న్యూఢిల్లీ : నేడు శాస్త్ర సాంకేతిక రంగంలో ఏఐ లేకుండా దాదాపు ఏ పనీ జరగడం లేదు. ఈ పరిణామం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని ఓ స్టార్టప్ సీఈవో హెచ్చరిస్తున్నారు. ఇది ‘కొవిడ్ కంటే అతి భయంకరమైనది’ అని వ్యాఖ్యానించారు. హైప్రైట్ స్టార్టప్ కంపెనీ సీఈవో మ్యాట్ షూమర్ ‘ఏదో భారీగా జరుగబోతున్నది’ శీర్షికన ఎక్స్‌లో ఏఐ ప్రమాదాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
మరికొద్ది సంవత్సరాల్లో క్షేత్రస్థాయిలో నియామకాలు జరిగే వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ 50 శాతం వరకు నిర్మూలిస్తుందని అంచనా వేశారు. ఏఐలో వస్తున్న తాజా మాడల్స్ ఈ సంవత్సరాంతంలోగా భారీ మార్పులను తెచ్చే సామర్థ్యంగలవని హెచ్చరించారు. నిజానికి ఏఐ తనను తాను నిర్మించుకుంటున్నదని, అది మరింత తెలివిగలదిగా మారుతున్నదని హెచ్చరించారు.