దయ మనిషి దగ్గరున్న నిజమైన సంపద. ఇది డబ్బు కాదు. మనసును వెలిగించే నిశ్శబ్దమైన ప్రేమ. ఒక చిరునవ్వు, ఓదార్పు మాట, చిన్న చేయూత, ఆత్మీయ ఆలింగనం, నేను ఉన్నాననే భరోసా.. ఇవన్నీ దయారూపాలే. దీనికి కొలమానం లేదు. ఇతరుల కోసం చేసే చిన్నపాటి సాయం కూడా మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రపంచ విశ్వవిద్యాలయాలు కూడా ఈరోజు దయను నాయకత్వ లక్షణంగా పరిగణిస్తున్నాయి. బుద్ధితో పాటు మానవత్వం కూడా అవసరమని ప్రపంచం గ్రహించింది. ఇస్లామ్‌లో దయ ఒక గుణం మాత్రమే కాదు, ఇస్లామ్ విశ్వాసానికి గుండె లాంటిది. దయ గురించి ముహమ్మద్ ప్రవక్త (స) చెప్పిన ప్రబోధనం అనుసరణీయం. ‘మనసును గాయపరచే దానం కన్నా మృదువైన మాట, క్షమాగుణం చాలా మేలు’ (2:263) అంటుంది ఖురాన్. అనాథ, పేద, పరిచయమున్నా లేకపోయినా… ప్రతి మనిషిపై దయ చూపటం ఇస్లాం నేర్పిన మార్గం.
రోజువారీ జీవితంలోనూ చిన్న చిన్న పనుల ద్వారా మనలోని దయను జాగృతం చేయవచ్చు. చిన్న ఆచరణలే అద్భుతాలు చేస్తాయి. చిరునవ్వుతో ‘అస్సలాం అలైకుమ్’ అని పలకరించడం, ఇతరుల కోసం మౌన ప్రార్థన (దువా), క్షమించడం… ఇవన్నీ బలహీనతలు కాదు. మన హృదయంలోని బలాలు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం… ప్రేమను పెంచే మధురమైన మార్గం. ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచడం గొప్ప పుణ్యం. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడం, బాధలో ఉన్నవారికి అండగా నిలవడం.. ఇలాంటి గుణాలు అలవర్చుకున్న మనిషే నిజమైన విశ్వాసి.