పిల్లల ఆలనాపాలనలో వారికి నిండైన నిద్ర ఉండేలా చూసుకోవడం ప్రధానం. చంటిపాపలు కంటినిండా పడుకుంటే బాగా ఎదుగుతారు. నాణ్యమైన నిద్ర పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నిపుణుల మాట. పిల్లలకు సరైన నిద్ర అందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
అన్ని పనులూ షెడ్యూల్ ప్రకారమే చేసుకుంటాం. అలాగే పిల్లల నిద్రకూ పక్కాగా వేళలు పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి వారిని నిద్రపుచ్చడం సరైన పద్ధతి.
జోల పాడటం వల్ల పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. పాటలు పాడే అలవాటు లేకుంటే.. పిల్లలు నిద్రపోయే వేళకు శ్రావ్యమైన సంగీతం ప్లే చేయండి. మంచి కీర్తనలు, సితార్, వేణువు వంటి వాద్య సంగీతం వినిపించండి. వాళ్లు నిద్రపోగానే.. సంగీతం ఆపేయండి. అంతేకానీ, డ్రమ్స్ మోతలు ఉండే పాటలు పెట్టి ఆ చిట్టి బుర్రను కంగారు పెట్టకండి. పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు.. మిక్సీ పెట్టడం, పెద్ద సౌండ్‌తో టీవీ పెట్టడం లాంటివి చేయకండి.
ఈ తరం పిల్లలకు సెల్‌ఫోనే కథలు చెప్పే సాధనంగా మారింది. పడుకునే ముందు వారికి సెల్‌ఫోన్ ఇచ్చేసి.. పేరెంట్స్ ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఛోటా భీమ్, లిటిల్ కృష్ణ తరహా కార్టూన్ సీరియల్స్ కాలక్షేపానికి చూడటం మంచిదే! కానీ, నిద్రకు ముందు అవి చూపించడం కరెక్ట్ కాదు!
పిల్లలు పడుకోవడానికి అరగంట ముందు తల్లిదండ్రుల్లో ఎవరైనా వారికి సమయం కేటాయించాలి. ఓ అరగంట నీతికథలు, పద్యాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. కథలు వినడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. ‘అనగనగా ఒక కాకి..’ అనగానే పిల్లలు కాకిని ఊహించుకుంటారు. ‘చెట్టు కొమ్మపై వాలింది’.. అనగానే చెట్టు మీద కాకి ఉన్నట్టుగా భావిస్తారు. ఇలా పిల్లల్లో ఊహాశక్తిని పెంచడంలో కథలు కీలక భూమిక పోషిస్తాయి.
పిల్లలను పడుకోబెట్టడానికి రెండు గంటల ముందే వారికి ఆహారం అందివ్వాలి. పసిపిల్లలైతే నలభై నిమిషాల ముందు పాలు పట్టాలి. దీనివల్ల పిల్లలకు గ్యాస్ సమస్యలు రావు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే.. జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి.