కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులెందరో లబ్ధప్రతిష్ఠులుగా ముద్ర పడ్డారు. పురుషుడిగా ఆహార్యం మార్చుకున్న స్త్రీమూర్తుల ప్రస్తావన మాత్రం ఎక్కడో గానీ కనిపించదు. అలాంటి అరుదైన కళాకారిణి జమ్మ మల్లారి. ఉగ్గుపాల వయసు నుంచే ఒగ్గు కథలవైపు మొగ్గు చూపించిన ఆమె.. ఆరు దశాబ్దాలుగా అతనిగానే ఆ జానపద కళారూపాన్ని తన భుజాలపై మోస్తున్నారు. చిన్నప్పటి నుంచి పురుష ఆహార్యంలోనే కనిపించే మల్లారి.. కామరతి కళారూపం ప్రదర్శించినప్పుడు స్త్రీమూర్తిగా కనువిందుచేస్తుంది. ఒగ్గు కళకే తన జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణలో ఒగ్గు కథ తొలి మహిళా కళాకారిణిగా గుర్తింపు పొందిన జమ్మ మల్లారి ప్రస్థానం ఇది..
జానపదానికి ఆలవాలం తెలంగాణ. తమ జీవితాన్ని ధారపోసి అంతరించిపోతున్న కళారూపాలను నిలబెట్టిన మహనీయులు ఎందరో! అలాంటి వారిలో ఒకరు జమ్మ మల్లారి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి ఆమె స్వగ్రామం. జమ్మ గుండాలు- చెన్నెమ్మ దంపతులకు ఏడుగురు ఆడకూతుళ్లు, ముగ్గురు కొడుకులు. వారిలో ఒకరు మల్లారి. ఆమె తండ్రి గుండాలు ఒగ్గు కళాకారుడు. దేవుడి లగ్గాలు చేయించేవాడు. ఆయన సంతానంలో ఎవరికీ పట్టుచిక్కని ఒగ్గు కథపై మల్లారికి చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తండ్రితో దేవుడి లగ్గాలకు, ఒగ్గు కథ ప్రదర్శనలకు తోడుగా వెళ్తుండేది. తండ్రి కథ చెబుతుంటే.. తాళం కొడుతూ, డోలు వాయిస్తూ, రాగాలు తీస్తూ… మెలకువలు ఒడిసిపట్టింది. అలా చిన్నప్పటి నుంచే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.
మల్లారి తన పదహారో యేట తొలిసారి సొంతంగా ఒగ్గు కథ చెప్పింది. మొదటి ప్రదర్శనతోనే అందరినీ కట్టిపడేసింది. అలా మొదలైన ఆమె ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. విలక్షణమైన గాత్రం, సలక్షణమైన శ్రుతిలయలు ఆమె సొంతం. బీరప్ప గాథ, మల్లన్న కథ, ఎల్లమ్మ వ్యథ ఇలా ఏ దేవుడి చరితనైనా మల్లారి పూర్తి సాధికారతతో విడమరచి పాడేది. ఒగ్గు కథలు కేవలం మగవాళ్లకే పరిమితమైన రోజుల్లో ఆమె గజ్జెకట్టి, తలపాగా చుట్టి, భుజాన గొంగళి వేసుకొని.. పురుషుడి ఆహార్యంలో అనర్గళంగా కళను ప్రదర్శించేది. ఆమె ఒగ్గు కథ చెబుతుంటే.. ఎన్ని పనులున్నా ఒగ్గేసి ఊ కొడుతూ మైమరచిపోయేవారు జనం. ఆడపిల్లలు గడప దాటితే నేరమనుకునే ఆ రోజుల్లో తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసింది మల్లారి. సొంతూళ్లో మొదలైన ఆమె కళావిన్యాసం అనతి కాలంలోనే ఎల్లలు దాటి ఇతర రాష్ర్టాల్లోనూ చిందేసింది. మల్లారి ప్రదర్శన ఉందని తెలిస్తే చాలు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలూ తండోపతండాలుగా తరలి వచ్చేవారు. తెలుగు రాష్ర్టాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చి.. తెలంగాణ ఒగ్గు కథకు తానెక్కిన ప్రతి వేదికపైనా పట్టం కట్టింది జమ్మ మల్లారి.
