ఆహార అలవాట్లను కూడా.. కాలానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇష్టమైన వంటకమైనా.. సీజన్‌కు సెట్కాకుంటే పక్కన పెట్టేయాలి. లేదంటే, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, వేసవిలో కొన్ని కూరగాయలతో అనారోగ్యం పొంచి ఉంటుంది. కాబట్టి, ఎండకాలంలో ఏయే కూరగాయలు, వంటకాలు తినకూడదో తెలుసుకుంటే మంచిది.
వంకాయ.. కూరగాయల్లో రారాజుగా పేరు. కానీ, వేసవిలో మాత్రం ఆరోగ్యానికి శత్రువు. వంకాయను వేడి కూరగాయగా చెబుతారు నిపుణులు. వేసవిలో దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో అలెర్జీలు కూడా రావొచ్చు.
ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే కాలీఫ్లవర్.. ఎండల్లో శరీరానికి హాని కలిగిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకూ దారితీస్తుంది.
మూత్రపిండాల సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నవారు వేసవిలో చేమదుంపలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఆగ్జాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మూత్రపిండాల పని తీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, వేసవిలో డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. అలాంటి కాలంలో చేమదుంపలు తింటే.. కిడ్నీలకు మరింత హాని కలుగుతుంది.
మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో, జీర్ణవ్యవస్థపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇక శరీరం వేడిగా ఉండే వేసవిలో మటన్ వంటకాలు తింటే.. శరీర ఉష్ణోగ్రత మరింతగా పెరుగుతుంది. కాబట్టి, వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకోవడం మంచిది.
ఇక వేడివేడి కాఫీలు, టీలను కూడా తగ్గించాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను అమాంతం పెంచేసి, మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వీటికి బదులుగా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లను ఎంచుకుంటే బెటర్!
వేసవి అంటేనే.. పచ్చళ్ల సీజన్. ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ మామిడికాయలతో పచ్చళ్లు పెట్టుకుంటారు. కానీ, ఈ కాలంలో వీటికి దూరంగా ఉండటమే మంచిది. పచ్చళ్లలో ఉప్పు, నూనె అధికంగా వాడతారు. ఉప్పు అధికంగా తీసుకుంటే.. శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇక, అధిక నూనె కూడా వేసవిలో అనారోగ్యానికి కారణమవుతుంది.