ఒకప్పుడు మన పెద్దలు అల్పాహారానికి బదులు చల్దినే తినేవాళ్లు. శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చలువ అన్నం, ఇతర పదార్థాలను తినే ఘట్టం ‘చల్దులారగించుట’ పేరిట పాఠ్యపుస్తకాల్లో చేరింది. నిన్నటి అన్నాన్ని పెరుగు తదితర పదార్థాలతో కలిపి తినేందుకు సిద్ధం చేస్తే దాన్నే చల్ది అన్నం, చద్ది అన్నం అంటాం. మన దగ్గరే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లోనూ దీన్ని చేసుకుంటారు. అయితే చేసే విధానాల్లో కొద్ది కొద్ది తేడాలున్నాయి. ఎలా చేసినా సరే, శరీరాన్ని చల్లబరిచి, సత్తువనిచ్చే చల్ది అన్నం వేసవిలో అమిత ఆరోగ్య ప్రదాయినిగా పని చేస్తుంది. ప్రొబయాటిక్ లక్షణాలూ పుష్కలంగా ఉన్న ఈ తరహా అన్నాలు ఇప్పుడు కార్పొరేట్ డైట్లోనూ భాగమైపోయాయి. మరి మండుటెండల్లో మల్లెపువ్వులా చల్లగా ఉండేందుకు మనమూ ఈ అన్నాలను చేసుకుని తిందామా!
తెలుగు రాష్ర్టాల్లో చద్దన్నం లేదా గంజి అన్నంగా పిలిచే ఇది అచ్చమైన ప్రొ బయాటిక్ ఆహారం. కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకు మేలు చేయడమే కాకుండా, శరీరానికి చలవ చేసే స్వభావం కలిగి ఉంటుంది. ఎప్పుడు తిన్నా బలవర్ధకమే అయిన ఈ ఆహారం ఎండకాలం పొద్దునపూట తినడం మరింత శ్రేయస్కరం.
రాత్రి మిగిలిన అన్నం ఒక గిన్నెలో (మట్టిముంత అయితే మరీ మంచిది) తీసుకుని గడ్డలు లేకుండా మెత్తగా కలపాలి. తర్వాత ఓ మోస్తరు గిన్నె అన్నానికి ఒక పెద్ద గ్లాసుడు నీళ్లను తీసుకుని అందులో పోయాలి. కొందరు ఇక్కడ వేడినీటిని పోస్తారు. ఏదైనా ఫర్వాలేదు. అంతే మోతాదులో అంటే దాదాపు అన్నం మునిగేలా కాచిన పాలు పోయాలి. ఇవి కాస్త గోరువెచ్చగా అనిపించినప్పుడు ఓ స్పూను పెరుగును వేసి కలియబెట్టాలి. కాస్త పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయలు, కడిగిన పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి మూతబెట్టాలి. తెల్లవారాక అన్నాన్ని బాగా కలిపి, కాస్త ఉప్పు జోడించి, ఏదైనా ఊరగాయ నంచుకుని తింటే ఆహా… అమృతం అనిపించేలాంటి రుచి వస్తుంది.
తెలుగు రాష్ర్టాల్లో మరో సుప్రసిద్ధ చల్ది అన్నం తరవాణి. ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేస్తారు. పకాలన్నం అని కూడా పిలుస్తారు. ఎండవేళ శరీరానికి చలవ చేయడమే కాదు, ఎంతో బలాన్నీ ఇస్తుంది. ఉగాది రోజు కుండలాంటి మట్టిగిన్నె లేదా కాస్త పెద్దముంత కొని శ్రీరామ నవమి రోజున తరవాణి తయారీ ప్రారంభిస్తారు. జూన్లో బాగా వానలు పడే వరకూ ఇది కొనసాగుతుంది. ఆ రోజు కుదరకపోతే మరో మంచిరోజు చూసుకుని, నీళ్లలో నానబెట్టి తుడిచి పెట్టుకున్న కుండకు పసుపురాసి బొట్టు పెట్టి మొదలుపెడతారు.
