Radhika Madan | సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు పట్టేస్తున్నది రాధికా మదన్. 2014లో ‘మేరీ ఆశికీ తుమ్ సే హీ’ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్‌కుమార్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిర్ఫ్ రా’ సినిమాలో కనిపించింది.
అందం, ప్లాస్టిక్ సర్జరీలపై ఇటీవల రాధిక చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ‘ఇండస్ట్రీలో హీరోయిన్గా స్థిరపడాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందం కూడా ఉండాలి. అది ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకోవాలి. కొందరైతే అందం కోసం సర్జరీలు చేయించుకుంటారు. ముక్కు, పెదాలు ఇలా శరీరంలోని పలు భాగాలను ఆపరేషన్ ద్వారా సరిచేసుకుంటారు. అది తప్పని నేను అనుకోను.
అలా చేయించుకునే వారిని కూడా తప్పుపట్టను. అందంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అందాన్ని పెంచుకునేందుకు సర్జరీలే సరైన పద్ధతి అని చెప్పను. భవిష్యత్తులో మరింత అందంగా కనిపించడానికి సర్జరీల గురించి నేను కూడా ఆలోచించే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చింది రాధికా మదన్.