కట్క వేయగానే లైటు వెలిగితే.. అప్పట్లో సంచలనం. రిమోట్ మీట నొక్కగానే టీవీ ఆన్ అయితే.. అబ్బురం. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సాంకేతికత.. మన జీవితాల్లోకి చొచ్చుకొని పోయింది. ఇప్పుడు పర్సనల్ ఏఐ ఏజెంట్లను పెట్టుకునే వరకూ వచ్చేసింది. ఇప్పటికే మన ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు అన్నీ ఏఐతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏఐకి మరిన్ని శక్తుల్ని జోడిస్తూ… టెక్నాలజీ మరో కొత్త చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నది. మైక్రోసాఫ్ట్ తాజాగా నిర్వహించిన ‘బిల్డ్ 2025’ ఈవెంట్లో సత్య నాదెళ్ల పంచుకున్న విశేషాలన్నీ కొత్త చాప్టర్ ఏఐ ఏజెంట్ల గురించే! రాబోయే రోజుల్లో మన జీవితాల్లోకి ప్రవేశించనున్న ఏఐ ఏజెంట్ల పనితనం ఎలా ఉంటుందంటే..
రమ్యకు పెండ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇల్లాలిగానూ.. ఉద్యోగిగానూ.. మల్టీటాస్కింగ్ చేస్తున్నది. అందుకు ఇంట్లో వాళ్ల సాయం ఏముందో తెలియదుగానీ.. ‘ఏఐ ఏజెంట్’ సపోర్ట్ మాత్రం ఆమెకు దండిగా ఉంది. పిల్లల ఫీజు కట్టమని రమ్య ఫోన్‌కి మెసేజ్ వస్తే చాలు. వెంటనే ఏఐ ఏజెంట్ ఆ నెల బడ్జెట్‌ని పిల్లల స్కూల్ ఫీజుకు తగినట్టుగా మార్పులు చేసి చూపిస్తుంది. రమ్య అప్రూవల్ ఇవ్వగానే ఫీజు పేమెంట్ చేసేస్తుంది. అంతేకాదు.. రమ్య ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వగానే స్కూల్లో పిల్లలకు అలర్ట్ మెసేజ్ పంపేస్తుంది. పిల్లల్ని పిక్ చేసుకుని రమ్య ఇంటిని సమీపించగానే వాష్‌రూమ్‌లో గీజర్ ఆన్ చేస్తుంది.. గదుల్లో ఏసీల్ని కూడా ఆన్ చేస్తుంది. వంటకు కావాల్సినవి ఫ్రిడ్జ్‌లో ఏమైనా షార్టేజ్ ఉంటే.. వెంటనే ఆర్డర్ పెట్టేస్తుంది. పిల్లల హోం వర్క్‌ను అనలైజ్ చేసి.. స్మార్ట్ టీవీ నుంచి వివరించడానికి సిద్ధం అయిపోతుంది. అలసిపోయి రమ్య పడుకున్నా.. ఇంట్లో అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్లీప్ మోడ్‌లో పెట్టేస్తుంది. అంతేకాదు.. రాత్రంతా రమ్యకు వచ్చిన ఆఫీస్ మెయిల్స్, గ్రూపు మెసేజ్‌లను మానిటర్ చేస్తుంది. ఉదయం లేవగానే రమ్యకు మొత్తం అప్డేట్స్ను సంక్షిప్తంగా చదివి చెబుతుంది!!
ఇలా రమ్యకు సపోర్ట్‌గానే కాదు… ఇతర ఉద్యోగులు, స్కూల్ టీచర్లు, వ్యాపార నిర్వాహకులు, హోమ్ మేకర్స్‌కు భవిష్యత్తులో ఏఐ ఏజెంట్స్ సపోర్ట్ ఊహకు అందనంతగా మారిపోనుంది. ఇక మనం చెప్పే పనులకే కాకుండా, మనకు బదులుగా స్వయంగా మన పనుల్ని చేయగలిగే స్థాయికి చేరుతున్నాయి ఈ ఏజెంట్స్. మనిషి జీవితాన్ని సులభం చేసే ఒక కొత్త టెక్నాలజీ ఇది. ఈ ఏజెంట్స్ రోజువారీ పనులను స్మార్ట్‌గా చేస్తాయి. అది షాపింగ్ అయినా, డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయడమైనా, వ్యాపారం అభివృద్ధి చేయడమైనా! ఈ ఏఐ ఏజెంట్స్ మన జీవనశైలిని, సమాజాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇవి మనతోనే ఉంటూ.. మన పనితీరు మార్చే కొత్త సహాయకులు. మైక్రోసాఫ్ట్ దానికో బలమైన బాట వేస్తున్నది. మనం ఈ ఏజెంట్స్ వాడకంలో భాగం అయితేనే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇకపై ఫోన్ ఒకపక్క.. ల్యాపీ ఎదురుగా.. ఇలా అన్నిటికీ మీరే ఇన్పుట్స్ ఇస్తూ మల్టీటాస్కింగ్ చేయనక్కర్లేదు. జస్ట్ ఫోన్లో మీరేదైనా కమాండ్ ఇస్తే చాలు.. మీరు పెట్టుకున్న ఏఐ ఏజెంట్ అలర్ట్ అయిపోతుంది. కంప్యూటర్, ఫోన్, క్లౌడ్ అన్నిటినీ ఏకకాలంలో మేనేజ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు మీ ఫోన్లో మీ పిల్లల స్కూల్ ఫీజు వివరాల్ని చెక్ చేస్తుంటే.. వెంటనే ఏజెంట్ అదే సమయంలో ల్యాపీలో ఆ వివరాలపై బేస్ అయ్యే బడ్జెట్ షీట్ తయారుచేస్తుంది. మీరు అడగకముందే పని పూర్తవుతుంది! ఇంకా చెప్పాలంటే.. జ్వరంతో ఆఫీస్‌కి రావట్లేదని మెసేజ్ పెడితే చాలు.. వెంటనే మీరు పెట్టుకున్న స్మార్ట్‌వాచ్, ఇతర వేరబుల్ డివైజ్లతో మీ హెల్త్ ఇన్‌పుట్స్‌ని ప్రాసెస్ చేస్తుంది. ఆ డేటా ఆధారంగా మీ హెల్త్ రికార్డ్స్‌ని యాక్సెస్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. గతంలో మీకు ఎదురైన ఆరోగ్య సమస్యల్ని ట్రాక్ చేసి మీ ఫ్యామిలీ డాక్టర్‌కు వివరాల్ని పంపేస్తుంది. అంతేకాదు.. మీరెలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలో కూడా ఏఐ ఏజెంటే చెబుతుంది.
