ఇల్లు అన్నాక.. అన్ని వయసులవాళ్లూ ఉంటారు. వృద్ధులు మొదలుకొని.. చిన్నారుల దాకా అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. ఎవరికి తగ్గ పనులు, బాధ్యతలు వాళ్లు నిర్వర్తిస్తుంటారు. అయితే, ఆహారం విషయానికి వచ్చేసరికి.. అందరూ ఒకేరకమైన భోజనం చేస్తుంటారు. కానీ, అందరు ఆడవాళ్ల ఆహార అవసరాలు ఒకేవిధంగా ఉండవని నిపుణులు అంటున్నారు. వయసును బట్టి మహిళల్లో పోషకాల అవసరం మారుతుందని చెబుతున్నారు. అందుకే, ఆడవాళ్ల వయసుకు తగ్గట్టుగా ఆహారం ఉండాలని సూచిస్తున్నారు.
ఎదిగే ఆడపిల్లలకు ప్రొటీన్ల అవసరం ఎక్కువ. కాబట్టి, వీరి ఆహారంలో కోడిగుడ్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. నట్స్, వేరుశనగ, గోధుమలు, పెసలు వంటివీ తీసుకోవాలి. తీపి తినాలంటే.. బెల్లం – నువ్వుల లడ్డూలు, డ్రైఫ్రూట్స్ లడ్డూలు అందించాలి. స్నాక్స్ కావాలంటే.. మొలకల చాట్, సెనగలు, బొబ్బర్లతో చేసిన వడలు లాంటివి వీరి ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. ఈ వయసులో పిండి పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం అందిస్తే.. ఎదుగుదల తగ్గి ఊబకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.
ఇది మహిళల జీవితంలో కీలకదశ. ఉన్నత చదువులు, కెరీర్, వివాహం లాంటి అనేక కీలక ఘట్టాలు జరిగేది ఈ వయసులోనే. ఈ హడావుడిలో కొందరు సరైన పోషకాహారం తీసుకోరు. మరికొందరు అందాన్ని కాపాడుకోవడానికి, బరువు పెరిగిపోతామని తక్కువగా తింటుంటారు. ఇలా.. లెక్క తప్పే ఆహారపు అలవాట్లు.. నెలసరితోపాటు పునరుత్పత్తి సామర్థ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ వయసులో అధిక క్యాలరీలు ఉండే పప్పుధాన్యాలు, నట్స్, పండ్లు, చేపలు, సోయా ఉత్పత్తులను తీసుకోవాలి. తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు, ఆకుపచ్చని కూరగాయలతోపాటు రక్తహీనత రాకుండా ఐరన్ సమృద్ధిగా ఉండే పాలు, పౌల్ట్రీ, చేపలు, బచ్చలికూర, కాయధాన్యాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
వ్యక్తిగత, వృత్తిగత బాధ్యతలు పెరిగే ఈ సమయంలో.. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఇబ్బంది పెడుతాయి. ఇలాంటప్పుడు డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, సితోపాటు మరికొన్ని ఖనిజాలు అవసరం అవుతాయి. కాబట్టి, గుడ్లు, బీన్స్, నట్స్ – సీడ్స్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలను ఆశ్రయించాలి.
మెనోపాజ్ మొదలయ్యే ఈ వయసులో మూడ్ స్వింగ్స్, అలసట, ఒత్తిడి, నీరసం లాంటి ఎన్నో చికాకులు కనిపిస్తాయి. వీటికితోడు ఆస్టియోపోరోసిస్, కీళ్లనొప్పులూ వేధి స్తుంటాయి. వీటిని అధిగమించాలంటే.. మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటి ఆక్సిడెంట్లు అవసర పడుతాయి. ఇవన్నీ శరీరానికి అందాలంటే.. గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు- మాంసం, చేపలు, ఆకుకూరలు, బ్రకోలీ, బార్లీ లాంటివి ఎక్కువగా తినాలి.
60 ఏళ్లు దాటితే.. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే.. ఆహారంలో చక్కెర, ఉప్పు తగ్గించాలి. శరీరానికి తగినంత ప్రొటీన్ అందడానికి బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి.