Cheruku mallika | పేదరికం పాటను పరిచయం చేసింది. పాట జీవితాన్ని నేర్పింది. బతుకులోని ఎత్తుపల్లాలను పల్లవి చరణాలుగా మలుచుకొని ‘నా పాట సూడు..’ అనుకుంటూ ముందుకు సాగిందామె. పరిస్థితులు ఎనిమిదో తరగతిలోనే చదువు మాన్పిస్తే.. మళ్లీ పాటే పట్టుబట్టి డిగ్రీ వరకు తీసుకెళ్లింది. అచ్చమైన పల్లె పాటల సోపతి.. చెరుకు మల్లిక పంచుకున్న పాటల ముచ్చట.
మాది నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారం. నేను ఆటల్లో చురుగ్గా ఉండేదాన్ని. ‘ఏం మల్లికా ఎప్పుడూ ఆటలేనా? పాటలు కూడా పాడొచ్చు కదా?’ అని మా సార్ ఎర్ర యాదగిరి అంటుండె. ఆయనే ఓ పాట ఇచ్చి పాడమన్నరు. మొదటిసారి పోటీల్లో పాల్గొన్న. ‘భరతజాతి గర్వపడెరా వీరుడ నినుజూసి’ పాటకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతి పతాకం’ గీతాన్నీ అందరూ మెచ్చుకున్నరు. అప్పుడు ఊర్లల్ల ప్రజా నాట్యమండలి కార్యక్రమాలు నడుస్తుండె. నేను కూడా ఇట్ల పదిమందికి ఉపయోగపడే పాటలు పాడితే బాగుంటది అనిపించింది.
అప్పుడు నేను ఎనిమిదో తరగతిలో ఉన్న. మా నాయినకు ఆరోగ్యం బాగలేకపోతుండె. ఆయన మంచాన పడటం వల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినయి. అసలే పేదరికం. దీంతో మాకు కష్టాలు మొదలైనయి. నాయినను ఏదో రకంగా కాపాడుకోనీకె అమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆర్నెల్లలోనే నాయిన మాకు దూరమైండు. ఏమీ చేయలేని పరిస్థితి. నేను ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన. అమ్మ ఒక్కతే ఎంతగనం కష్టపడుతది? నేనూ కూలి పనికి పోయేదాన్ని. ఒకసారి నాట్లేసేందుకు నిజామాబాద్ వలస పోయినం. వందల మంది ఉండేది. ఊరుగాని ఊరొచ్చినం. అమ్మలక్కలు మంచిమంచి పాటలు పాడుతుండె. నేను బాగా కనెక్ట్ అయిన. నాట్లయిపోయినంక ఊరికొచ్చినం. తర్వాత లారీలు, ట్రాక్టర్లలో ఇసుక నింపే పనికి వెళ్లిన. నేను ఏ పనిచేసినా, ఎక్కడున్నా పాట మీద ధ్యాస మాత్రం తగ్గలేదు.
అది 2000. ఊళ్లె ప్రజా నాట్యమండలి ప్రోగ్రామ్ నడుస్తాంది. వాళ్లకు ఒక గాయని కావాల్నంట. అది కూడా కొత్త గొంతు. వీర్ల సాయి నా పేరు చెప్పిండు. రమ్మన్నరు. వెళ్లి కలిసిన. రోజూ వంద రూపాయలు ఇస్తుండె. ఊరూరు తిరిగిన. ఒకసారి దేవరకొండలో ‘వివేకానంద యూత్ క్లబ్’ కార్యక్రమానికి వెళ్లినం. అక్కడ ‘అమ్మా నన్ను అమ్మకే..’ పాట పాడిన. క్లబ్ చైర్మన్ సార్‌కు నా పాట నచ్చింది. ‘మల్లికా.. మా సంస్థకు ఉమెన్ కో-ఆర్డినేటర్‌గా చేస్తవా? ఇక్కడ కూడా ఇలాగే పాట ద్వారా అవగాహన కల్పించడమే. నెలకు మూడున్నర వేలు ఇస్తం ’ అన్నరు. వసతి, తిండి సౌకర్యం కూడా ఉంటది. అన్నీ ఆలోచించి ‘ఓకే’ చెప్పిన. మండలాలన్నీ తిరిగి పాటల ద్వారా అవగాహన కల్పిస్తుంటే నక్సలైట్ అనుకొని పోలీసోళ్లు అరెస్ట్ చేస్తుండె. నక్సలైట్లేమో పోలీస్ ఇన్ఫార్మర్ అనుకుంటుండె. మూడేండ్లు అక్కణ్నే చేసిన. అమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసింది. తమ్మునిది చిన్న వయసు. అక్క పెండ్లయింది. ఇక నేనే ఉండాలి కాబట్టి, ఊరికి వచ్చేసిన. ప్రజా నాట్యమండలిలో కొనసాగిన.
