ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే అల్లం.. జుట్టు సంరక్షణలోనూ సాయపడుతుంది. దీనిలోని అనేక సుగుణాలు.. కేశాలను ఆరోగ్యంగా ఉంచడంలో, బలంగా మార్చడంలో ముందుంటాయి. అల్లంలో ఉండే ‘జింజరాల్’ అనే పదార్థం.. మాడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా, జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు వేగంగా పెరుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు.. చుండ్రుకు కారణమయ్యే శిలీంధ్రాలను తరిమేస్తాయి. నెత్తిపై చర్మం ఎండిపోవడం, దురద వంటి సమస్యలను తగ్గించడంలోనూ అల్లం నూనె ముందుంటుంది. జుట్టుకు సరికొత్త మెరుపునిచ్చి, మృదువుగా మారుస్తుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే ‘అల్లం నూనె’ను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
ముందుగా మీరు రెగ్యులర్గా వాడే నూనెను ఒక గాజు సీసాలో సగం వరకూ నింపుకోవాలి. అందులో అల్లం తురుము వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి.. అందులో ఈ నూనె సీసాను ఉంచాలి. గిన్నెను స్టౌ మీద పెట్టి.. నీళ్లు మరిగేదాకా వేడి చేయాలి. ఆ తర్వాత నూనె సీసాను బయటికి తీసి.. నూనె చల్లారిన తర్వాత వేరే సీసాలోకి వడకట్టుకోవాలి. ఈ నూనెను వాడటానికి ముందు.. కనీసం రెండుమూడు వారాలు నిల్వ చేసుకోవాలి. అప్పుడే.. అల్లంలోని సుగుణాలను నూనె పూర్తిగా గ్రహిస్తుంది. ఆ తర్వాత ఈ నూనెను జుట్టుకు ఉపయోగించుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.