Telangana Martyrs | ఎగజిమ్మిన తొలి రక్తపు చుక్క.. ఉద్యమానికి వేగుచుక్క.. నిలదీసిన మొదటి గొంతుక.. పోరాట స్ఫూర్తికి చైతన్య గీతిక. సిటీ కాలేజ్ ఆవరణలో.. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఆకాంక్షకు బీజం పడింది. పాతబస్తీ వీధుల్లో ఊరేగింపై నడిచింది. లాఠీలను ఎదిరించి, తూటాలను ముద్దాడింది. నెత్తుటి పిడికిళ్లు పోరాట జెండాలెత్తాయి. తెలంగాణ ఉద్యమం ధిక్కారమై తొలి అడుగువేసింది. ఆ త్యాగాలకు జేజేలు… ఆ అమరులకు నివాళులు .. ఆ ఉద్యమ యోధులకు సలాములు.
తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్ ముల్కీలదే ఆధిపత్యం. కోటి రతనాల వీణ శతకోటి ఆశలు కల్లలయ్యాయి. ప్రజల్లో ఆవేశం రగిలింది. ఆ అన్యాయం పాతబస్తీలో అగ్గి రాజేసింది. 3 సెప్టెంబరు 1952న ప్రజల ధిక్కారం ఊరేగింపుగా కదిలింది. మా ఉద్యోగాలు మాగ్గావాలంటూ సిటీ కాలేజ్ సమీపంలో ఒక్కటయ్యారు.
‘ఇడ్లీ సాంబార్.. గో బ్యాక్
వడ సాంబార్.. గో బ్యాక్
గోంగూర పచ్చడి.. గో బ్యాక్’
నినాదాలతో పాతబస్తీ మార్మోగింది. సిటీ కాలేజ్ సమీపంలో గుమికూడిన ఉద్యమకారులతో ఊరేగింపు బయల్దేరింది. మదీనా చౌరస్తాకు రాగానే పోలీసులు అడ్డగించారు. లాఠీలు ఝళిపించారు. అయినా తలవంచకపోతే, తూటాలు ప్రయోగించారు. పాతబస్తీ రక్తసిక్తమైంది. ఆ జన సమూహాన్ని పటాలాలు చెల్లా చెదురు చేయలేకపోయాయి. ఆ ఊరేగింపు పురానాపూల్ దాటి మొజంజాహీ మార్కెట్ దాకా ఓ ధిక్కార యాత్రలా సాగింది. పోలీసు కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యమకారులు మరుసటి రోజు మరణించారు. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. పరిస్థితి చేయిదాటిపోయింది. ‘ముల్కీ ఉద్యమం అన్ని పట్టణాలకూ వ్యాపించింద’ని నాటి ఉద్యమంలో (జనగామలో) పాల్గొన్న కెప్టెన్ పాండురంగారెడ్డి గుర్తుచేసుకున్నారు.
1969 ఉద్యమంలో.. వెంకట్ రావు మెమోరియల్ ఉన్నత పాఠశాల ముందు విద్యార్థుల ఊరేగింపుపై పోలీసులు దాడి చేసిన ప్రదేశాన్ని చూపుతున్న ఆనాటి విద్యార్థి సత్యనారాయణ
హైదరాబాద్ స్టేట్ మూడుముక్కలై.. మూడు రాష్ర్టాల్లో కలిసిపోయింది. 1 నవంబరు 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నియామకాలు, నీళ్లు, నిధుల విషయంలో పాలకులు తీవ్ర అన్యాయం చేశారు. 1969 నాటికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉద్యమరూపం తీసుకున్నాయి. పోలీసు నిర్బంధం, కాల్పులతో తెలంగాణలో చీకటి రోజులు మొదలయ్యాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ నివాసి సత్యనారాయణ నాటి పరిస్థితుల్ని గుర్తుచేసుకుంటూ.. ‘అప్పుడు నాకు పదహారేండ్లు. మా ఇంటికి దగ్గర్లో ఉన్న వెంకట్ రావు స్మారకోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న. చెన్నారెడ్డి మా స్కూల్ కమిటీ సభ్యుడు. మా సీనియర్లు తెలంగాణ మీటింగులకు పోతున్నరు. ఎవరినీ ఉద్యమంలోకి పోకుండ జేయమని హెడ్ మాస్టర్‌కు పోలీసులు చెప్పిండ్రు. ఆ మాటలెవరూ పట్టించుకోలే. పిలగాండ్లు జమయితున్నరని బడులు మూయించిన్రు. అయినా పొద్దెక్కంగనే రోడ్డెక్కుతున్నరు.
