ఈశాన్య భారతదేశంలోని ఏడుగురు అక్కచెల్లెళ్లుగా పిలిచే రాష్ర్టాల్లో మేఘాలయ ఒకటి. ఈ రాష్ట్రంలో గారో, ఖాసి, జైంతియా ప్రధాన గిరిజన తెగలు. ఇక్కడ మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ అమలులో ఉంది. వీరిలో ఖాసి తెగకు చెందిన ఇడషిష నాంగ్రంగ్ను ఆ రాష్ర్టానికి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మే 12న ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఖాసీ తెగ నుంచి ఒక రాష్ర్టానికి పోలీస్ బాస్‌గా నియమితులైన తొలి మహిళగా నాంగ్రంగ్ చరిత్ర సృష్టించారు. 1992 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన ఆమె ప్రస్తుతం మేఘాలయ రాష్ట్ర సివిల్ డిఫెన్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా, నాంగ్రంగ్ 2021లోనే తాత్కాలిక (యాక్టింగ్) డీజీపీగా పనిచేశారు కూడా. కాగా మేఘాలయ డీజీపీగా ఆమె 2026 మే 19 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా… ‘అడ్డుగోడలను బద్దలుకొట్టి చరిత్ర సృష్టించారని… ఇది తమకు గర్వకారణం’ అంటూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. స్థానిక ఖాసీ తెగకు చెందిన మహిళ కాబట్టి అక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారని మేఘాలయకు చెందిన మూడు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా నాంగ్రంగ్ ఎంపికను స్వాగతించడం విశేషం.