నేడు కంచి పీఠాధిపతి తెలంగాణకు ఆగమనం
జగద్గురు శంకర భగవత్పాదుల సంకల్ప శక్తినుంచి ప్రాదుర్భవించిన శ్రీకంచికామకోటి పీఠం.. కామాక్షి, కామకోటి, దుర్గ, మహాత్రిపురసుందరి వంటి దేవీమూర్తుల క్షేత్రమై కాలగమనంలో అద్వైతపీఠంగా జనజాగరణ, జనకల్యాణ స్ఫూర్తితో విరాజిల్లుతున్న పరమపవిత్ర క్షేత్రం. శ్రీ కామకోటి పీఠాధిపతులు అందరూ జగద్గురువులై, భారతజాతిని సనాతన మార్గంలో నడిపిస్తున్న విధానం అపురూపమైనది.
గత శతాబ్దకాలంలో శ్రీకంచికామకోటి పీఠం ఒక అపూర్వ సందర్భాన్ని ఆవిష్కరించింది. మహాస్వామిగా జగదభివంద్యులైన జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, జగద్గురు జయేంద్ర సరస్వతి మహాస్వామివారు, జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సర్వస్వతి స్వామివారు గురు త్రయంగా, త్రయీ విద్యా స్వరూపులుగా ఏకకాలంలో ప్రపంచానికి ఆర్ష, భారతీయ, వేద సంస్కృతిని వరదానం చేసినదే ఆ సందర్భం!
ప్రస్తుత పీఠాధిపతి జగద్గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు సన్యాసాశ్రమ స్వీకారం చేసిన నాటికి వారి వయసు కేవలం 14 సంవత్సరాలు. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన క్షణంలో శ్రీవిజయేంద్ర సర్వస్వతి స్వామివారి బ్రహ్మతేజస్సును చూసి.. ‘తిరిగి శంకరులే ప్రభవించారు’ అని వ్యాఖ్యానించారు మహాస్వామివారు. శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామివారి ప్రతిభ అనన్య సామాన్యం. తమ 13వ ఏట కంచిలో జరిగిన వేదవిద్యా సదస్సులో ఒక ప్రాసంగికుడి వాదనలోని లోపాలను ఖండించి, పరిష్కరించిన సందర్భం, సభను నిశ్చేష్టం చేసింది. అది కేవలం బాలమేధ మాత్రమే కాదు, శంకరాంశ నిరూపిత అద్భుతం!
వేదవిద్యా స్వరూపంగా, సత్యాచార్యుడిగా, జగద్గురువుగా, శిల్పకళా విద్వత్మూర్తిగా, సనాతన ధర్మాచార్యునిగా, స్వామివారిది త్రివిక్రమ స్వరూపం. సామాజిక స్పృహ, సంఘ సంస్కరణ, సంఘసేవ ముప్పేటగా సాగే స్వామివారి ఆలోచనా రీతి.. ఒక అనుగ్రహ త్రివేణి. సాంస్కృతిక, సామాజిక, సంస్కారగత జీవన ప్రవాహాన్ని ఆధ్యాత్మిక స్పర్శతో వేగంగా నడిపిస్తున్న కరుణాలయమే శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామివారు. ‘బాల పెరివ’గా ఆవిష్కృతులైన స్వామివారు సనాతన ధర్మాన్ని సనూతన రీతిలో ప్రజలకు బోధించి, ధర్మమార్గానురక్తులను చేస్తూ, పీఠ పరంపరకు మరింత సమున్నత రీతిలో ఆచార్యత్వాన్ని వహిస్తున్నారు. ఆయన కర్మ, భక్తి, జ్ఞాన యోగ అవిచ్ఛిన్న. ఆయనది ఒక అవిచ్ఛిన్న సంప్రదాయ వైఖరి.
యోగ, యాగ, త్యాగ, భోగ రీతులన్నీ ధర్మ సంబంధులే! జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆగమనంతో తెలంగాణ నేల ప్రశాంతస్థలి అవుతున్నది. సకల సౌభాగ్య సంపన్నమవుతున్నది. వారి ఆగమనం ప్రపంచశాంతికి, విశ్వకల్యాణ స్ఫూర్తికి ఆరంభవేళ! సన్మంగళ కాలం!
– వి.ఎస్.ఆర్.మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త