ఆమె ఆరోగ్యంగా ఉంటే.. ఇంటిల్లిపాదికీ మహాభాగ్యం. ఆరోగ్యకరమైన సమాజమూ నిర్మాణం అవుతుంది. అదే ఇల్లాలికి సుస్తీ చేస్తే… జాతికి చీడ పట్టినట్టే! అమ్మ కలత చెందకుండా ఉంటేనే సమాజం పరిఢవిల్లుతుంది. ప్రగతి సాధిస్తుంది. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే? ఈ ఆలోచనే ఆ కలెక్టరమ్మను ‘శుక్రవారం గ్రామసభ’కు పిలుపునిచ్చేలా చేసింది. ప్రతి ఇల్లాలినీ ఆరోగ్యవంతురాలిని చేయాలనే సంకల్పంతో ఈ క్రతువుకు శ్రీకారం చుట్టారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ‘శుక్రవారం గ్రామసభ’ లక్ష్యం. రెండు నెలలుగా అమలవుతున్న ఈ కార్యక్రమం.. పల్లెపల్లెకూ ఆరోగ్యలక్ష్మిని పరిచయం చేస్తున్నది.
ఏ పట్టాలూ అందుకోకున్నా.. బహుముఖ ప్రజ్ఞ అతివ సొంతం. ఇల్లాలిగా కుటుంబ పోషణ చూసుకుంటుంది. భార్యగా కట్టుకున్నవాడి మర్యాద నిలబెడుతుంది. అమ్మగా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కుటుంబ శ్రేయస్సే పరమావధిగా జీవనం సాగిస్తున్న మహిళలు.. తమ గురించి తాము పట్టించుకునే పరిస్థితులు చాలా అరుదు. ఈ నిర్లిప్త ధోరణి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నది. రక్తహీనత, పోషకాహార లేమి ఆడబిడ్డలను పట్టి పీడిస్తున్నాయి. అయినా తన వారి పోషణ, కుటుంబ రక్షణే ముఖ్యంగా భావించి తమ అనారోగ్యాన్నీ అంతగా పట్టించుకోకుండా, ముఖంపై నవ్వు పులుముకొని భారంగా బతికీడుస్తున్న తల్లులు ఎందరో! అయితే, ఇల్లాలు మంచాన పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే!! ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సరికొత్తగా ఆలోచించారు. గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు, కుటుంబం బాగుంటుందన్న నినాదాన్ని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి శుక్రవారం గ్రామసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటి పరిధిలో 5,116 మంది గర్భిణులు, 3,536 మంది బాలింతలు ఉన్నారు. వీరితోపాటు చిన్నపిల్లల తల్లులున్నారు. ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో జరిగే శుక్రవారం గ్రామసభకు వీరంతా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతివారం కలెక్టర్ ఏదో ఒక అంగన్వాడీ కేంద్రంలో జరిగే సభకు స్వయంగా హాజరవుతున్నారు.
‘శుక్రవారం గ్రామసభ’ క్షేత్రస్థాయిలో గృహిణులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తున్నది. మహిళలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఇతరత్రా ఏవైనా ఇబ్బందులు కావచ్చు ఈ సభలో చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల మానసికంగా కుంగిపోతున్న మహిళలు ఎందరో వారి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం గ్రామసభ మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నది. సభలో మహిళా శిశు సంక్షేమ అధికారులతోపాటుగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మాత్రమే కాకుండా వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించి.. అవసరమైన మందులు ఇచ్చేలా చూస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే.. అవసరమైన పరీక్షలు, వీలైన మేరకు స్కానింగ్ చేయిస్తున్నారు. గ్రామసభలో సాధ్యం కాకపోతే శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించే ఏర్పాటుచేశారు. ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా సరైన వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని చెబుతున్నారు. వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు, అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవల వివరాలను తెలియజేస్తున్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు చేసి.. వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. గర్భిణులు ఏయే నెలల్లో ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి? స్కానింగ్లకి ఎప్పుడు వెళ్లాలి? మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలను వివరిస్తూ మహిళల్లో కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఆడబిడ్డల ఆరోగ్య కేంద్రంగా శుక్రవారం గ్రామసభ కొనసాగుతున్నది. ఆరోగ్య సూత్రాలు చెబుతూనే, అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తున్న కలెక్టరమ్మకు పల్లె పడుచులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
పురాణాలే కాదు.. శాస్ర్తాలు, సర్వేలు, అధ్యయనాలు మనకు ఒక్కటే సూచిస్తున్నాయి. ఇల్లాలి ఆరోగ్యం బాగుంటేనే ఇంటిల్లిపాది బాగుంటుందని చెబుతున్నాయి. కానీ, చాలామంది మహిళలు ఈ దిశగా ఆలోచించడం లేదు. తమ ఆరోగ్యంపై శ్రద్ధచూపడం లేదు. దీంతో ఇల్లాలి ఆరోగ్యం కుంటుపడుతున్నది. తద్వారా కుటుంబ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతున్నది. వ్యాధి ముదిరితే.. వైద్యానికి అయ్యే ఖర్చులు ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేస్తాయి. సమస్యను మొగ్గలోనే తుంచాలంటే.. ఆరోగ్యంపై అతివలకు అవగాహన కల్పించాలి. రుగ్మతల బారినపడకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయాలి. దానిని ఆచరణలో తీసుకురాగలిగితే ఇల్లాలి ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. ఈ లక్ష్యంతోనే ‘శుక్రవారం గ్రామసభ’ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. దీనిని మరింత బలోపేతం చేయాలనే సత్సంకల్పంతో నాతోపాటు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నది.