ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుడి ఆవిర్భావ లీలనే కృష్ణాష్టమి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, భగవానుడి దివ్య ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ, ఆయన అపార కరుణను అనుభూతి చెందేందుకు ఒక
మహత్తర అవకాశం. ఈ పవిత్ర దినం మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపి, భగవంతుడితో మన సనాతన సంబంధాన్ని గుర్తు చేస్తుంది.
శ్రీకృష్ణుడి జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన ఆంతరంగిక శక్తితో ఈ లోకాన అవతరించడం భగవానుడి దివ్య లీలల్లో ఒకటి. దేవాదిదేవుడు, పరబ్రహ్మం, సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుడు కేవలం ఆయన స్వీయ సంకల్పం మేరకే లోకంలో అవతరిస్తాడు గానీ, భౌతిక ప్రకృతి నియమాలకు బద్ధుడై కాదు. మథురలోని కంసుడి కారాగారంలో దేవకీ వసుదేవులకు జన్మించినప్పుడు, శ్రీకృష్ణుడు శంఖ, చక్ర, గదా, పద్మాలతో చతుర్భుజ విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. తల్లి దేవకి ప్రార్థన మేరకు ఒక సామాన్య బాలుడిగా రూపాంతరం చెందాడు. శ్రీకృష్ణుడు అవతరించిన ఆ శుభ ఘడియలలో లోకమంతా ఆనందం, శాంతి నెలకొని, దిక్కులన్నీ ప్రసన్నమైనట్టు శ్రీమద్భాగవతం చెబుతుంది.
సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు తాను యుగయుగాన అవతరిస్తానని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రకటించాడు. అంతేగాక, ఆయన జీవితం, లీలలు, బోధనలు మానవాళికి గొప్ప సందేశాన్ని అందిస్తాయి. శ్రీకృష్ణుడు కేవలం ఏడేళ్ల వయసులో తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, దానిని ఏడు రోజుల పాటు నిలబెట్టాడు. ఇది ఆయన అసాధారణ శక్తిని, మనం ఆయన్ని ఒక సాధారణ మానవుడిగా చూడకూడదని నిరూపిస్తుంది. ఆయన లీలలు ప్రాపంచిక మాలిన్యాలకు అతీతమైనవి. శ్రీకృష్ణుడి జననం, కర్మల దివ్యత్వాన్ని తెలుసుకున్నవారు ఈ భౌతిక ప్రపంచంలోకి తిరిగి రారు, శాశ్వత ధామాన్ని చేరుకుంటారు. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే! భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’ (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందు). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.
కృష్ణాష్టమి నాడు భక్తులు కృష్ణకృపను పొందడానికి కొన్ని ఆచారాలను పాటించవలసి ఉంటుంది. ఉపవాసం: స్వామి ఆవిర్భవించిన అర్ధరాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండటం. అంటే, ఆయనకు సమీపంలో వసిస్తూ సేవలు ఆచరించడం. ఆహారాన్ని స్వీకరించకుంటే ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు, పల్లీలు, సగ్గుబియ్యం లాంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. నామ జపం: ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపించడం ముఖ్యమైన విధి. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించడం, వినడం ఇందులో ముఖ్యమైన అంశం. శాస్త్ర పఠనం: భగవద్గీత, శ్రీమద్భాగవతం లాంటి గ్రంథాల నుంచి శ్రీకృష్ణుడి లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.
ఆలయ దర్శనం: శ్రీకృష్ణుడి దేవాలయాలను సందర్శించి ఆయన సుందర రూపాన్ని దర్శించుకోవడం.
హారతి, పూజ: ఉదయం బ్రహ్మ ముహూర్తంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి హారతి ఇవ్వడం, తులసీదేవిని పూజించడం.
పలు కారణాల రీత్యా జన్మాష్టమి రోజున ఆలయానికి వెళ్లలేని భక్తులు కూడా ఆ స్వామి అపార కృపను పొందే అవకాశాన్ని కూడా ఆయనే మనకు ప్రసాదించారు. కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి ఉండటమే అందుకు గల కారణం. శ్రీచైతన్య మహాప్రభువులు బోధించినట్లు, కపటం, కలహాలతో కూడిన ఈ కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
అనే ఈ పదహారు నామాలు కలి కల్మషాలను నాశనం చేయగలవు. సకల వేదాలనూ వెతికినా, ఇంతకన్నా ఉత్తమమైన మార్గం మరొకటి గోచరించదు. ఈ పవిత్రమైన మంత్రాన్ని జపించడం ద్వారా మనస్సు పవిత్రమై, హృదయంలోని ఆరాటం, అశాంతి తగ్గి, ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందుతుంది. శ్రీకృష్ణుడి పట్ల సహజమైన ఆకర్షణ మేల్కొని, శాశ్వతమైన సచ్చిదానంద స్థితిని చేరుకోగలరు. అందుకే, హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించడం ఈ యుగంలోని అత్యంత శ్రేష్ఠమైన ధర్మంగా (యుగ ధర్మం) శాస్ర్తాలు వివరిస్తున్నాయి. అలా ప్రతిరోజూ ఈ మహా మంత్రాన్ని జపించే భక్తుడికి అనుదినం జన్మాష్టమే!
శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలంటే, ఆయన ఉపదేశించిన నాలుగు ముఖ్య సూత్రాలను పాటించాలి.
మన్మనా: సదా స్వామిని స్మరించడం. హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా ఇది సులభం. నీటి రుచిని, సూర్య చంద్రుల కాంతిని, శబ్దాన్ని, సువాసనను మొదలైన ప్రకృతి సౌరభాలన్నిటినీ ఆ సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణుడి విభూతులేనని తలవడం ద్వారా ప్రతి క్షణం ఆయన్ని స్మరించవచ్చు.
మద్భక్తో: శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ పూర్వకమైన భక్తిని పెంపొందించుకోవడం.
మద్యాజి: ప్రతిరోజూ స్వామిని పూజించడం. దేవాలయాలలో లేదా ఇంట్లో విగ్రహాన్ని/చిత్రపటాన్ని పుష్పాలు, అగరబత్తులతో పూజించవచ్చు.
మాం నమస్కురు: ప్రతిరోజూ శ్రీకృష్ణుడికి వందనం సమర్పించడం.
ఈ నాలుగు సూత్రాలూ సాధకుడిని భక్తి మార్గంలో పురోగమింపజేసి, ఆనందమయ జీవితానికి బాటలు వేస్తాయి.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ,
96400 86664