ఆన్లైన్లో షాపింగ్ చేయడం, బిల్లులు చెల్లించడం, ట్రావెల్ ప్లాన్ చేయడం అన్నిటినీ ఏఐ ఏజెంట్ చక్కబెడుతుంది. ఇలా మీ రోజువారీ పనులను సులభం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ (Microsoft 365 Copilot) లాంటి టూల్స్ పనులన్నీ ఇట్టే చక్కబెడతాయి. ఉదాహరణకు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, ఈ ఏజెంట్స్ బెస్ట్ డీల్స్ చూపిస్తాయి, టికెట్స్ బుక్ చేస్తాయి, హోటల్స్ సెలెక్ట్ చేస్తాయి. అది కూడా మీ బడ్జెట్లో! షాపింగ్ చేస్తున్నప్పుడు, ఈ ఏజెంట్స్ బెస్ట్ డిస్కౌంట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాయి. విద్యార్థులకు చాలా సాయపడతాయి. పిల్లలు ఒక టాపిక్ గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఏజెంట్స్ సులభంగా సమాచారం ఇస్తాయి. టీచర్లకు కూడా ఈ ఏజెంట్స్ పాఠాలు ప్లాన్ చేయడం, విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేయడం సులభం చేస్తాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడంలోనూ ముందుంటాయివి. కస్టమర్లను అర్థం చేసుకోవడం, వారికి బెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం, ఇన్వెంటరీ మేనేజ్ లాంటివి చేస్తాయి. ఉద్యోగులకు సదా అండగా ఉంటాయి. మీరు ఆఫీస్ డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడే.. మీ ఏజెంట్ మరో పక్క జూమ్ కాల్ని షెడ్యూల్ చేస్తుంది. మీటింగ్‌లో మాట్లాడాల్సిన అంశాన్ని ప్రిపేర్ చేస్తుంది. సహోద్యోగులకు మెసేజ్ చేరవేస్తుంది. ఇక సైన్స్ అండ్ రీసెర్చ్‌లోనూ పెద్దమార్పులు రానున్నాయి. మైక్రోసాఫ్ట్ డిస్కవరీ (Microsoft Discovery) ప్లాట్‌ఫామ్ రీసెర్చర్ల పరిశోధనలు సులభతరం చేస్తున్నది. కొత్త మందులు కనిపెట్టడం, పర్యావరణ సమస్యలు పరిష్కరించడం లాంటి పనులు చిటికెలో చక్కబెడుతున్నది.
ఏఐ ఏజెంట్స్ మీ జీవితాన్ని సులభం చేస్తాయనడంలో సందేహం లేదుగానీ.. మరి డేటా భద్రత సంగతేంటి? అన్న సందేహం రాక మానదు. అందుకే మైక్రోసాఫ్ట్ డేటా సెక్యూరిటీ విషయంలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం ప్రత్యేకంగా ఏఐ ఏజెంట్ ఐడీని ప్రవేశపెడుతున్నది. దీనిపేరు మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఏజెంట్ ఐడీ. దీంతో ఏజెంట్స్‌కి యూనిక్ ఐడెంటిటీ ఇస్తారు. దీంతో డేటా భద్రంగా ఉంటుంది. ఇతర ఏఐ టూల్స్లోనూ సెక్యూరిటీ, గవర్నెన్స్ టూల్స్ ఉన్నాయి. అవి మీ డేటా దుర్వినియోగం కాకుండా చూస్తాయి. సో.. ఇక మీదట మన పనుల్ని మనమే చేయాలని మడికట్టుకుని కూర్చోనక్కర్లేదు. ఏజెంట్స్‌కి అప్పగిస్తే చాలు. మనల్ని నిత్యం అర్థం చేసుకుంటూ ముందుండి బాధ్యతగా ముగించేస్తాయి. ఫైనల్‌గా టెక్నాలజీ మనకోసం తయారైంది కాదు.. మనతో కలిసి పనిచేసే ఏజెంట్ అన్నమాట!!