2025 సంవత్సరం.. దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది భారతీయుల ట్రావెలింగ్ భారీగా పెరిగింది. బుకింగ్స్.కామ్ తాజాగా వెల్లడించిన ‘హౌ ఇండియా ట్రావెల్స్-2025’ నివేదిక కూడా ఇదే విషయం చెబుతున్నది. అందులోనూ ఈ సంవత్సరం ట్రావెలింగ్‌లో మహిళలే ముందువరుసలో ఉన్నట్లు పేర్కొన్నది. సర్వేలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలకు చెందిన మూడువేలకు పైగా ప్రయాణికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, 73% మంది మహిళలు.. గమ్యస్థానాల ఎంపిక, బడ్జెట్, ప్రయాణ ప్రణాళికకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారని తేల్చారు. ప్రయాణాల్లో భద్రత, సౌకర్యాలపైనా మహిళలే ప్రత్యేక దృష్టి పెడుతున్నారని సర్వే ప్రతినిధులు వెల్లడించారు. యాత్రల ప్రారంభం నుంచి ముగింపు వరకు.. మొత్తం ప్రయాణ భారాన్ని వారే మోస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీనేజర్లు కూడా ప్రయాణాల్లో భాగస్వామ్యం అవుతున్నారట. కుటుంబ పర్యటనలలో 15 ఏళ్లలోపు పిల్లలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని సదరు సర్వేలో తేలింది. హోటల్ ఎంపికల నుంచి రోజువారీ కార్యకలాపాల వరకూ.. అన్ని విషయాలనూ యువతే నిర్ణయిస్తున్నది. తమ కుటుంబాలు ఎక్కడ, ఎలా విహరించాలో నిర్ణయిస్తూ.. ప్రయాణ ప్రణాళికను రూపొందించడంలో టీనేజర్లు ముందుంటున్నారు. ఇక యాత్రికుల్లో 28-43 ఏళ్ల వయసు గల ప్రయాణికులు ఎక్కువగా విహారయాత్రల వైపు ఆకర్షితులవుతున్నారు.
ఆరోగ్యం, ఆహారంతోపాటు ప్రకృతిని ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. సౌకర్యవంతమైన ఆన్లైన్ చెల్లింపులు, సౌలభ్యాన్ని పెంచే లాయల్టీ ప్రయోజనాలకు వీరు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఎప్పటితీరుగానే.. భారతీయ వృద్ధులు కూడా యాత్రల్లో తగ్గేదేలే అంటున్నారు. 60 ఏళ్లుదాటిన వాళ్లు ఎక్కువగా ఆధ్యాత్మికత, సాంస్కృతిక యాత్రలు చేస్తున్నారు. భారతీయ వారసత్వంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ప్రయాణాలను ఓ సాధనంగా భావిస్తున్నారు. 2025 ట్రావెలింగ్ ట్రెండ్స్‌లో గుర్తించదగ్గ మార్పు ఏమిటంటే.. ఈ ఏడాది వసతికి కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 80% మంది భారతీయ పర్యాటకులు.. తమ స్టేటస్‌కు తగ్గట్టుగా ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం హాస్పిటాలిటీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ఖరీదైన హోటల్స్, హోమ్‌స్టేలలో బస చేశారు. అందివస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఏఐని పూర్తిగా వాడేసుకుంటున్నారు. భారతీయ ట్రావెలర్లలో సగానికి పైగా ఇప్పటికే ట్రిప్ ప్లానింగ్ కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు. 83% మంది ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఏఐని ఒక మార్గంగా చూస్తున్నారు. ఇలా.. మొత్తంగా భారతీయ విహారయాత్రలను 2025 ఏడాది మరో మెట్టు ఎక్కించిందని అధ్యయనకారులు చెబుతున్నారు.