‘నా బిడ్డ డాక్టర్ అవుతాడేమో అనుకున్నా. కానీ, చదువు పూర్తికాగానే రక్షణ దళాల పట్ల ఆసక్తి ఉందని చెప్పాడు. నేనూ కాదనలేదు. ఎందుకంటే అప్పటికే మా కుటుంబంలో చాలామంది ఆర్మీలో ఉన్నారు. కానీ, నా మనసులో ఒకటే భయం. సైన్యంలో పనిచేసేవారికి మద్యం అలవాటు ఉంటుంది. కొంతమంది తీవ్ర వ్యసనపరులుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో, నా బిడ్డను అటువైపు పంపడానికి సంకోచించాను. అదే మాట తనతోనూ చెప్పాను. నా చేతిలో చెయ్యేసి, జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టుకోనని నాకు మాటిచ్చాడు. ఇప్పటివరకూ ఆ వాగ్దానానికే కట్టుబడి ఉన్నాడు’.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, త్వరలోనే నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్న వైస్-అడ్మిరల్ హరికుమార్ తల్లి విజయ లక్ష్మి. సొంతూరు తిరువనంతపురంలో ఉంటారామె.