ఫ్రిజ్‌లో నిల్వచేసిన మాంసాహారం తిని.. కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఒకరు చనిపోగా.. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలో వండిన పదార్థాలే కాదు.. పచ్చి మాంసాన్ని కూడా నిల్వ చేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు, ఫంక్షన్ల సమయంలో మాంసాహారం ఎక్కువగా మిగిలిపోతుంది. వండని చికెన్, మటన్ కూడా మిగిలితే.. చాలామంది ఫ్రిజ్లోనే స్టోర్ చేస్తుంటారు. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఈ మాంసం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. నిజానికి పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో గరిష్ఠంగా రెండు రోజులు మాత్రమే ఉంచాలి.
అంతకుమించి ఉంచాలని అనుకుంటే.. ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచి.. డీప్‌ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. శుభ్రంగా కడిగిన తర్వాతే.. ఫ్రిజ్‌లో పెట్టాలి. గడువు ముగిసేలోపే వండుకోవాలి. అయితే, ఈ మాంసంతో డీప్‌ఫ్రైలు, బిర్యానీలాంటివి చేసుకోవద్దు. పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకునే ఐటమ్స్ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి.
ఫ్రిజ్‌లో పెట్టినవేవీ పాడుకావని చాలామంది భావిస్తుంటారు. అందుకే, ఎన్నిరోజులైనా అలాగే నిల్వ చేస్తుంటారు. కానీ, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే.. రెండుమూడు రోజులకే మాంసం పాడవుతుంది. రంగులో మార్పు గమనిస్తే.. అది పాడైనట్లు గుర్తించాలి. వాసనలోనూ తేడా గుర్తించవచ్చు. దీన్ని వండుకొని తింటే.. ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
కూర ఉడికించినప్పుడు బ్యాక్టీరియా చనిపోతుందని అనుకుంటారు. కానీ, చాలా సందర్భాల్లో ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారంపై ఈ.కొలి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన అలర్జీలు, వాంతులు, బలహీనత, తల తిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక వేడి, కడుపు నొప్పి లాంటి సమస్యలూ ఇబ్బంది పెడతాయి. మాంసాహారం ఎక్కువగా పాడైతే.. ప్రాణాలమీదికి వస్తుంది.