చలికాలం ముగింపునకు వచ్చినా.. పొడిగాలి తీవ్రత అలాగే ఉంది. దీనివల్ల తలలో తేమ తగ్గుతుంది. ఫలితంగా, రక్త ప్రసరణ నెమ్మదించి.. జుట్టు పొడిబారుతుంది. వీటితోపాటు మనకు తెలియకుండానే చేసే మరికొన్ని పనుల వల్ల.. ఈ కాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.
ఈ క్రమంలో చలికాలంలో జుట్టుకు హానిచేసే పనులేమిటో వివరిస్తున్నారు సౌందర్య నిపుణులు.వేడినీటి స్నానం శరీరానికి హాయినిచ్చినా.. జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వేడినీటి వల్ల మాడుపై చర్మం పొడిబారుతుంది. దాంతో, జుట్టు రంధ్రాలు తెరుచుకొని.. వెంట్రుకలు రాలిపోవడం ఎక్కువ అవుతుంది. అందుకే, వీలైనంత వరకు గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చేయడం మంచిది. ఇక రోజూ
తల స్నానం చేసినా.. వెంట్రుకలు నిర్జీవంగా మారుతాయి. క్రమంగా రాలిపోతాయి.
తలస్నానం తర్వాత.. జుట్టు త్వరగా ఆరాలని బ్లో డ్రయర్స్ వాడుతుంటారు. బ్లో డ్రయర్స్ వల్ల వెంట్రుకలు రాలడం అధికం అవుతుంది. ఇక కర్లర్స్, స్ట్రెయిట్నర్స్ వంటివి వాడటం కూడా ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. వీటిలోంచి వెలువడే వేడి.. వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తల స్నానం తర్వాత జుట్టును మెత్తని టవల్‌తో తుడుచుకుంటూ.. ఉదయపు ఎండలో ఆరబెట్టుకోవడమే మంచిది.
ఈ కాలంలో ‘విటమిన్ డి’ లోపం కూడా వేధిస్తుంది. ఇది.. జుట్టును బలహీన పరుస్తుంది. కాబట్టి, ఉదయం కాసేపైనా ఎండలో గడిపితే.. విటమిన్ డి లోపంతోపాటు జుట్టు సమస్యల నుంచీ బయటపడొచ్చు.