మహిళా సాధికారత విషయంలో మహాత్ముడి ఆలోచనలు ఎంతో గొప్పగా ఉండేవి. ఆడవాళ్ల ఆర్థిక స్వావలంబనతోనే.. దేశ ప్రగతి సాధ్యమని ఆయన నమ్మేవారు. గాంధీజీ ఆలోచనలకు తగ్గట్టే.. మనదేశంలోని మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని తేలింది. తాజాగా, బీడీఎస్ బ్యాంక్ – రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు విషయాలను వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాల్లో.. 65 శాతంమంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి ఎలాంటి బ్యాంకు రుణాలు తీసుకోలేదట. మరో 39% మంది తమ వ్యక్తిగత పొదుపుతోనే అంకుర సంస్థలను ప్రారంభించారట.
ఇక బ్యాంకు రుణాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు 21% ఉండగా, 7% మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ప్రైవేట్ ఈక్విటీల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. 28% మంది వ్యక్తిగత ఆస్తిని, 25% మంది బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారట. వీరిలో 52% మంది 45 ఏళ్లు పైబడిన వారు ఉండగా, 25-35 ఏళ్ల మధ్య ఉన్నవారు 36% మంది ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఇక డిజిటల్ చెల్లింపుల విషయంలోనూ భారతీయ మహిళలు ముందున్నారు. కనీసం 73% మంది.. వినియోగదారుల నుంచి డిజిటల్ రూపంలో చెల్లింపులను స్వీకరిస్తున్నారు. తమ వ్యాపార ఖర్చులను చెల్లించడానికీ డిజిటల్ పద్ధతులను పాటిస్తున్నవారు 87% మంది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో.. 400 మందితో ఈ సర్వే నిర్వహించారు.