సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కీళ్లు అరిగి నొప్పులు మొదలవుతాయి. కానీ, ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే కీళ్ల సమస్యలు పలకరిస్తున్నాయి. శరీరంలో క్యాల్షియం, ప్రొటీన్ లోపం వల్ల మోకాలి నొప్పులు వస్తుంటాయి. అయితే, కొన్నిరకాల ఆహార పదార్థాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు.
యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండిన పసుపు సహజసిద్ధంగానే ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
వెల్లుల్లిలో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లంలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. మోకాళ్ల నొప్పులను సమర్థంగా తగ్గిస్తాయి. తాజా అల్లంతోపాటు శొంఠి రూపంలో తీసుకున్నా.. నొప్పులు తగ్గుముఖం పడతాయి.
వాల్నట్స్, బాదం, అవిసెలు, చియా, పైన్ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లవాపును తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.
యాపిల్స్, ఆప్రికాట్, క్రాన్ బెర్రీస్ వంటి పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి. నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆకుకూరల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో ముందుంటాయి. బ్రకొలీ, కేల్, పాలకూర వంటి ఆకుకూరలు మోకాళ్ల నొప్పులను అదుపులో ఉంచుతాయి.