మలిదశ ఉద్యమంలో భాగంగా నేనూ ఓ పాటనై తెలంగాణ ఆవశ్యకతను వినిపించిన. ‘ఆడుదాం డప్పుల్లా దరువెయ్ రా’, ‘చలో ధూమ్‌ధామ్’, ‘ఉద్యమాల యుద్ధభేరి సాంబశివుడురో’ వంటి పాటలు ఎక్కువగా పాడేదాన్ని. సహచరులంతా నన్ను జూనియర్ విమలక్క అంటుంటరు. పైలం సంతోషన్నతో కలిసి ప్రోగ్రామ్స్ చేసిన. అమరన్న రాసిన ‘తాగవోతె నీళ్లు లేవు తుమ్మెదాలో.. తడిగొంతులెండిపోయె తుమ్మెదాలో’ పాటను సంతోషన్న నాతో క్యాసెట్లో పాడించిండు. ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాటలో నేను కూడా నటించిన. ప్రస్తుతం సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్న. 2016లో రసమయి బాలకిషనన్న కళాకారులను అమెరికా తీసుకెళ్లిండ్రు. నాకూ వెళ్లే అవకాశం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. పాట ద్వారానే ఈ పిలుపు వచ్చింది. 2019లో మరోసారి బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి పిలుపొచ్చింది. నిజానికి ఈ అవకాశం గంగకు వచ్చింది. కొన్ని కారణాల వల్ల తను వెళ్లలేదు. ఈవెంట్‌కు మూడ్రోజులే సమయం ఉంది. మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన నందన్నవాళ్లు నన్ను అడిగిండ్రు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భమది.
నాకు పాట తప్ప వేరే పని తెలియదు. ‘మోటిడిసి నువ్వోతె సోమయా.. ఎడ్లాగమైతయిరా సోమయా’ వంటి అచ్చమైన జానపదాలెన్నో పాడిన. నాకంటూ సొంత వేదికొకటి ఉండాలె అని ‘మల్లిక స్వరం’ అనే చానెల్ పెట్టిన. దాని ద్వారా ‘భగభగమండె బడబానలమె’, ‘జాలిజాలి కురులాది జాలి కురులాదో జాలి మొగిలాలీ’, ‘ఎన్నడు కొట్టని నా మొగుడమ్మో ఏటికర్రతోటి కొట్టె’ వంటి జానపదాలను విడుదల చేసిన. ‘జాలి జాలి కురులాది..’ పాటకు మంచి ఆదరణ లభించింది. జానపదంపై మరింత అధ్యయనం చేసి, మంచి మంచి పల్లె పాటలను సేకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన. పేదరికం వల్ల ఎనిమిదో తరగతికే చదువు ఆపేసిన నేను తర్వాత ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివిన. నాలో ఇంత పరిణతి, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం రావడానికి నన్నుగన్న నా తల్లి చంద్రమ్మ, నాయిన నాగమల్లు జీవితాలే ప్రేరేపించినయి.
.. ✍ దాయి శ్రీశైలం
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు