AP Cabinet Meeting | ఏపీలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సోమవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం ఆ వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్, మేధావులతో కలుసుకుని వెళ్లేలా క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ఉండనుందని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలు, కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు, నిపుణులకు కేంద్రంగా ఏపీ మారుతోందని ధీమా వ్యక్తం చేశారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంతో పెద్ద ఎత్తున స్టార్టప్‌లు వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఐదు వేల మంది నిపుణులు, స్టార్టప్‌లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేశారు. రాష్ట్రంలో డిజిటల్ అనుసంధాన నైబర్‌హుడ్ వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం అర్థిక సాయం అందించనుందని చెప్పారు.
విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు, రుషికొండ, కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించిందని అన్నారు. తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం ఓర్వకల్లులో 50 ఎకరాలు కేటాయిస్తున్నామని తెలిపారు. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూప్‌నకు భూమి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్‌కు వందెకరాలు ఇచ్చినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్‌కు 150 ఎకరాలు, కృష్ణా జిల్లా బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటుకు 40 ఎకరాలు, అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్‌కు 300 ఎకరాలకు పైగా కేటాయించామన్నారు.