ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి తినకపోవడం, పోషకాలు లేని జంక్ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయా బెటిస్ ముప్పు వెంటాడుతున్నది. అయితే, ఒక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆహారంలో మూడు ముఖ్యమైన మార్పులు చేసుకుంటే మధుమేహం రాకుండా సులభంగా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధన కోసం మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 55 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న 4700 మందిని ఆరేండ్లపాటు పరిశీలించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ప్రత్యేక డైట్ నియమాలను పాటించిన మొదటి గ్రూపులో డయాబెటిస్ వచ్చే ముప్పు ఏకంగా 31% తగ్గినట్లు గుర్తించారు. ఈ మార్పు వారి బరువు తగ్గడానికి, మెటబాలిక్ హెల్త్ మెరుగుపడటానికి కూడా దోహదపడింది. డయాబెటిస్ రిస్ తగ్గించే ముఖ్యమైన మూడు డైట్ మార్పులు ఇవే..
మెడిటరేనియన్ డైట్: ఈ తరహా ఆహార పద్ధతిలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎకువగా ఉంటాయి. వీటితోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు లభించే ఆలివ్ ఆయిల్, బాదం, జీడిపప్పు వంటి నట్స్, గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్ పుషలంగా ఉండటం వల్ల శరీరంలో అంతర్గత వాపులు తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చకెర స్థాయులు అదుపు తప్పకుండా సమతుల్యంగా ఉంచుతుంది.క్యాలరీల పరిమాణం: శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి రోజూ తీసుకునే క్యాలరీల పరిమాణాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. క్యాలరీలు తగ్గించడం వల్ల క్రమంగా శరీరంలో అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇది గ్లూకోజ్ నియంత్రణను సులభతరం చేస్తుంది. మధుమేహానికి ప్రధాన కారణమైన ఊబకాయం సమస్యను సమర్థంగా నివారిస్తుంది.
జీవనశైలిలో మార్పు: కేవలం ఆహార నియమాలు మాత్రమే కాకుండా, దానికి శారీరక శ్రమను కూడా జోడించినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. రోజువారీ మెడిటరేనియన్ డైట్‌తో పాటు క్రమం తప్పకుండా నడవడం లేదా బరువులు ఎత్తే తేలికపాటి వర్కవుట్లు చేయాలి. దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతుంది. కేవలం ఆరోగ్యంగా ఉన్నవారే కాకుండా, ప్రీ-డయాబెటిస్, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారితో పాటు కుటుంబంలో తల్లిదండ్రులకు మధుమేహం ఉన్న హిస్టరీ ఉన్నవారు సైతం ఈ డైట్ మార్పులను వెంటనే ప్రారంభించడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు అని నిపుణుల సలహా.