‘నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. ఎన్ని చూసుంటాను’ ఓ సినిమాలో డైలాగ్ ఇది. విజయవంతమైన వ్యక్తులు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటారు.ఎన్నెన్నో ఆటంకాలను ఎదుర్కొని ఉంటారు. అవన్నీ వారిని రాటుదేలేలా చేస్తాయి. అనుకోని ఆపదలు ఎదురైనా సరైన పరిష్కారం కనుగొనేలా వారిని తీర్చిదిద్దుతాయి. అంచెలంచెలుగా ఎదిగి ఒక దశకు చేరుకున్నాక వారి ఆలోచనలు ఎదుటివారు ఊహించలేనంత స్థాయికి చేరుకుంటాయి. ఈ క్రమంలో వారు చూపించే స్థితప్రజ్ఞత అబ్బురపరుస్తుంది. ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఎప్పుడెలా స్పందిస్తారో తెలుసుకుందాం..
సమస్య మూలం తెలుసుకోవడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఒక సమస్య తీరిందని ఊపిరి పీల్చుకునేంతలో మరో సమస్య పుట్టుకొస్తుంది. ఇలాంటివెన్నో అధిగమించిన వ్యక్తులు కొత్త సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తెగ హైరానా పడిపోరు. సమస్య పూర్వాపరాలు పరిశీలిస్తారు. గరిష్ఠంగా కలిగే ఇబ్బందేమిటో అంచనా వేస్తారు. అంతేకానీ, వెంటనే బుర్రకు తట్టిన పరిష్కారం సూచించేయరు. గంటలు, రోజులు గడిచే కొద్దీ ఆ సమస్య తేలికపడుతుందని భావిస్తే.. తక్షణం స్పందించరు. వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తారు. అదేదో సినిమాలో ‘ఒక్కోసారి పట్టుకోవడం కన్నా.. విడిచిపెట్టడమే గొప్పది అవుతుంది’ అన్నట్టుగా భావిస్తారు.
‘తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వినడం’ గొప్ప లక్షణం అని చెబుతారు పెద్దలు. విజయ సూత్రాల్లో ఇదీ ఒకటి. తెలిసిందల్లా చెప్పేసి.. తర్వాత ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంటారు చాలామంది. ఈ వైఖరి మీ విజయాన్ని దూరం చేస్తుంది. విజయవంతమైన మనుషులు.. చాలా మితంగా మాట్లాడతారు. వినడాన్ని అమితంగా ఇష్టపడతారు. వారు మాట్లాడాల్సి వచ్చినా.. ఆచితూచి స్పందిస్తారు. చిన్న చిన్న విరామాలు ఇస్తూ.. తాము చెబుతున్న విషయాన్ని ఎదుటివారు ఎలా గ్రహిస్తున్నారో అంచనావేసి, మాటలు కొనసాగిస్తారు.
కెరీర్లో పైస్థాయికి చేరుకోవాలని భావించేవారు ఆరోగ్యంపై దృష్టిసారించడం చాలా అవసరం. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలు చాలామంది ఎనభయ్యో పడిలోనూ ఉల్లాసంగా కనిపించడం మనమూ చూస్తూ ఉంటాం. అందుకు కారణం, తమ విజయ యాత్రలో వాళ్లు ఆరోగ్యానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడమే అని తెలుస్తుంది. విజయం కోసం అహరహం శ్రమిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు చాలామంది. తీరా అనుకున్న విజయం దక్కేసరికి దాన్ని ఆస్వాదించడానికి శరీరం సహకరించదు. సరైన ఫిట్నెస్ ఉన్నప్పుడే.. పెరిగిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించే శక్తి ఉంటుంది.