e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home Top Slides అమ్మ ఆలన పురపాలన

అమ్మ ఆలన పురపాలన

అమ్మ ఆలన పురపాలన

అమ్మకు అసాధ్యం ఉంటుందా! పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుంది.ఆ అమ్మకు పాలన బాధ్యతలు అప్పగిస్తే! ఊరు బాగుపడుతుంది. ఈ అమ్మలూ అంతే! ఇంటిని చక్కదిద్దుకున్న ఈ వనితలు పాలకులై, తమ పట్టణాలకు ప్రథమ పౌరులై అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ‘అంతర్జాతీయ మాతృదినోత్సవం’ సందర్భంగా కార్పొరేషన్లలో మేయర్లుగా, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్లుగా తమదైన పాలనసాగిస్తున్న కొందరు తల్లుల పరిచయం ఇది.

తల్లిగా గెలిచి..

అమ్మ ఆలన పురపాలన

తల్లిగా ఇంటి బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వర్తించారామె. ఇప్పుడు ఊరు బాగుకోసం నడుం బిగించారు సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ. డిగ్రీ వరకు చదువుకున్న ఆమె తన ఇద్దరు పిల్లల చదువులు పూర్తయిన తర్వాత 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. అన్నపూర్ణ భర్త హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారు. కొడుకు ఎంఎస్‌ పూర్తి చేసి అమెరికాలో ఉండగా, కూతురి బీటెక్‌ పూర్తయింది. కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన ఈ తల్లి 2020లో సూర్యాపేట మున్సిపాలిటీ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పట్టణ అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి బాగోగులు చూస్తూ అందరితో ‘అమ్మా’ అనిపించుకుంటున్నారు.

ఓరుగల్లుకు సుధా‘రాణి’

అమ్మ ఆలన పురపాలన

విధేయత ఆమె ఆభరణం, ప్రజాసేవ ఆమె సంకల్పం. ఆటుపోట్లకు వెరవకుండా రాజకీయంగా ముందడుగు వేసిన గుండు సుధారాణి ఒకనాటి కాకతీయ రాజధాని నగరి వరంగల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ పట్టాపొందిన ఆమెకు చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఆసక్తి. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రెండు దశాబ్దాల కిందట వసుంధర మహిళా బ్యాంక్‌ చైర్మన్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్‌గా గెలిచి గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఫ్లోర్‌ లీడర్‌గా ఐదేండ్లు సేవలు అందించారు. ఎమ్మెల్యే అవకాశం త్రుటిలో చేజారినా నిరాశ చెందలేదు. రాజ్యసభ సభ్యురాలిగా ఆరేండ్లు ప్రజాసమస్యలపై పోరాడారు. టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె తాజాగా వరంగల్‌ మేయర్‌ పదవిని అలంకరించారు. చారిత్రక వరంగల్‌ నగర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెబుతున్నారు సుధారాణి. ‘ఒక కుటుంబాన్ని సమర్థంగా, పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దే తల్లులు రాజకీయాల్లోనూ రాణించగలరు. అమ్మకు అసాధ్యమంటూ ఏదీ ఉండదు కదా!’ అంటారు సుధారాణి.

ఉద్యమకారుల తల్లి

అమ్మ ఆలన పురపాలన

వ్యవసాయ కుటుంబం ఆమె నేపథ్యం. సమాజానికి సేవ చేయాలనే సంకల్పం మున్సిపల్‌ పీఠం వరకూ నడిపించింది. చేర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి ఓ సాధారణ తల్లి. ప్రజాక్షేత్రంలో మాత్రం అసాధారణ నాయకురాలు. తనను నమ్మి గెలిపించిన ప్రజల బాగోగుల కోసం నిరంతరం పాటుపడుతున్నారామె. తెలంగాణ ఉద్యమంలో భర్త శ్రీధర్‌రెడ్డికి అండగా నిలిచారు. ఉద్యమకారులకు కమ్మని భోజనాలు ఏర్పాటు చేస్తూ తల్లిపాత్ర పోషించారు. కొడుకును, కుమార్తెను ఉన్నతంగా చదివించి అమ్మగా బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు చేర్యాల అభివృద్ధికి అహరహం శ్రమిస్తున

తల్లిగా గర్విస్తున్నా..

