ఒకప్పుడు ఇక్కడ రాక్షషులు ఉండేవారట. ఇది ఇప్పుడు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్న కథలా మిగిలిన విషయం. అయితే ఆ రాక్షసులు మరెవరో కాదు.. పరలోకం నుంచి దిగివచ్చిన ఒకనాటి దూతలే అని బైబిల్ చెబుతున్నది. దేవుణ్ని ఆరాధించే దూతల్లో ఒకరు ఎదురు తిరిగి అక్కడి నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతను బలం కూడగట్టుకోవడానికి మంచి దూతలను చెడుగా మార్చే ఎత్తులు వేశాడు. అతను ఆశించినట్టే.. కొందరు దేవదూతలు ఆ మాటలు విన్నారు. వాళ్లు దేవుడు తమకు నిర్దేశించిన పనులను నిలిపేశారు. భూమ్మీద మానవ శరీరంతో మసలడం మొదలుపెట్టారు. దేవుడి కుమారులైన ఆ దూతలు భూమిపై ఉన్న అందమైన స్త్రీలను చూసి, వారితో జీవించాలని కోరుకున్నారు. ఆ స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారికి కలిగిన సంతానం మొదట్లో సాధారణ మనుషుల్లాగే ఉన్నారు. రాను రాను ఎత్తుగా, బలంగా రాక్షసుల్లా పెరిగిపోయారు.
దేవుడు ఏ పనులైతే చేయొద్దని చెప్పాడో.. వాటినే చేయడం పనిగా పెట్టుకున్నారు. వారిలోనూ కొందరు మంచివారు ఉన్నారు. ముళ్లకంపల్లో మల్లెపువ్వు ఉన్నట్టే… హనోకు అనే సత్పురుషుడు దేవునితోపాటు నడిచి జీవించాడు. ఆయన మరణం తర్వాత వచ్చిన మరో సత్పురుషుడు నోవహు మంచివారికి అండగా నిలిచాడు. దైవాజ్ఞ మీరిన దుష్టులను శిక్షించాడు. ఒకరోజు నోవహుతో దేవుడు, ‘తాను చెడ్డ వాళ్లనందరిని నాశనం చేసే సమయం వచ్చింద’ని చెప్పాడు. అయితే దేవుడు నోవహును, ఆయన కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. వారితోపాటు నోరు లేని జంతువులనూ రక్షించాడు. రక్కసి మూకను మాత్రం అంధకారంలో బంధించాడు. ఆ రాక్షస జాతి అంతమైనా, దాని ఆనవాళ్లు, క్రీనీడలు ఇప్పటికీ మనల్ని వదల్లేదు. ఇది ఐతిహ్యమే కావొచ్చు. కొందరిని చూసినప్పుడు మాత్రం వాస్తవం అనిపిస్తుంది. భగవంతుడి బిడ్డలని భావించేవాళ్లు దేవదూతల్లానే ఉండటానికి ప్రయత్నించాలి. దైవాజ్ఞ మీరి వ్యవహరించిన మనుషులు రాక్షసులతో సమానం.