కళా సేవలో తరిస్తున్న తన జీవితాన్ని సాధారణ మనుషులతో పంచుకోవాలని భావించలేదు మల్లారి. వేలాదిగా దేవుడి లగ్గాలు చేసిన ఆమె.. ఆ దేవుణ్నే మనువాడింది. తన పద్దెనిమిదో యేట బీరప్ప స్వామినే భర్తగా స్వీకరించింది. ఒగ్గు కథనే తన సంతానంగా భావించి, ఆ కళా రూపాన్ని పెంచి పోషించింది. తెలంగాణలో ఎక్కడ బీరప్ప కల్యాణం జరిగినా.. అక్కడ మల్లారి కచ్చితంగా ఉండాల్సిందే! ఆ స్వామి గాథను నోరారా వినిపించాల్సిందే అన్నంతగా ప్రశస్తి పొందింది ఈ జానపద కళారాజ్ఞి.
మల్లారి బడికి వెళ్లి చదువుకున్నది లేదు. అయితేనేం, ఆమె ఏకసంతాగ్రాహి. తండ్రి చెబుతున్న కథలు విని మనోఫలకంపై ముద్రించుకుంది. అందుకేనేమో, గంటల తరబడి సాగే ఒగ్గు కథలను ఎలాంటి పుస్తకాలు చూడకుండా అలవోకగా, తడబాటు లేకుండా చెప్పేస్తుంటుంది. ‘ఇప్పుడు వయసు పైబడటంతో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. కూర్చొనే కథ చెబుతున్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఒగ్గు కథ చెప్పడంలో తగ్గేదే లేదు. నేను ఎక్కడికి వెళ్లినా చక్కగా ఆదరిస్తున్నారు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావించడం లేదు. ఒగ్గు కళ ద్వారా నాకు కలిగిన అదృష్టం’ అని వినమ్రంగా చెబుతారు 80 ఏండ్ల మల్లారి. ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా ఒగ్గు కథ ఉందంటే చాలు మల్లారి సిద్ధమైపోతారు. శక్తినంతా కూడదీసుకొని కథను రక్తికట్టిస్తారు.
డబ్బు ఏండ్లపాటు ఒగ్గు కథకు తన జీవితాన్ని అంకితం చేసిన జమ్మ మల్లారిని అప్పటి ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మల్లారికి సరైన గుర్తింపు లభించింది. తన ప్రాణం పెట్టి ఒగ్గు కళకు జీవం పోసిన మల్లారికి 2020లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసింది. లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించింది. ఆమె చెప్పిన ఒగ్గు కథలు.. ఈ జనపద కళారూపాన్ని మరింత కాలం పదిలంగా కాపాడతాయని చెప్పడంలో సందేహం లేదు.
మా తాతల, తండ్రుల కాలం నుంచి ఒగ్గు కళనే నమ్ముకున్నరు. నేను కూడా దాన్నే నమ్ముకున్నా. మా నాయన నన్ను దేవుడిక్చి పెండ్లి చేసిండు. అప్పటి నుంచి నా జీవితం దేవుడికే అంకితం చేసిన. నేను వేలకొద్దీ దేవుడి లగ్గాలు, పూజలు చేయించిన. ఎన్నెన్నో ఒగ్గు కథలు చెప్పిన. ఎన్ని చేసినా.. తెలంగాణ వచ్చిందాక నాకు గుర్తింపు రాలె. కేసీఆర్ సార్ సీఎం అయ్యాకనే నేను అందరికి తెలిసిన. రవీంద్రభారతిలో చక్కగ సన్మానం చేయించిండు. అది నాకు జరిగింది కాదు. మన తెలంగాణ కళ ఒగ్గు కథకు జరిగిన ముచ్చట. ఆయన లెక్కనే ప్రతి ఒక్కరూ జానపద కళలను ఆదరించాలె. కళను బతికించాలె. నా వరకైతే, నేను బతికున్నంత కాలం ఒగ్గు కథలు చెప్తా! ఈ జీవితానికి ఇది సాలు.
– జమ్మ మల్లారి
– మడ్డి యాదగిరి, యాచారం,రంగారెడ్డి జిల్లా