అమ్మ ఆలన పురపాలన

తెలంగాణ ఉద్యమ కార్యక్షేత్రం సిద్దిపేట. ఆ పట్టణానికి ప్రథమ పౌరురాలిగా సేవలు అందిస్తున్నారు కడవేర్గు మంజుల. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న ఇంటికి కోడలిగా వచ్చారు. నాటి నుంచి భర్త రాజనర్సుకు అండగా ఉంటూ తనూ రాజకీయంగా ఎదిగారు. తల్లిగా ముగ్గురు పిల్లల బాగోగులు చూసుకుంటూ తన బాధ్యతలను నిజాయతీగా నిర్వర్తిస్తున్నారు. పిల్లల ప్రవర్తన చూసి తల్లి సమర్థతను అంచనా వేయవచ్చు. ‘నా బిడ్డలను క్రమశిక్షణతో తీర్చిదిద్దాను. నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చిన ప్రజలందరూ నా బిడ్డలే! వారికి సేవ చేసే అవకాశం లభించడం వరంగా భావిస్తాను. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా తల్లికి ఆనందం’ అంటారామె.

తల్లి పాత్రే గొప్పది

అమ్మ ఆలన పురపాలన

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న రాజకీయంగా రాణిస్తూ, తల్లిగా ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఇల్లాలిగా భర్తకు అండగా నిలుస్తూ, కోడలిగా అత్తమామల బాగోగులు చూసుకుంటున్నారు. ప్రాణాంతకమైన కొవిడ్‌ నుంచి పురప్రజలను రక్షించడానికి తనవంతుగా పాటుపడుతున్నారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవుడి సృష్టిలో అమ్మను మించింది లేదంటారామె. ‘నేనీరోజు నలుగురి గురించి ఆలోచిస్తున్నానంటే, పదిమందికీ సాయం చేస్తున్నానంటే మా అమ్మే కారణం. నా పిల్లల విషయంలోనూ మా అమ్మలా ఆదర్శంగా ఉండాలనుకుంటా. ప్రజాప్రతినిధిగానూ ఆమ్మ చెప్పిన మాటలనే ఫాలో అవుతుంటాను’ అంటారు స్వప్న.

అమ్మ నా స్నేహితురాలు

అమ్మ ఆలన పురపాలన

పదిమందిలో ఎలా నడుచుకోవాలో అమ్మ దగ్గరే నేర్చుకున్నా.. అంటారు జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బోగ శ్రావణి. తల్లిగా, స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా అమ్మ తనను గైడ్‌ చేసిందంటారు. ‘మా అమ్మవాళ్ల నాన్న ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన ప్రభావం అమ్మపై ఉండేది. సమాజంపై ఒక స్పష్టమైన అవగాహన ఉండేది. నన్నెంతో అపురూపంగా పెంచింది అమ్మ. తన దగ్గర చాలా ఫ్రీగా ఉండేదాన్ని. అన్ని విషయాలూ షేర్‌ చేసుకునేదాన్ని. పదో తరగతి వరకు వెల్గటూరులో చదివిన నేను ఇంటర్‌కు హైదరాబాద్‌కు వచ్చాను.
హాస్టల్‌లో ఉండలేకపోయేదాన్ని. అప్పుడు అమ్మే చదువు గొప్పదనం చెప్పి నాకు ప్రోత్సాహాన్నిచ్చింది. డెంటల్‌ కాలేజీలో చదివేటప్పుడు కూడా నేను నీరుగారిపోయిన ప్రతిసారీ అమ్మే నాకు ధైర్యాన్నిచ్చేది. అమ్మ ఆదర్శభావాలే నన్ను రాజకీయాల్లోకి నడిపించాయి. పెండ్లయిన తర్వాత రాజకీయాల్లోకి రావడం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కావడం జరిగింది. ఇద్దరు పిల్లలు. పనుల ఒత్తిడిలో పిల్లలను మిస్‌ అవుతున్నా అనిపిస్తుంటుంది. అయితే, అమ్మ నాతో ఉన్నట్టుగానే నేనూ వారితో స్నేహంగా ఉంటాను’ అని తన ప్రయాణంలో తల్లి పాత్రను చెప్పుకొచ్చారు శ్రావణి.

