ఆరోగ్యాన్ని ప్రసాదించి.. ఆయుష్షు పెంచే అమృతం అమ్మపాలు. బిడ్డల ఆకలి తీరుస్తూ తల్లులు ఉప్పొంగిపోతారు. కానీ, కొందరు తల్లులకు పాలు పడవు. డబ్బాపాలతో బిడ్డ ఆకలి తీర్చినా.. సృష్టి ధర్మంగా పిల్లలకు అందివ్వాల్సిన అమృతాన్ని ఇవ్వలేకపోతున్నామే అని కుమిలిపోతుంటారు. వారి మనోవ్యథను.. తన గుండెనిండా ఉన్న ప్రేమను పంచి పరిష్కారంగా చూపింది అలిసీ ఒగ్లెట్రీ. ఒక ఉద్యమంలా రొమ్ము పాలను దానం చేసి ఎందరో బిడ్డలకు అమృతాన్ని పంచింది. అత్యధికంగా రొమ్ముపాలను దానం చేసిన తల్లిగా గిన్నిస్ రికార్డులు, వేలాది మంది తల్లుల ప్రేమనూ గెలిచింది!
అలిసీ ఒగ్లెట్రీది టెక్సాస్. 2010 సంవత్సరంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఏదో అనారోగ్య సమస్య ఉందని పుట్టిన వెంటనే ఆ పసికందును ఐసీయూలో ఉంచారు. తన బిడ్డకు పాలు పట్టే అవకాశం ఆ తల్లికి లేకుండాపోయింది. అలిసీ తన పాలను పితికి, ఫ్రీజర్‌లో నిల్వ చేసింది. కాసేపటికే ఆ తల్లిపాలు మళ్లీ ఊరాయి. ఉత్పత్తి అధికంగా ఉండటంతో వాటన్నిటినీ సీసాల్లో నింపుతూ పోయిందామె. చివరికి హాస్పిటల్లో ఉన్న ఫ్రీజర్ నిండిపోయింది. ఇవన్నీ చూసిన ఒక మేల్ నర్స్… ‘మీ నుంచి వచ్చే పాలు మీ బిడ్డకు సరిపోవచ్చు. నిల్వ చేసిన ఈ పాలు మీ బిడ్డకు అవసరం లేకపోతే తల్లిపాలు లేని పిల్లలకు దానం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంది’ అని చెప్పాడు. అవసరానికి మించిన పాలను నలుగురికి ఉపయోగించాలని అలిసీ నిర్ణయించుకుంది. రొమ్ముపాలను దానం చేయడం గురించి అవగాహన కల్పించిన నర్స్ వాటిని నిల్వ చేయడం, దానం చేసే పద్ధతి గురించి వివరించాడు. ఆ నగరంలో ఉన్న ‘మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్’కి పాలను దానం చేయడం ప్రారంభించింది. ఈ బ్యాంక్ అవసరమైన వారికి తల్లిపాలను సరఫరా చేస్తుంటుంది.
