విరక్తస్య తు సంసారాత్ జ్ఞానం కైవల్య సాధనమ్
తేన పాపాపహానిః స్యాత్ జ్ఞాత్వా దేవం సదాశివమ్
(దర్శనోపనిషత్ 6-47)
‘సంసారం నుంచి విరక్తుడైన వానికి మోక్ష సాధనమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో దేవుడైన సదాశివుని తెలుసు కోవడంతో పాపం నశించిపోతుంది..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. కన్యాకుబ్జ నగరంలో అజామీళుడు అనే బ్రాహ్మణుడు వేదాలను అభ్యసించి, సత్కర్మలు చేసేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు ఒక వేశ్య చేష్టలు చూసి అతని మతి చలించి ఆమెతో స్నేహం చేశాడు. క్రమంగా తన సదాచారాన్ని అంతా వదిలి పెట్టేశాడు. ఆమెనే లోకంగా గడపసాగాడు. వ్యభిచారమే గాక అన్ని పాపాలూ మూట కట్టుకున్నాడు. ఈలోగా మరణ సమయం ఆసన్నమైంది. భయంకరమైన రూపాలతో యమదూతలు అతణ్ని తీసుకెళ్లడానికి వచ్చారు. వారిని చూసిన భయంలో.. నోరు పెగలకపోయినా, బలవంతాన అతని చిన్నకొడుకు ‘నారాయణ’ను పిలుస్తూ భయంతో వణికిపోసాగాడు. ఈలోపుగా దివ్య తేజస్సు కలిగిన విష్ణు దూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు.
‘అజామీళుడు చివరి క్షణాల్లో శ్రీహరి నామాన్ని ఉచ్ఛరించాడు కాబట్టి, అతనికి పాప పరిహారం లభించింద’ని యమదూతలతో చెప్పారు. అజామీళుడూ కళ్లు తెరిచాడు. అతని శరీరం కొత్త జవసత్వాలు పుంజుకుంది. సంసారంపట్ల పూర్తిగా విరక్తి కలిగింది. విష్ణు దూతల దర్శనం జ్ఞానోదయానికి కారణమైంది. ఆ జ్ఞానం మోక్షమార్గానికి చక్కగా సహకరించింది. అతను పశ్చాత్తాపంతో తనను తాను ప్రక్షాళన చేసుకున్నాడు. పూర్వపు సదాచారాన్ని అంతా పునరుద్ధరించుకున్నాడు. సాధనలో మరింత పురోగతి సాధించి మోక్షాన్ని పొందాడు. ఈ కథ ద్వారా ఎంత పాపాత్ములైనా అంత్యకాలంలో దైవాన్ని స్మరిస్తే మోక్షం పొందగలరని తెలుస్తుంది. వ్యాపారంలో నష్టం వచ్చిన తర్వాత మాత్రమే సరైన బుద్ధి కలుగుతుంది. వ్యాపారం చేసే అర్హత వస్తుంది. అలాగే, జీవితంలో తానే గొప్ప అనుకునే మనిషికి.. ఆపత్కాలంలో గానీ భగవంతుడు గుర్తుకురాడు. సదా దైవ నామస్మరణతో గడిపేవాడిని లౌకిక విషయాలు బాధించవు అని అజామీళుడి కథ తెలియజేస్తుంది.