1969 తెలంగాణ అమరుల స్మారక స్థూపం, గన్‌పార్క్
ఊరేగింపు తీస్తున్నరు. పాతబస్తీలో రెండు మూడు నెలలు గడబిడ అయింది. ఒక రోజు మా స్కూల్ ముందు నుంచే తెలంగాణ ఊరేగింపు పోతున్నది. ఓ నూట యాభై మంది దాంక ఉంటరు. అప్పటికే అక్కడ పోలీసులు దిగిండ్రు. ఊరేగింపును ఆపిండ్రు. లాఠీ చార్జ్ చేశిండ్రు. అందర్నీ చెల్లా చెదురు జేశిండ్రు. బడి పిలగాళ్లు, పెద్ద్దోళ్లు రాళ్లందుకున్నరు. బస్సు అద్దాలు పగిలిపోయినయ్. దుకాణాలన్నీ బంద్ అయినయ్. మస్త్ గడబిడైంది. పోలీసుల దెబ్బలకు చెట్టుకొకళ్లు పుట్టకొకళ్లయితరనుకున్నరు. జనమంతా మొఘల్‌పురా దిక్కు పోయిండ్రు. అక్కడ ఊరేగింపు తీసిండ్రు. మిలటరీ దిగింది. కనపడ్డోన్నళ్లా ఉరికిచ్చి కొట్టిన్రు. దొరికినోన్ని దొరికినట్టు పట్టుకపోయిన్రు. ఇల్లిల్లు వెతికిండ్రు. మీసం మెలేస్తున్నట్టు కనబడితే చాలు. ఆ పోరగాళ్లను పట్టుకపోయిండ్రు. పాయకానా దొడ్డిల ఉన్నోన్ని కూడా ఎత్తుకపోయి, జైలుల పెట్టిన్రు. అంతా పదిహేను, పదహారు, పదిహేడు సంవత్సరాల వాళ్లే! అయిదు రోజులకు వదిలిపెట్టిన్రు. మల్లా తెలంగాణ లొల్లే. అదే ఊరేగింపు. పోలీసోళ్లు కొట్టుడు. కాల్చుడు. ఆ ఏడాదంతా యుద్ధమే నడిచిందిక్కడ. బడులన్నీ బంద్’. ప్రతి మాటా సత్యమే. ఇప్పటికీ ఆ దృశ్యాలు సత్య నారాయణ కలల్లో కదలాడుతుంటాయి. నిద్రలో ఆయన ఉలిక్కి పడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
తొలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని, ఆ తర్వాత ఆర్థిక వేత్తగా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి చెన్నమనేని హనుమంతరావు. గతాన్ని గుర్తుచేసుకున్నారు. “నేను నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్నందుకు పాఠశాల రోజుల్లోనే బహిష్కరించారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రైవేటుగా చదువుకున్నాను. తర్వాత సిటీ కాలేజీలో చేరాను. మళ్లీ బహిష్కరించారు. ఆ కాలంలోనే విశాలాంధ్ర వాదన ముందుకు వచ్చింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు విశాలాంధ్ర పట్ల సానుకూలంగా ఉన్నారు. మేమంతా మంచే జరుగుతుందని భావించాం. నేను ఏఐఎస్ఎఫ్లో పన్నెండేండ్లు పనిచేశాను. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పని చేశాను. ఉస్మానియాలో ఎంఏ (ఎకనామిక్స్) తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశాను. చదువు పూర్తికాగానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. అంతలోనే, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. విద్యార్థులు బాగా పాల్గొన్నారు. ఉద్యమ సభల్లో ప్రసంగించేందుకు రావాలని నా విద్యార్థి ఉద్యమ సహచరుడు బూర్గుల నరసింగరావు ఆహ్వానిస్తే హైదరాబాద్ వచ్చాను.
