జర్నలిస్ట్‌గా ప్రజల పక్షాన నిలబడి పాలకులు చేసే తప్పులను ఎత్తిచూపడమే ఆయన చేసిన పాపమా? మాకు ప్రాణ భయం కలిగించి, ప్రశాంతంగా ఉన్న మా బతుకులను నరకం చేశారు. తప్పును ప్రశ్నిస్తే శిక్షిస్తారా? తెలంగాణ ప్రజలకు మూడేండ్ల ముందున్న రక్షణ ఇప్పుడు లేదు…అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన గుండె కోతను జర్నలిస్ట్ కోసిక వెంకట్రాంరెడ్డి (కేవీఆర్) భార్య విజయలక్ష్మి ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రవాదిలా చూసినా తెలంగాణ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను ఆయన జీవిత భాగస్వామిగా తనని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిని. సమాజానికి మంచి చేయాలనే తపన తప్ప ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు, కానీ ఈ రోజు ఏపీ పోలీసులు ఆయనను టార్గెట్ చేసి పెడుతున్న కష్టాలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతున్నది. గతంలోనే ఓ దొంగ కేసు బనాయించి మావారికి నరకం చూపించారు ఏపీ పోలీసులు. మరోసారి ఆయన అన్న వ్యాఖ్యలు మార్ఫింగ్ చేసి విజయనగరంలో
మరో కేసు పెట్టారు.
అంతా మార్ఫింగే..
టీడీపీ నాయకుడు లోకేష్ తరచూ తమది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. అయితే దానికి కౌంటర్‌గా మార్చి నెలకు ముందే అది ‘రెడ్ బుక్ కాదు… వెర్రిబుక్’ అంటూ తన యూట్యూబ్ చానెల్లో వ్యాఖ్యానించారు మావారు. అక్కడ ఆయన ఉద్దేశం ఇలాంటి ప్రతీకార సంస్కృతిని నిరసించడమే. కానీ, దీనిని ఒక పథకం ప్రకారం పోలీసులు, ఏపీ ప్రభుత్వం మార్ఫింగ్ చేసింది. ‘వెర్రిబుక్’ అనే పదంలో బుక్… అనే పదాన్ని తొలగించి, మరో అసభ్యమైన మాటను జోడించారు. దాన్ని మహిళలను కించపరిచేదిగా మార్చేశారు. అలా ఉద్దేశపూర్వకంగా మార్ఫింగ్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో తమ అకౌంట్లలో పెట్టి వైరల్ చేశారు. తర్వాత వాళ్లే ఈ వీడియోలో మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా కేవీఆర్ వ్యాఖ్యానించాడంటూ స్థానిక టీడీపీ నాయకులతో ఫిర్యాదు చేయించారు. అలా మా వారి మీద విజయనగరం జిల్లా బొబ్బిలిలోని బడంగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 17వ తేదీన బొబ్బిలి పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణోడివి నీకేం పని..
ఇక్కడ ఇంతకు ముందు జరిగిన మరో సంగతి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వంతపాడుతూ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఒక టీవీ చానెల్ యజమాని, ఈ ఏడాది మార్చి నెలలో చంద్రబాబు నాయుడుని సాక్షాత్తూ శివుడితో పోల్చారు. జర్నలిస్ట్ అయిన మా వారు కేవీఆర్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా స్పందిస్తూ ‘చంద్రబాబును దేవుడు శివుడితో ఎలా పోలుస్తారు..?’ అని ప్రశ్నించారు. అంతే ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కర్నూల్లో కేసు నమోదు చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ ఫిర్యాదు చేసింది ఖలీల్ అనే ఒక ముస్లిం. ఈ కేసులపై మార్చి 4న కర్నూల్ పోలీసులు వచ్చి కేవీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. చట్టంపై గౌరవంతో ఆయన ఇద్దరు న్యాయవాదులతో కలిసి పోలీసుల విచారణ కోసం కర్నూల్‌కు వెళ్లారు. సాయంత్రం 4.30 గంటలకు స్టేషన్‌కు వెళ్లిన ఆయనను రాత్రంతా నిర్బంధించారు, లాయర్లను బలవంతంగా పంపేసి, కేవీఆర్ దుస్తులు విప్పి, తీవ్రంగా కొట్టారు, తెలంగాణ ప్రాంతాన్ని, కేవీఆర్‌ను బూతులు తిడుతూ తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు. ‘తెలంగాణోడివి… ఆంధ్ర రాజకీయాలతో నీకేం పనిరా..? చంద్రబాబుతో పెట్టుకుంటావా..!’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. మరునాడు ఉదయం ఆయన నడవలేని పరిస్థితులలో బయటికి వచ్చారు. ఈ విషయాన్ని అప్పట్లో కేవీఆర్ అందరి దృష్టికి తీసుకెళ్లారు.
