హంపి ఉత్సవకు వేళైంది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టే ‘హంపి’ నగరం వేదికగా.. ఈ మెగా ఈవెంట్ జరగనున్నది. ఫిబ్రవరి 28న ప్రారంభమై, మార్చి 2 వరకు మూడురోజులపాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా నిర్వహించే ‘హంపి బై స్కై’తోపాటు అనేక వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వింటేజ్ కార్ ర్యాలీతోపాటు స్పోర్ట్స్ బైక్ స్టంట్స్ లాంటి సాహస ప్రదర్శనలూ అలరిస్తాయి. హంపిని సందర్శించేందుకు ఇదే మంచి సమయం. అయితే, ‘హంపి ఉత్సవ’ సందర్భంగా పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.
కాబట్టి, ఇక్కడికి వెళ్లాలని అనుకునేవారు స్థానిక హోటళ్లలో ముందస్తు బుకింగ్స్ చేసుకోవాలి. హంపిలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఎండలు మొదలైన నేపథ్యంలో.. అందుకు తగ్గ ఏర్పాట్లూ చేసుకోవాలి. వేడి వాతావరణానికి తగ్గట్టుగా తేలికపాటి దుస్తులే తీసుకెళ్లాలి. ఎక్కువ దూరం నడవడానికి, సూర్యుడి నుంచి రక్షణకు అనువుగా, సౌకర్యవంతంగా ఉండే బూట్లు ధరించడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి.