ఆహారంలోనే కాదు అందం విషయంలోనూ నెయ్యి, మీగడలకు ప్రత్యేక స్థానముంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇవి చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తాయి. ఈ రెండిటిలో ఏది గొప్ప… అంటే చెప్పడం కాస్త కష్టమే. అయితే ఏది దేనికి పనికొస్తుందో మాత్రం తెలుసుకోవచ్చు. చర్మం పెళుసుబారి, పొలుసులుగా లేస్తున్నప్పుడు కాస్తంత నెయ్యి తీసుకుని మర్దనా చేస్తే ఆ చోటు మృదువుగా తయారవుతుంది.
ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, అత్యవసర కొవ్వులు చర్మపు సాగే తత్వాన్ని పెంచి మెరుపునిస్తాయి. చర్మం పొడిబారే కాలంలో ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. రాత్రిపూట రాసుకుని పడుకునేందుకు కూడా బాగుంటుంది. ఇక మీగడ చర్మంలోని మృతకణాలను తొలగించే ఎక్స్‌ఫోలియేటర్‌గా పనికొస్తుంది. ఇది మసకబారిన చర్మానికి కాంతిని తీసుకొస్తుంది. మెరిసే మృదువైన చర్మం తక్షణమే కావాలనుకుంటే మీగడను ఎంచుకోవడం మంచిది. కానీ అటు నెయ్యి, ఇటు మీగడ రెండూ మేనికి తిరుగులేని నేస్తాలే!