అనారోగ్యకరమని తెలిసినా జంక్‌ఫుడ్ అంటే చాలామందికి నోరూరుతూనే ఉంటుంది. నాలుక కట్టేసుకోవడం కష్టమైపోతుంది. అయితే జంక్‌ఫుడ్ పరిమితికి మించి తీసుకుంటే అరగడానికి చాలా సమయం పడుతుంది. పొట్టలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన చిరుతిండ్లే ఎంచుకోవాలి. ఒకవేళ జంక్‌ఫుడ్ తినకుండా ఉండటం కష్టంగా ఉంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, కుకీలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రైడ్ చికెన్, హాట్ డాగ్స్, సాసేజ్ లాంటి ప్రాసెస్డ్ మాంసాహారాలు, సమోసాలు లాంటి నూనెలో బాగా వేయించినవి జంక్‌ఫుడ్ కిందికి వస్తాయి. వీటిలో ప్రొటీన్లు, కొవ్వులు, స్టార్చ్, చక్కెరలు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అరగడానికి 3 నుంచి 6 గంటలు పడుతుంది.
జంక్ఫుడ్స్ జీర్ణం కావడానికి మరిన్ని జీర్ణక్రియ ఎంజైములు అవసరమవుతాయి. పైగా ఈ జంక్‌ఫుడ్స్‌లో కృత్రిమ రంగులు లాంటివి కలుపుతారు. ప్రిజర్వేటివ్స్, రుచి పెంపుచేసే పదార్థాలను జోడిస్తారు. ఇవి జీర్ణక్రియను మందకొడిగా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మీద అదనపు భారాన్ని మోపుతాయి. మితిమీరి తిన్నారంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇరిటబుల్ బోవెల్ డిసీజ్, యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి పొట్ట సమస్యలు ఉన్నవాళ్లకు జంక్‌ఫుడ్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కడుపులో ఇబ్బందిగా కూడా ఉంటుంది.