ముందుగా ఒక గిన్నెడు గంజి ఒంపి పక్కకు పెట్టుకోవాలి. దాన్ని కుండలో పోసి, చల్లారిన అన్నం అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ కుండను గాలి తగిలే శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీన్ని ఇలా మూడు రోజులపాటు వదిలేయాలి. అప్పుడు మూత తీసి చూస్తే పులిసిన ద్రవం ఉంటుంది అదే తరవాణి, అందులో ఉండే అన్నాన్ని తరవణ్నం అని పిలుస్తారు. ఇందులో ప్రొ బయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలా మూడు రోజుల తర్వాత పై తేటను ఒంపుకుని అందులో కాస్త మజ్జిగ, ఉప్పు, దబ్బాకులు వేసి వేసవి పానీయంలా తాగుతారు. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇది. ఈ పులిసిన అనాన్ని ఉప్పు, పచ్చడి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయల ఆదరువుతో అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ఈ కుండలోని పదార్థం వాడుకున్నాక చివర్లో కొంత మిగుల్చుతారు. అందులోనే ఆ రోజు వంపిన గంజి, మిగిలిన అన్నం వేస్తారు. అలా వారం, పది రోజులపాటు కొనసాగిస్తారు. తర్వాతే కుండ ఖాళీ చేసి బియ్యప్పిండిలాంటి వాటితో శుభ్రం చేసి, మళ్లీ గంజి అన్నం వేయడం మొదలు పెడతారు. అయితే తొలిరోజు వేసిన అన్నం చివరిరోజు దాకా పాడవకపోవడం ఇందులోని ప్రత్యేకత. కుండకడిగే రోజు అందులోని పదార్థాన్ని కాస్త పక్కకు పెట్టి, కడిగిన కుండలో దాన్ని వేసి, మళ్లీ ఆ రోజు గంజి, అన్నం కలుపుతారు.
చద్దన్నం తరహాలోనే తమిళనాడు, కేరళ ప్రాంతంలో నీరాహారంను చేసుకుంటారు. అయితే ఇది మన అన్నంలా ఘనపదార్థంలా కాకుండా జావ తరహాలో ఉంటుంది. దీన్ని బియ్యం లేదా జొన్నలతో చేస్తారు. మనలాగే బాగా వేడి ఉండే ఆ రాష్ర్టాల్లోనూ చలవ కోసం ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటారు. అల్సర్లను తగ్గించే స్వభావం దీనికి ఉంటుందట. నిశినీర్, పులిచాతన్ని, సొరుతన్నిలాంటి రకరకాల పేర్లతో పిలుస్తారు.
కొద్దిగా అనాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అది మునిగేలా నీళ్లు పోసి మూతబెట్టి రాత్రంతా వదిలేయాలి. ఉదయం అయ్యాక నీళ్లలో ఉన్న అన్నాన్ని మెత్తగా మెదిపి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. కాస్త ఉప్పు కూడా వేసి, కొద్దిగా నీళ్లు పోసి చిలికిన పెరుగు లేదా చిక్కటి మజ్జిగను కూడా జోడించాలి. ఇప్పుడు పదార్థాలన్నీ అన్నానికి పట్టేలా చేతితో నలుపుతూ కలపాలి. పల్చగా ద్రవ రూపంలో ఉండే ఈ నీరాగా(హా)రాన్ని గ్లాసుల్లో పోసుకుని పొద్దునపూట తాగుతారు.
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసే మరో రకం చల్ది అన్నం రైస్ కంజి. దీన్ని ఎక్కువగా కేరళలో చేసుకుంటారు. ఒడిశా, తమిళనాడుల్లో కూడా ఇదే పేరుతో దాదాపు ఇదే తరహా చల్ది అన్నాన్ని తయారు చేసుకుని తింటుంటారు. ఇది అజీర్తి, ఎసిడిటీలాంటి వాటిని తగ్గించి కడుపులోని హానికారక పదార్థాలను బయటికి పంపించేందుకు సాయపడుతుంది.
ముందురోజు మధ్యాహ్నం వండి పెట్టుకున్న అన్నాన్ని ఓ పెద్ద కప్పెడు.. మట్టిపాత్రలోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఓ కప్పు మంచినీళ్లు పోయాలి. రాత్రంతా… అంటే ఎనిమిది నుంచి పదిగంటల పాటు ఇలా వదిలేయాలి. ఈ సమయంలో అన్నం దాదాపు మొత్తం నీళ్లను పీల్చుకుంటుంది. ఇప్పుడు మట్టిపాత్రలో ఉన్న ఈ పదార్థాన్ని మిక్సీలో వేసి మరీ పేస్ట్ కాకుండా తిప్పాలి. దాన్ని మరో గిన్నెలోకి మార్చుకుని కాస్త ఉప్పు, ఓ అరకప్పు గట్టి పెరుగు కలుపుకోవాలి. పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టుకుని, కొద్దిగా కొబ్బరినూనె వేసి పోపు గింజలు చిటపటలాడాక, కాస్త ఇంగువ వేయాలి. అందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి తురిమిన అల్లాన్ని జోడించాలి. రవ్వంత ఉప్పు కూడా వేశాక… ఈ పోపును ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమానికి కలుపుకొంటే రైస్ కంజీ సిద్ధమైనట్టే. ఆరు నెలల పిల్లలు మొదలు తొంభై ఏండ్ల పెద్దల దాకా ఎవరైనా దీన్ని హాయిగా తినొచ్చు. అల్పాహారంగానే కాదు, కొందరు మధ్యాహ్నం పూటా ఓ పట్టు పడతారు.