కంటికి కనిపించని ప్లాస్టిక్ కణాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికీ కీడు చేస్తున్నాయి. శరీరంలోకి చొరబడి రోగాల బారిన పడేస్తున్నాయి. ప్లాస్టిక్ విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే ఈ సూక్ష్మ కణాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
శరీరంలోని ధమనుల నుంచి మెదడుతోపాటు గర్భస్థ పిండానికీ చేరుతున్నాయి. కణాలపై ఒత్తిడి పెంచి అవయవాల పనితీరును దెబ్బతీస్తున్నాయి. అలా జీవ సంబంధిత వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తున్నట్లు అధ్యయనకారులు నిర్ధారిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణమవుతూ.. వాటి శక్తిసామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయట.
సాధారణ వ్యక్తులకంటే ధమనుల ఫలకాలలో ప్లాస్టిక్ కణాలు ఉన్న వ్యక్తులలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. హృదయ సంబంధ సమస్యలతో మరణించే అవకాశం కూడా అత్యధికశాతం ఉంటుందని చెబుతున్నారు. కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్ ప్రమాదాన్ని కొట్టిపారేయొద్దనీ, రోగాలను కొని తెచ్చే ప్లాస్టిక్కు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.