నమస్తే మేడమ్. నా వయసు 41 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం. నాది 26, 27 రోజుల పీరియడ్ సైకిల్. మూడు రోజులకే రుతుస్రావం ఆగిపోతుంది. నెలసరి సక్రమంగానే వస్తున్నా గత కొన్ని నెలలుగా పీరియడ్స్ మొదలైన తొమ్మిదీపది రోజుల్లో స్పాటింగ్ కనిపిస్తున్నది. ఇది సాధారణమైన విషయమేనా? ఏదైనా వ్యాధికి సంకేతమా? తెలియజేయగలరు.
ముందుగా మీరు ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉన్నారా.. అన్నది చూసుకోండి. ఎక్కువ ఉంటే తగ్గండి. థైరాయిడ్ నియంత్రణలో లేకపోయినా ఇలాంటివి జరుగుతాయి. ఇంకో విషయం, మీ వయసు రీత్యా చూస్తే, అండం విడుదలైనప్పుడు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా ఈ ఇబ్బంది తలెత్తి ఉండవచ్చు. అయితే స్పాటింగ్ కనిపించడం సాధారణ విషయం కాదు. లోపల కణితి ఉన్నా ఇలా జరగవచ్చు. ముందుగా గైనకాలజిస్టును సంప్రదించి, అబ్డామినల్ అల్ట్రాసౌండ్, వ్జైనల్ స్కాన్ తీయించుకోండి. ఒకవేళ కణితి ఉంటే హిస్టెరోస్కోపీ ద్వారా శాంపిల్ తీసి టెస్టులకు పంపుతారు. ఇబ్బందికరమైంది కాకపోతే సాధారణ మందులు వాడితే సరిపోతుంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలైన పాప్స్మియర్, మమోగ్రామ్ టెస్టులు కూడా చేయించుకోండి. ఈ పరీక్షల్ని బట్టి మీ సమస్య ఏమిటన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చు. సరైన చికిత్స తీసుకోవచ్చు. భయపడాల్సిన పన్లేదు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్