అంగన్‌వాడి అమ్మ

అమ్మ ఆలన పురపాలన

భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణికి రాజకీయాలు కొత్త. పదమూడేండ్లు అంగన్‌వాడి కార్యకర్తగా సేవలందించిన ఆమె సోషియాలజీలో పీజీ చేశారు. భర్త సిద్ధు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. తర్వాత అనుకోకుండా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. ‘అంగన్‌వాడి కార్యకర్తగా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందించాను. ఇప్పుడు నా బాధ్యతలు పెరిగాయి. వాటిని సమర్థంగా నిర్వహిస్తున్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఆడపిల్ల అనుకోలేదు. బాగా చదివించారు. నేను ఆటల్లో, పాటల పోటీల్లో పాల్గొనడానికి ఎంతో ప్రోత్సహించారు. నాకు ముగ్గురు కూతుళ్లు. జన్మనివ్వడంతో తల్లి బాధ్యత పూర్తవ్వదు. వారిని బాగా తీర్చిదిద్దితేనే అమ్మ గొప్పది అవుతుంది’ అంటారు వెంకటరాణి.

మదర్‌ థెరిసా ఆదర్శం

అమ్మ ఆలన పురపాలన

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తన ఉనికిని చాటుకున్నారు చొప్పదండి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ. భర్త భూమారెడ్డితో కలిసి మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ప్రజాక్షేత్రంలోనూ అవకాశాలు వచ్చాయి. చొప్పదండి గ్రామ పంచాయతీకి నీరజ మామయ్య తొలి సర్పంచ్‌ కాగా, మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలి చైర్‌పర్సన్‌ నీరజ కావడం విశేషం. పెద్దింటి కోడలుగా, ఇద్దరు బిడ్డల తల్లిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. 2020లో మున్సిపల్‌ ఎన్నికల్లో చొప్పదండి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చదివింది ఇంటర్‌ వరకే అయినా, సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడంలో ఆమెది ప్రత్యేక శైలి. ‘నాకు ఒక కొడుకు, కూతురు. వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాను. ఇప్పుడు చైర్‌పర్సన్‌గా మా చొప్పదండి బాగు కోసం కృషి చేస్తున్నాను. బీదసాదలను తన బిడ్డలుగా భావించిన మదర్‌ థెరిసా నాకు ఆదర్శం. ఆమె స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తున్నా’ అంటారు నీరజ.

తాను సైతం

అమ్మ ఆలన పురపాలన

తల్లి తెలంగాణ కష్టాలు ఆమెకు తెలుసు. ప్రత్యేక రాష్ట్రం కల సాకరమైనప్పుడు పొంగిపోయారు. ఇప్పుడు స్వపరిపాలనలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు జడ్చర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి. భర్త రవీందర్‌ నుంచి ఉద్యమ నేపథ్యం గురించి తెలుసుకున్న ఆమె ఇప్పుడు ఆ ఆకాంక్షలను నెరవేర్చే క్రతువులో భాగమయ్యారు. ‘ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జడ్చర్ల ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ పట్టణ పరిపాలన బాధ్యతలు నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. నాయకురాలిగా అనుభవం లేకపోవచ్చు. కానీ, ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఎంత బాధ్యతగా వ్యవహరిస్తానో, పాలనలోనూ అంతే నిజాయతీగా ఉంటాను. చెత్తా చెదారం లేకుండా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం నాకు తెలిసిందే! ఇప్పుడు మా పట్టణాన్ని ఇంటిలా అందంగా మార్చే పనిలో ఉన్నా. ఈ క్రమంలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కష్టంగా మారింది. అయితే, కుటుంబసభ్యుల సహకారంతో అన్ని ఆటంకాలను అధిగమించి మంచి ప్రజాప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకుంటాన’ని అంటున్నారు లక్ష్మి.

