మాంగల్యానికి సూచిక సిందూరం. వీరత్వానికి ప్రతీక సిందూరం.మన భరతమాత నుదుటన దిద్దిన సిందూరంలా ఉంటుంది కశ్మీరం. అదే చోట జరిగిన ముష్కరుల దాడి.. ఎందరో ఆడపడుచుల సిందూరాన్ని
కరిగించింది. పచ్చని పచ్చిక బయళ్లలో పేట్రేగిన హింసకు.. భారత సైన్యం చేసిన ప్రతీకారం ఆపరేషన్ సిందూర్. ఉగ్రముఠాపై ఇండియన్ ఆర్మీ సాధించిన ఈ విజయం.. ట్రైలర్ మాత్రమే!!
కట్టూ, బొట్టూ భారతీయ స్త్రీకి ఆలంబన. హైందవ మహిళకు అనాదిగా వస్తున్న సంపత్తి. ఆ సంపదపై రెండువారాల కిందట పహల్గాంలో భీకర దాడి జరిగింది. కుదురుకుంటున్న కశ్మీరంలో కల్లోలం రేపాలన్న కసితో ఉగ్రముఠా ఈ విశృంఖల చర్యకు పూనుకొంది. సాయుధులై వచ్చిన ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులపై దాడికి తెగబడ్డారు. భారత సైన్యంతో తలపడే తెగువ లేని ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చి.. బుల్లెట్ల వర్షం కురిపించి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు.
ఆనాడు జరిగిన అకృత్యంలో మగవాళ్లే ఉగ్రవాదుల టార్గెట్. ఆడపడుచుల బొట్టు చెరపడమే వాళ్లకు రాక్షసానందం. నుదుటన బొట్టు చూశారు. మెడలో మాంగల్యం గమనించారు. పేరు అడిగారు. అనుమానం వస్తే.. మరింత దిగజారి ప్రవర్తించారు. కలలో కూడా ఊహించని ఘోరకలి అక్కడ కరాళ నృత్యం చేసింది. ఆ బీభత్సం సద్దుమణిగేసరికి.. దాదాపు అక్కడున్న ఆడవాళ్లంతా అయిదోతనం కోల్పోయారు. పిల్లలు.. తండ్రి లేని నిర్భాగ్యులు అయ్యారు. తల్లిదండ్రులు పుత్రశోకంతో కూలబడిపోయారు.
చిటికెడంత సిందూరం ఆడపడుచుకు ఆకాశమంత భరోసా ఇస్తుంది. వివాహిత సిందూరాన్ని కేవలం అలంకరణగా చూడదు. పాపిట మధ్యగా ధరించే అరుణ తిలకం.. తన భర్త ఆయుష్షు గీతగా భావిస్తుంది. కుంకుమ పెట్టుకునే సమయంలో తన భర్తను చల్లగా చూడమని కులదైవాన్ని ప్రార్థిస్తుంది. ఏ దుష్టశక్తులూ తమ బంధాన్ని విడదీయొద్దని దండం పెట్టుకుంటుంది. కుటుంబాన్ని తానే నడుపుతున్నా, భర్త తన మీద ఆధారపడి బతుకుతున్నా.. అయిదోతనమే ఆలంబనగా భావిస్తుంది. అలాంటి బొట్టును చెరిపేసిన వికృతానందం పొందిన ముష్కరులకు పక్షం రోజుల్లో పక్కా శిక్ష విధించింది భారత సైన్యం.
పాక్ ప్రేరేపిత ఉగ్రముఠాపై కురిసిన నిప్పుల వర్షం.. పహల్గాంలో తెల్లారిన మన ఆడబిడ్డలకు చిన్న ఊరట. ఉగ్రవాదుల దాడిలో భర్తను కోల్పోయిన ఓ మహిళ ఇండియన్ ఆర్మీకి సగర్వంగా సెల్యూట్ చేసింది. తీవ్రవాది అనేవాడు లేకుండా ఏరిపారేయాలని సైన్యాన్ని కోరింది. ఆ స్త్రీమూర్తి మాత్రమే కాదు.. యావత్ భారతం మన సైనికుల వీరత్వానికి హ్యాట్సాఫ్ చేస్తున్నది. అందుకే, ఆపరేషన్ సిందూర్ ఫేస్బుక్ వాల్‌పై అరుణకాంతులు చిలికింది. వాట్సాప్ స్టేటస్‌లో రుధిర గీతిక పలికింది. ఇన్‌స్టా రీల్స్‌లో ఇక్కడితో ఆగొద్దంటూ పోరుకు సిద్ధమంటుంది.
-జయహో భారత్.. జయహో ఇండియన్ ఆర్మీ!