అర్ధరాత్రి వేళ దొంగల్లా..
రెడ్‌బుక్ కేసుకు సంబంధించి ఇంతకు ముందు ఏప్రిల్‌లో కూడా నోటీసులు ఇచ్చే నెపంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మఫ్టీలో సిద్ధమయ్యారు. ఇక్కడి జర్నలిస్ట్‌లు ఈ విషయాన్ని తెలుసుకొని అడ్డుకున్నారు. దీంతో అర్ధరాత్రి వరకు ఏపీ పోలీసులు అక్కడే ఉండి, చివరికి వెళ్లిపోయారు. గతంలో కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఎదురైన థర్డ్ డిగ్రీ అనుభవంతో భయపడిన కేవీఆర్ బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, కోర్టు సెలవుల వల్ల ప్రక్రియ ఆలస్యమైంది.
అయితే అప్పటి నోటీసులకు సంబంధించిన విచారణకు హాజరుకాలేదనే నెపంతో జులై 2 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు మఫ్టీలో మళ్లీ హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని మా నివాసం వద్దకు వచ్చారు. ఆ పరిసరాల్లోనే గంటకుపై తచ్చాడుతూ కేవీఆర్ కోసం కాపు కాశారు. ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘మీరు దొంగలా? రౌడీలా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి పూట మా మీద దాడి ఏంటి..’ అంటూ మేం అందరం వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశాం. కానీ ఆడవాళ్లన్న విచక్షణ కూడా లేకుండా నా చేతులు పట్టుకుని లాగేశారు పక్క రాష్ట్రం పోలీసులు. ఇంత జరుగుతున్నా ఇక్కడ పోలీసులకు, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు.
చంద్రబాబుకు దాసోహం
రేవంత్ సర్కార్ చంద్రబాబుకు దాసోహం అంటున్నది. అక్కడేం చెబితే ఇక్కడ అది జరుగుతున్నది. తెలంగాణ జర్నలిస్ట్‌లను, ఇక్కడి భాషను కించపరుస్తూ, హైదరాబాద్ నడిబొడ్డుకు వచ్చి ఏపీ పోలీసులు సాగిస్తున్న ఈ అరాచకం మీద తెలంగాణ వాదులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం ఇవేమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పౌరులను, జర్నలిస్ట్‌లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పటి పరిస్థితి వేరు. ఆంధ్రా పోలీసులు వచ్చి మన జర్నలిస్ట్‌లపై దౌర్జన్యం చేస్తుంటే, మన పోలీసులకు కనీసం సమాచారం లేదట. ఇకనైనా మన రాష్ట్ర పౌరుల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన కేవీఆర్‌ను తక్షణమే బయటికి తీసుకొచ్చి ఈ నేల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అయినా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, అన్యాయాన్ని ధైర్యంగా ఎదురించే నా భర్త వెంట మేమున్నాం. ఏపీ ప్రభుత్వం బెదిరింపులకు ఇక్కడి జర్నలిస్టులు లొంగరు. మాకు న్యాయం చేసేందుకు కోర్టులున్నాయి.. అక్కడే మేం
పోరాడుతాం!