ప్రభువును దైవ పుత్రునిగా క్రైస్తవ సమాజం ఎంతో విశ్వాసంతో కొలుస్తుంది. అటువంటి దేవుడి బిడ్డకు మరణం ఏమిటీ? అనే ప్రశ్న రావొచ్చు. కానీ అదో దైవ వాగ్దాన నిబంధనకు సంబంధించినది. ఆయన మరణం మానవుల పాపాలకూ, దైవ వాగ్దానానికీ ఒక వారధిలా నిలుస్తుంది. ఒక పరిష్కార మార్గంలా కనిపిస్తుంది.
క్రీస్తు ఇంకా ఏడు వందల సంవత్సరాలకు పుడతాడు అనగా.. యెషయా ప్రవక్త, క్రీస్తు మరణం గురించి ప్రవచిస్తూ ‘ఆయన మనకోసం మన దోషాల నిమిత్తమే మరణిస్తాడు’ అని ప్రకటించాడు. ‘ఆయనే మన రోగాల్ని భరించేది, మన వ్యసనాలూ సహించేది. మన అతిక్రమాల చేతనే, మన దోషాల చేతనే ఆయన శిక్షకు గురయ్యాడు. ఆయన వల్లనే మనకు స్వస్థత కలుగుతుంది’ (యెషయా – 53:4-5)
గుడ్ ఫ్రైడే అనేసరికి, ఏసుక్రీస్తుపై యూదులు చేసిన అక్రమ ఫిర్యాదులు తీసుకొని, ఆనాటి రోమన్ ప్రభుత్వం తీసుకున్న ఒక విషపు తీర్పు, అది దైవ చిత్తం అని స్వీకరించిన ప్రభువు గుర్తుకువస్తారు. భారంగా ఉండే ఆ శిలువ, దాన్ని మోయలేక ప్రభువు బోర్లా పడటం గుర్తుకువస్తాయి. ‘తండ్రీ! వారేం చేస్తున్నారో తెలియదు కాబట్టి, వారిని క్షమించూ’ అనే మాటలు జ్ఞప్తికి వస్తాయి. తలపై ముళ్ల కిరీటం, శిలువపై ప్రభువుని ఉంచి, చేతులకూ, కాళ్లకూ మేకులు కొట్టడం, ఆయన ఒళ్లంతా రక్తం చిందడం ఇవన్నీ కండ్లముందు కదలాడతాయి. ‘తండ్రీ! నా ఆత్మ మీకు అప్పగిస్తున్నా’ అంటూ మరణాన్ని స్వీకరించిన మహనీయుడు గుర్తుకువస్తాడు.
గుడ్ ఫ్రైడే నాడు ఆయన మరణంలో క్రైస్తవ లోకం ఒకే ఒక సూత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆయన మరణంలో మన కష్టం పాలెంత? అని లెక్కలు వేసుకోవాలి. మనం ఒకానొక విమర్శకే చచ్చిపోవాలనుకుంటాం. ఒళ్లు వంచి ఒక పని చేయడాన్ని అవమానంగా భావిస్తాం. ఒక చిన్నపాటి కష్టానికే విలవిల్లాడిపోతాం.
ఇవన్నీ మరణం అనే సముద్రంలో చిన్నచిన్న నీటి బిందువులే కదా! పరిశోధిస్తే, మరణాలన్నిటి లోనూ శిలువపైన మరణమే కఠినాతి కఠినం. అత్యంత హింసాత్మకం. అయితే ప్రభువు ఆ పరిస్థితిలోనూ మనసు జలదరించేలా కొన్ని విలువైన వాక్కులు పలికినట్టుగా బైబిల్ చెబుతున్నది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ మాటలను తమ జీవన విధానానికి, ఆధ్యాత్మిక పరివర్తనకూ అన్వయించుకుంటూ క్రైస్తవ లోకం శిలువ ముందు మోకరిల్లుతుంది.
శిలువపై ఉండగా ప్రభువు చేసిన చిన్న బోధ ఈ చీకటి లోకానికి క్రీస్తు చూపిన కాంతిరేఖ. ‘తోటి వారికి సాయపడండి, సాటి మనిషిని ప్రేమించండి! ఎవరినీ తిట్టవద్దు, హింసించనూ వద్దు! పరుల కోసం త్యాగం చేయడంలో ఆనందించండి’ అన్న క్రీస్తు సందేశం కల్వరి గిరుల్లోనే కాదు, ప్రతి క్రైస్తవుడి గుండెల్లో నేటికీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
-ప్రొ॥బెర్నార్డ్ రాజు 98667 55024