ఉస్మానియా, సిటీ కాలేజ్ విద్యార్థుల నేతృత్వంలో జరిగిన వివిధ ఆందోళనల్లో పాల్గొన్నాను. అప్పుడే, నా ఆలోచనలు మారిపోయాయి. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్ష గురించి ప్రపంచానికి తెలియ చెప్పకుండా ఉండలేకపోయాను. ఢిల్లీ వెళ్లిన తర్వాత.. ఇప్పటి వరకూ జరిగిన అన్యాయానికి తెలంగాణ ఏర్పాటే పరిష్కారమంటూ ‘లెటర్ టు ది ఎడిటర్ ఆన్ తెలంగాణ’ పేరుతో ఆంగ్ల పత్రికలకు లేఖ రాశాను. ది స్టేట్స్‌మన్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ లేఖ ప్రచురితమైంది. తర్వాత నేషనల్ హెరాల్డ్, మరో ఆంగ్ల పత్రిక కూడా ప్రచురించాయి. అక్కడితో ఆగకుండా.. ఒక ఆర్థిక వేత్తగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనుకున్నాను. తెలంగాణ రెవెన్యూ మిగులు లెక్కలు తేల్చి, ఆ నిధులు ఇతర ప్రాంతాలకు ఎలా మరలుతున్నాయో చెబుతూ అదే ఏడాది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వ్యాసం రాశాను.
తెలంగాణపై వివక్ష, వనరుల దోపిడి, అభివృద్ధిలో వివక్ష గురించి ఈపీడబ్ల్యూ, ఎకనామిక్ టైమ్స్‌కి వ్యాసాలు రాస్తూనే వచ్చాను. ఆ క్రమంలోనే చిన్న రాష్ర్టాలే అభివృద్ధికి అనుకూలమైనవనే నిర్ణయానికి వచ్చాను. చిన్న రాష్ర్టాలను సమర్థిస్తూ అనేక వ్యాసాలు వెలువరించాను. జార్ఖండ్ ఏర్పాటుకు నా వంతు మద్దతిచ్చాను. 2010లో మెయిన్ స్ట్రీమ్‌లో ‘ఎ స్టేట్ హుడ్ టు తెలంగాణ’ పేరుతో తెలంగాణలో ఉద్యోగ సమస్య, నీటి సమస్యల గురించి సమగ్ర వ్యాసం రాశాను. మొత్తానికి సబ్బండ వర్గాల పోరాటాలు ఫలించి తెలంగాణ వచ్చింది” అంటూ ఉద్యమాన్నీ, ఉద్యమానంతర పరిణామాల్ని విశ్లేషించారు చెన్నమనేని.
ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పాలన బాధ్యతలు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల సరైన విజన్ ఉంటున్నది. అందుకే కొత్త రాష్ట్రమైనా.. అనేక సమస్యలను తేలిగ్గా అధిగమించింది. ఏ రంగంలోనూ సంక్షోభం తలెత్తలేదు. జాతీయాదాయం పెరుగుదల కంటే తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల ఎక్కువగా ఉన్నది. దీనివల్ల తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేలకు చేరింది. అదే దేశ తలసరి ఆదాయం.. 1 లక్షా 71 వేలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన నాటి కంటే ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉన్నాం. చిన్న రాష్ట్రం, అందులోనూ కొత్త రాష్ట్రం అయినా కూడా ఇంతటి ప్రగతి సాధించడం అన్నది ఆర్థిక రంగంలో గొప్ప విజయం. ఇది ఉత్తగా వచ్చిన ప్రగతి కాదు. నాయకుడి ఉత్సాహం, పట్టుదల, ధైర్యం వల్ల జరిగిన ప్రగతి. రాష్ట్రంలో ఏటా సాగుభూమి పెరుగుతున్నది. వ్యవసాయ దిగుబడి పెరుగుతున్నది. ఫలితంగా ఉపాధి పెరిగింది.
ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.. సమరభేరి సిటీ కాలేజ్
రాష్ట్ర ఆదాయం పెరగడానికి కూడా ఇదే ప్రధాన కారణమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ సేద్యానికి ఆలంబనగా నిలిచాయి. 46 వేల చెరువులు, కుంటలను సరిదిద్దారు. కాళేశ్వరం గోదావరిని ఒడిసి పట్టింది. నీటిమట్టం పెరిగింది. ఈ ప్రగతితోపాటుగా వ్యవసాయ రంగంలో గతంలో కనిపించిన సంక్షోభమూ సమసి పోతున్నది. రైతుల ఆత్మహత్యలు లేకుండా పోయాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పాలసీ వల్ల పెట్టుబడులు పెరిగాయి. పాత పద్ధతిలో పరిశ్రమల స్థాపనకు చాలా సమస్యలు ఉండేవి. అనుమతులకు ఆలస్యం అయ్యేది. ప్రభుత్వం పట్ల నమ్మకం, మతకలహాలు లేకపోవడం, శాంతియుత సమాజం వల్లనే పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయి. కొత్తగా 73 వేల ఉద్యోగాలు సృష్టించుకున్నాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 3.5 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించడమే ఈ సానుకూలమైన మార్పునకు కారణం. దేశంలో సర్వీస్ సెక్టార్ (ఐటీ, రెస్టారెంట్లు, హోటల్స్ మొదలైనవి) రంగంలో పెరుగుదల కంటే.. తెలంగాణలో వార్షిక పెరుగుదలే ఎక్కువగా ఉంది. ఐటీ ఎగుమతుల్లో సగటు వార్షిక పెరుగుదల 16 శాతం ఉంది. ఇవన్నీ పెద్ద విజయాలే కాదు.. గొప్ప విజయాలు కూడా. తెలంగాణ వస్తే ఆగమాగం అవుతామని భయపడ్డవాళ్లని, భయపెట్టిన వాళ్లని ఆశ్చర్య పరిచే నిజాలు కూడా! ఈ సందర్భంగా అమర వీరులకు జోహార్లు అర్పించాలి. ఆ త్యాగాలు వృథాగా పోలేదని సగర్వంగా ప్రకటించాలి.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఒక రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఓ ప్రాంతం కోసం ప్రత్యేక నిబంధనలు అమలు కాలేవని ఫజల్ అలీ కమిషన్ ఆనాడే చెప్పింది. గతంలో, స్కాట్లాండ్ ప్రజల కోసం ఏర్పాటు చేసిన నిబంధనలకు కూడా బ్రిటన్‌లో ఇదేగతి పట్టింది. కాబట్టి ప్రత్యేక నిబంధనల కంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడమే ఉత్తమమని ప్రకటించింది. కమిషన్ ఊహించినట్టే.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక నిబంధనలు అమలు కాలేదు. దీంతో 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైంది.
‘బయట ఏదో గడబిడైతుందని తెలిసి లాల్ దర్వాజ నుంచి మొఘల్పురాకి ఉరికిన. అక్కడ మస్త్ జనం ఉన్నరు. పోలీసులున్నరు. కాసేపటికే తుపాకులతో కాలుస్తున్నరు. నేను గోడ సాటుగ నక్కిన. మా చుట్టాలబ్బాయికి చేతిలోకి తూటా దిగింది. కాసేపైనంక ఇంటికొచ్చి దాక్కున్న. అట్ల ఏడాది కాలం అందరం భయంతోని బతికినం. ఆ తర్వాత కూడా అదే భయం. తెలంగాణ రాలే. పరాయోళ్లు పోలే. తెలంగాణ ఉద్యమం తర్వాత.. స్వార్థ రాజకీయాలకు పాతబస్తీ ఆగమైంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మతం చిచ్చు పెట్టిన్రు. ఒకళ్లకొకళ్లు నరుక్కొనేట్టు చేశిన్రు. అప్పటి సంది లాఠీ చార్జీలు, రాళ్లు విసురుకొనుడు, కాల్పులు, చావులు… మా పాతబస్తీ పీనుగుల దిబ్బయింది. తెలంగాణ వచ్చినంక కర్ఫ్యూ మర్చిపోయినం. కాల్పులు ఆగిపోయినయ్. ఇక్కడ బతికేటోళ్లకు మంచిగున్నదిప్పుడే. అప్పట్ల.. ఇగ మనబతుకింతే అనుకున్నం. కానీ, ఇసుంటి రోజులొస్తయని ఎవరూ అనుకోలే! కాలం ఎప్పుడు ఇట్లనే ఉండాలె’ అంటున్నడు పాతబస్తీకి చెందిన ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రం
ఇస్తే మతకల్లోలాలు తలెత్తుతాయని, నక్సలిజం ప్రబలిపోతుందని భయపెట్టింది శ్రీకృష్ణ కమిషన్. ఆయన మాటలు తప్పని ప్రభాకర్ మాటలే కాదు కేంద్ర ప్రభుత్వ నేర గణాంకాలు కూడా చెబుతున్నాయ్.
1952లో ముల్కీ నిబంధనల అమలు కోసం ఉద్యమించిన వారి వెనుక రజాకార్లు ఉన్నారని నాటి ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. కాల్పుల ఘటనపై విచారించేందుకు నియమించిన జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఇందులో కుట్ర కోణం లేదని తేల్చింది. ఉద్యోగాల కోసమే స్థానిక హిందూ ముస్లింలు ఐక్యంగా ఉద్యమించారని చెప్పింది. మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంలో శ్రీకృష్ణ కమిషన్, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, సీమాంధ్ర నేతలు.. మత కలహాలు జరుగుతాయనే విద్వేష ప్రచారాలు చేశారు. పరిశ్రమలు పోతాయని, పెట్టుబడులు రావని, తెలంగాణ విఫలమవుతుందని జోస్యం చెప్పారు. కానీ, తెలంగాణ సఫలమైందని ఆర్థిక, సామాజిక ప్రగతి నివేదికలు లెక్కతేల్చి చెబుతున్నాయి!
ఖమ్మం పట్టణంలో 1969 జనవరి 9న.. విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. ఇది విద్యార్థి, ఉద్యోగ వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. రాజకీయ నేతలూ ఉద్యమంలోకి ప్రవేశించడంతో తెలంగాణ రాష్ట్ర సాధనే పరిష్కారమన్న భావన మొగ్గ తొడిగింది. తీవ్ర నిర్బంధం, నేతల ద్రోహం వల్ల తొలి దశ తెలంగాణ ఉద్యమం నీరుగారింది. మూడు వందల మంది త్యాగాలు వృథా అయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు మేధోశ్రమ, కవులూ కళాకారుల కృషితో మళ్లీ తెలంగాణ వాదం జీవం పోసుకుంది. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో తెలంగాణవాదం బలపడింది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమానికి భుజం కలపడం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, సకల జనుల సమ్మె, విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. పుష్కలమైన నీళ్లతో తెలంగాణ సస్యశ్యామల మైంది. దేశానికే ఆదర్శమైంది. ఇతర రాష్ర్టాలకు అభివృద్ధి పాఠమైంది. అమరుల స్వప్నాలను సాకారం చేసింది.. బంగారు తెలంగాణ!
-నాగవర్ధన్ రాయల
-నర్రె రాజేష్