భారతదేశం అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం! అనేక సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం! ఇక్కడి ఒక్కో రాష్ట్రం.. దేనికదే ప్రత్యేకం! అలాగే.. ‘దసరా’ కూడా! ‘పేరు’ ఒక్కటే అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుగుతుందీ వేడుక!
ఇంటింటా ఇలవేల్పు: దసరాకు కోల్‌కతా కొత్తగా ముస్తాబవుతుంది. బెంగాలీల ఇలవేల్పు కాళీమాత.. ఇంటింటా కొలువుదీరుతుంది. అమ్మవారి ఆరాధనతో ప్రతి లోగిలీ పావనమవుతుంది. వినసొంపైన సంగీత కచేరీలు, కనులవిందైన నృత్యప్రదర్శనలు, చవులూరించే వంటకాలతో.. బెంగాలీ సందులన్నీ సందడిగా మారుతాయి. పూజలు, ఊరేగింపులు.. భక్తులకు ఆలౌకిక ఆనందాన్ని పంచుతాయి.
వొడయార్ల వైభవం: ఇక దక్షిణాన ‘దసరా’ అంటేనే.. మైసూరు. 1610 నుంచీ ఇక్కడ విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి రాజప్రాసాదంలో నిర్వహించే దసరా ఉత్సవాల కోసం దేశవిదేశాల నుంచీ పర్యాటకులు తరలివస్తారు. పండుగ రోజున రాచవీధుల్లో ఏనుగులతో నిర్వహించే ‘జంబూసవారీ’.. చూసేవారికి కన్నుల పండుగే! అంబారీపై అమ్మవారు ఊరేగుతూ వస్తుంటే.. లక్షల మంది దర్శించుకొని తరిస్తారు.
ప్రకృతి పండుగ: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో దసరా అంటే ప్రకృతి పండుగ. అడవి బిడ్డల ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటే వేడుక. ఇక్కడ విజయదశమి వేడుకలు 75 రోజులపాటు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ ఆరాధ్యదైవం ‘దంతేశ్వరి దేవి’ని కొలుస్తారు. అడుగడుగునా గిరిజన సంప్రదాయాలు పాటిస్తూ.. గ్రామగ్రామానా సంబురాలు చేసుకుంటారు.
భల్లే భల్లే.. భండారా: పంజాబీలు శక్తి ఆరాధనతో దసరా వేడుకలు జరుపుకొంటారు. నవరాత్రుల సందర్భంగా ఏడు రోజులపాటు ఉపవాసాలు ఉంటారు. రాత్రంతా జాగారం ఉండి.. భక్తిపాటలు పాడుతూ, భజనలు చేస్తారు. ఎనిమిదో రోజున చిన్నారులను ‘కంజిక’గా అలంకరించి, వారికి ‘భండారా’ అనే ప్రత్యేక వేడుక నిర్వహిస్తారు.