస్తంభాల శబ్దనాదాలు, పేరిణి నృత్య పద కింకిణులు, కుంటాల ఝరీ జల నిక్వణాలు, మంజీరా కంజీర నాదాలు, సింగూరు పొంగుల ధ్వని, శాంతినికేతన్ గుల్మొహర్, శాలవృక్షాలను పెనవేసుకున్న లతల గుసగుసలు ఇవన్నీ నా చెవిలో ఇప్పటికీ మార్మోగుతున్నాయి. కొండపల్లి బొమ్మలు మనో ఫలకంపై కొలువున్నంత కాలం మన హృదయ స్పందనల్లో సరికొత్త రాగాలు పుడుతూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు.
– మృత్యుంజయ్, కార్టూనిస్ట్