అమ్మ ఇచ్చిన ధైర్యమే!

అమ్మ ఆలన పురపాలన

రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా మాతృమూర్తిగా తన బాధ్యతను ఎన్నడూ విస్మరించనని అంటున్నారు ఖమ్మం మేయర్‌ పునుకోల్లు నీరజ. ‘ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నాకు ఆత్మీయతలు, అప్యాయతలు ఎక్కువే. ఇంటినిండా ఎప్పుడూ బంధువులు ఉండేవారు. మేం అయిదుగురం ఆడపిల్లలం. ‘నా బిడ్డలు అన్నిటా ముందుండాల’ని మమ్మల్ని బాగా చదివించారు నాన్న. మా నాన్న, తాతయ్య రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లే. అలా నాకూ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడిందేమో! మా అమ్మే మాకు కొండంత ధైర్యం. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చెబుతుండేది. ఆమె ధైర్యమే నాకొచ్చింది. మా ఆయన రాంబ్రహ్మం వ్యాపారవేత్త. పలు సేవాకార్యక్రమాలు చేస్తుంటారు. పెండ్లయిన తర్వాత 2005లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యా. 2016లో కార్పొరేటర్‌గా గెలిచా. బస్తీప్రజల ఒత్తిడితో మరోసారి ఎన్నికల బరిలో నిలిచి, గెలిచా. మేయర్‌గా నేను ఎంపికవ్వడం ఆనందంగా ఉంది. నా బాధ్యతలు మరింత పెరిగాయి. నా ఇద్దరు కొడుకులు ఇంజినీరింగ్‌ చేసి వ్యాపారరంగంలోకి అడుగు పెట్టారు. కోడలు డాక్టర్‌. పిల్లల టెన్షన్‌ లేదు. నా రాజకీయ విజయానికి మా కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది. ఒక మేయర్‌గా ప్రజలకు తల్లిలా సేవలు చేస్తాను. నా కన్నబిడ్డల్లా వారినీ చూసుకుంటాన’ని చెప్పుకొచ్చారు మేయర్‌ నీరజ.

అంతులేని ఆనందం

అమ్మ ఆలన పురపాలన

ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా, తల్లిగా ఆలోచిస్తే ప్రజాసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటారు నిజామాబాద్‌ మేయర్‌ దండు నీతూకిరణ్‌. తల్లిగారింట రాజకీయ నేపథ్యం లేకున్నా.. అత్తవారింటికి వచ్చాక ప్రజాప్రతినిధిగా మారారామె. ‘మా అమ్మ చదువుకోలేదు. కానీ, మమ్మల్ని బాగా చదువుకోవాలని చెప్పేవారు. డిగ్రీ దాకా చదివించారు. అమ్మ చూపే వెలకట్టలేని ప్రేమ, పెంచిన పద్ధతి నన్ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి. మా ఆయన చంద్రశేఖర్‌ 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మా ఆయన, అత్తగారి ప్రోత్సాహం వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాను. అనుకోకుండా మేయర్‌ను అయ్యాను. ప్రజలకు సేవచేసే అవకాశం అందరికీ రాదు. ఆ అదృష్టం వరుసగా రెండుసార్లు వరించింది. మా అమ్మను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మేలు చేస్తున్నా. కరోనా కట్టడికి కృషి చేస్తున్నాం. ఒక మహిళగా గొప్ప విజయాలు ఎన్ని సాధించినా కలగని ఆనందం నేను మాతృత్వం పొందిన క్షణంలో పొందాను’ అని చెబుతారు నీతూ కిరణ్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమ్మ ఆలన పురపాలన

ట్రెండింగ్‌

Advertisement