పొదుపు మంత్రం ఎక్కడైనా పనిచేస్తుందేమో కానీ, తినే ఆహారం విషయంలో కాదు! వంటింటి వస్తువుల్లో పీనాసితనం ప్రదర్శిస్తే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. చౌకగా వస్తున్నాయని ఒకేసారి ఎక్కువగా కొనుక్కొచ్చి.. నెలల తరబడి వాడేస్తుంటాం. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేపుళ్ల కోసం వాడిన నూనెను నిల్వ చేసుకోవడం మంచిదికాదు. ఆ నూనెలను తిరిగి వాడటం ఆరోగ్యానికి ఎంతో హానికరం కూడా!
నెయ్యి, నూనెలను ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే.. వాటి రుచిని కోల్పోతాయి.
ఇంట్లో తుప్పు పట్టిన పాత్రలు ఉంటే.. వెంటనే బయట పడేయండి. వాటిల్లో ఆహారం వండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఇక బియ్యం, పప్పులు, పిండి వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే.. పురుగులు పడుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
మసాలాలను ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే.. వాటిలో ఉండే పోషకాలు కోల్పోతాయి. వాటిని కూరల్లో వాడితే.. రుచి రాకపోగా, రోగాలు పలకరించవచ్చు.
పండ్లు, కూరగాయల్లో ఏదైనా ఒక్కటి పాడైనా.. దాన్ని వెంటనే తీసేయండి. లేకుంటే.. మిగిలినవి కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ప్లాస్టిక్ స్టోరేజీ డబ్బాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. కొన్నిరకాల ప్లాస్టిక్ డబ్బాలు పాతబడ్డాక హానికర రసాయనాలను విడుదల చేస్తాయి.
కూరగాయలు కట్చేసుకొనే చాపింగ్ బోర్డులను ఎక్కువకాలం వాడటం మంచిదికాదు. వీటిపై బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది.