ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి ఏడాది కావస్తున్నా.. నాటి బ్లాక్ అవుట్స్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి వచ్చినా.. నాటి జ్ఞాపకాలు పిల్లల మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో.. బాంబు దాడులు, మరణాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. కాబట్టి, వారిలో మనస్థయిర్యాన్ని నింపాలి. ఇందుకు పెద్దలే చొరవ చూపాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకు కావాల్సింది రక్షణ. తల్లిదండ్రులతోపాటు సమాజం కూడా తమకు తోడుగా ఉన్నదనీ, తమను జాగ్రత్తగా చూసుకుంటుందనే నమ్మకాన్ని వారికి కలిగించాలి. యుద్ధానికి సంబంధించిన వార్తలతో భయభ్రాంతులకు గురయ్యే చిన్నారులను ప్రేమగా దగ్గిరికి తీసుకోవాలి. దీనివల్ల తాము సురక్షితంగా ఉన్నామనే భావన పిల్లల్లో కలుగుతుంది.
యుద్ధానికి సంబంధించిన టీవీ వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు.. పిల్లల మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఇలాంటి వాటికి పిల్లల్ని సాధ్యమైనంత దూరంగా ఉంచడం మంచిది.
కొందరు పిల్లలు భయంతో లోలోపలే కుంగిపోతుంటారు. యుద్ధ ప్రభావం తగ్గిపోయినా.. వారిలో ఆ భయం అలాగే ఉండిపోతుంది. కాబట్టి, తమ భయాన్ని, బాధను బయటపెట్టేలా పిల్లలను ప్రోత్సహించాలి. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి. చిన్నారులు భయపడుతున్నట్లు గుర్తిస్తే.. ‘నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. కానీ ధైర్యంగా ఉందాం’ అని చెప్పాలి. దీనిద్వారా తమ భావాలు సహజమైనవేనని వారికి అర్థమవుతుంది.
యుద్ధ పరిస్థితుల గురించి పిల్లలతో అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. వారి వయసును బట్టి.. అర్థమయ్యే రీతిలో విషయాలను వివరించి చెప్పాలి. అయితే, మరణాల సంఖ్య, భయంకరమైన దృశ్యాలు లాంటి భయపెట్టే వివరాలకు దూరంగా ఉంచాలి.
పరిస్థితులు ఎంతలా దిగజారినా.. పిల్లల దినచర్యలో కొంతైనా క్రమశిక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. నిర్ణీత సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం వంటివి పాటించాలి. పిల్లలకు కథలు చెప్పడం, చిన్నచిన్న ఆటలు ఆడిస్తూ వారి దృష్టిని మళ్లించాలి.
యుద్ధ సమయంలో ఇతరులకు సహాయం చేసే డాక్టర్లు, స్వచ్ఛంద సేవకుల గురించి పిల్లలకు వివరించాలి. ప్రపంచంలో చెడు ఉన్నప్పటికీ.. సహాయం చేసే మంచివారు కూడా ఉన్నారనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారిలో సరికొత్త ఆశలను నింపాలి.