అలిసీ ఒగ్లెట్రీకి సాధారణ తల్లుల కంటే ఎక్కువ పరిమాణంలో, ఎక్కువ కాలంపాటు పాల ఉత్పత్తి జరిగింది. అలా అధికంగా ఊరుతున్న పాలను క్రమం తప్పకుండా పితకడం ఆరంభించింది. ఇందుకోసం పాలను తీసే యంత్రాన్ని ఉపయోగిస్తుంది. రాత్రి పూట కూడా మధ్య మధ్యలో నిద్ర లేచి పాలు సేకరించేది. వాటిని జాగ్రత్తగా నిల్వ చేయడం కోసం కంటెయినర్లను తన వెంట ఉంచుకునేది. 15 నుంచి 30 నిమిషాలపాటు పాలను పిండిన తర్వాత వాటిని వెంటనే ఫ్రీజర్‌లో పెడుతుంది. ఇలా నిల్వ ఉంచినపాల సీసాలను మిల్క్ బ్యాంక్‌కి అప్పగిస్తుంది. వాళ్లు ఆ పాలను పరీక్షించి, అవసరమైన వారికి దానం చేస్తారు. అలా 2014 నాటికి అలిసీ 1,569 లీటర్ల పాలనుదానం చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కాలంలో అమెరికాలోనే ఉండే తల్లులు అంతకంటే ఎక్కువ రొమ్ముపాలను దానం చేసి ఆమె రికార్డును అధిగమించారు. రెండో బిడ్డ పుట్టడం వల్ల ఆమె రెండోసారి మిల్క్ బ్యాంక్‌కి పాలను దానం చేయడం మొదలుపెట్టింది. ఒగ్లెట్రీ 2018లో మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనూ ఇదే విధంగా పాల ఉత్పత్తి జరిగింది. రెండో కాన్పు తర్వాత నాలుగున్నరేండ్లలో అంటే 2023 జూలై నాటికి మొత్తం 2,645 లీటర్ల పాలను దానం చేసిందామె. అలా 36 సంవత్సరాల ఒగ్లెట్రీ మరోసారి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
తన శరీరంలో పాల ఉత్పత్తి అపరిమితంగా జరుగుతున్నా ఒగ్లెట్రీ ఆందోళన చెందలేదు. తనలో ఇన్ని పాలు ఎందుకు ఉత్పత్తి అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. విపరీతమైన పాలు ఉత్పత్తి కావడం వల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఉంటుందని చెబుతుందామె. శరీరం నీటిని వేగంగా కోల్పోతుంది కూడా! అందుకే తరచుగా నీళ్లు తీసుకుంటూ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తపడేది. పాల ఉత్పత్తి వల్ల శరీరంలో పోషకాహార లోపం తలెత్తకుండాఉండేందుకు సమతుల ఆహారం తీసుకునేది. దేహంలో నీరు, పోషకాల సమతుల్యతను పాటిస్తూ పాల ఉత్పత్తి కొనసాగించింది ఒగ్లెట్రీ. అధిక పాల ఉత్పత్తి కోసం ఆమె ఎలాంటి మందులు తీసుకోలేదు. అలాగే ఆ పాల ఉత్పత్తి ప్రక్రియను ఆపేందుకూ వైద్యం చేయించుకోలేదు. ‘ఇలా పాలు ఎందుకు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయో నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. కానీ, నా పాలు.. ఎందరి బిడ్డల ఆకలినో తీరుస్తున్నాయి. బిడ్డలకు పాలు ఇవ్వలేని తల్లులకు ఆనందాన్నిస్తున్నాయి. ఆ సంతృప్తి ముందు మరే ఆనందమూ దిగదుడుపే’ అంటుంది ఒగ్లెట్రీ. రొమ్ముపాలను దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రచారం చేస్తూ, ఇతర తల్లులకూ అవగాహన కల్పిస్తున్నది ఒగ్లెట్రీ.
పిల్లల కష్టాలు చూస్తే కరిగిపోతాను. వారి కష్టాలు తీర్చేందుకు డబ్బులు సాయం చేయలేను. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. నేనేమీ డబ్బులు తయారు చేయట్లేదు. కానీ, ఒక మంచి పని కోసం ఏమీ చేయకుండా ఉండలేను. నా ప్రయత్నం నలుగురికి ఉపయోగపడితే చాలనుకున్నాను. అందుకే పసిబిడ్డల ప్రాణాలు నిలబెట్టేందుకు రొమ్ముపాలు దానం చేస్తున్నాను. నేను చేయగలిగింది చేశాను.
మిల్క్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఒక లీటరు రొమ్ము పాలు 11 మంది నవజాత శిశువులకు ఒకపూట ఆకలి తీరుస్తాయి. అలిసీ ఒగ్లెట్రీ ఇప్పటి వరకు దానం చేసిన 2,645 లీటర్ల పాలతో దాదాపు 3,50,000 మంది శిశువుల ఆకలి తీర్చిందన్నమాట!