ఇంట్లో పాము జొర్రితే.. చూరుకు నిప్పంటుకుంటే… దొంగల అలికిడైతే.. ఇంకేదైనా ఆపద వస్తే… సాయం చేయరమ్మని మగవాళ్ల కోసం కేకలు వేసే రోజులు పోయాయ్. ఏదో ఒకటి చేయడానికి కాదు ఏది చేయడానికైనా ఆడవాళ్లూ సిద్ధమవుతున్నారు. తెగువ మగవాళ్ల సొత్తు కాదు. మాకూ సొంతమంటున్నారు మగువలు. బొగ్గుబాయిలోకి నీళ్లొచ్చినా, గనిలో విష వాయువు కమ్మినా, ప్రాణాల మీదికి వచ్చినా ధైర్యంగా తోటి కార్మికుల్ని కాపాడతామంటున్నారు సింగరేణి సివంగులు!
మైనింగ్‌లో మగవాళ్లే పనిచేస్తారనేది గతం. ఇప్పుడు అన్ని పనుల్లోకి అడుగుపెడుతున్నట్టే.. సింగరేణి కొలువుల్లోకీ మగువలు ప్రవేశించారు. మేనేజ్మెంట్ ట్రైనీలుగా కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మాయిలు.. బొగ్గుబాయి కార్మికులతో పనులు చేయించడం, రేపటి పనికి ప్లాన్ చేయడంతోపాటు పనిలో ప్రమాదం జరిగితే తోటి కార్మికుల్ని కాపాడుకునే రిస్కూ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కొలువులో చేరి ఆరు నెలలు అయ్యిందో లేదో.. రెస్క్యూ టీమ్‌లో చేరి రిస్క్‌కు ‘మేం రెడీ’ అంటున్నారు.
‘కొలువు చేస్తే సింగరేణిలో చేయాలె’ అనుకున్నది రక్షిత. కరీంనగర్లో కార్పెంటర్ పనిచేసే నరేందర్ బిడ్డకు ఆ కోరిక ఎందుకు కలిగిందంటే… వాళ్ల నాన్న తరానికి సింగరేణే ప్రపంచం. అందులో ఉద్యోగం చేయాలన్నదే ఆయన కల. ఆ కలను నిజం చేయడం కోసం బీటెక్ మైన్స్ చదివానంటున్నది రక్షిత. మంథనిలోని జేఎన్టీయూ కాలేజీలో మైనింగ్ కోర్స్ చేసింది. అనుకున్నట్టే సింగరేణిలో మైనింగ్ ట్రైనీగా చేరింది. ‘ఇది నాన్నకోసమే కాదు, నాకోసం కూడా! ఎందుకంటే ఈ కొలువు మిగతా కొలువుల్లెక్క కాదు. రోజుకో తీరుగ ఉండే జాబ్.. ఇందులో సాహసం ఉంటుంది. అందుకే ఇష్టంగా తీసుకున్నానని చెబుతున్నది రక్షిత.
కోల్‌బెల్ట్‌లో చాలామంది లైఫ్ సక్సెస్‌కి బొగ్గుబాయే కేరాఫ్ అడ్రస్. అట్లనే కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉన్నయి. వాటిలో ఒకే ఇంట్లో రెండు ఫెయిల్యూర్ స్టోరీస్ చెబుతున్నది కరీంనగర్ జిల్లా కిష్టంపేట ఆడబిడ్డ అల్లం నవ్యశ్రీ. ‘మా అమ్మ తరఫు తాత, మా నాన్న తరఫు తాత బొగ్గుబాయిలనే కార్మికులుగా పనిచేసిండ్రు. మా తాతలు గోల్డెన్ స్కీమ్‌లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నరు. మా తాత రిటైర్మెంట్ తీస్కున్నడు కాబట్టి తనకు జాబ్ రాలేదని నాన్న బాధపడేటోడు. నేను నాన్న చేతుల్లో పెరిగిన. నాకున్న నాలెడ్జ్ సింగరేణి. కాబట్టి బొగ్గుబాయిలనే పనిచేయాలని మైనింగ్ ఇంజినీరింగ్ చేసిన. అనుకున్నట్టే కొలువుకి వచ్చిన’ అని సింగరేణి స్వప్నం నెరవేరిన సంతోషం పంచుకుంది అల్లం నవ్యశ్రీ.
మైనింగ్‌లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఆడబిడ్డలు ఇచ్చిన పనేదో చేసుకుని పోదామనే బాపతు కాదు. అంతకుమించి సాహసించడానికి సిద్ధమయ్యారు. ఎంతో కష్టంతో కూడిన రెస్క్యూ టీమ్‌లో చేరడానికి ముందుకొచ్చారు. వీరిలో మేనేజ్మెంట్ ట్రైనీ అనూష ఒకరు. మంథనిలో బీటెక్ మైన్స్ చదివింది. ‘రోజువారీగా వర్కర్లను పనికి పురమాయించడం, పని చేయించడం, మరుసటి రోజు పనికి ప్లాన్ చేయడం మా మేనేజ్మెంట్ ఇంజినీర్ల బాధ్యత. కార్మికుల బాగోగులు చూసుకోవాలి. వారు డీ హైడ్రేషన్‌కు గురైనా, గాయాలపాలైనా ఫస్ట్ ఎయిడర్ సాయం అందిస్తారు. కానీ, నేనేం చేయలేకపోతున్నాను. అందుకే ఫస్ట్ ఎయిడర్ కావడం కోసం రెస్యూ టీమ్‌లో చేరాను. ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నాను. ప్రమాదాలను నివారించడం కూడా నేర్చుకున్నా. ప్రమాదవశాత్తూ ఒకరి ప్రాణాల మీదికి వస్తే.. కాపాడే అవకాశం వస్తుందని రెస్క్యూ టీమ్‌లో చేరా’నని చెబుతున్నది అనూష. చిన్న వయసులో ఎంత పెద్దమనసు. ఇంత చేసినా అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. రోజూ చేసే పనిచేయాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి వెళ్లి రెస్క్యూ చేయాలి. అదనపు వేతనం లేకున్నా కష్టంతో కూడుకున్న బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధపడిన ఈ సింగరేణి ఆణిముత్యాలను కార్మికులే కాదు యాజమాన్యమూ అభినందిస్తున్నది.
ప్రమాదాలు, విపత్తుల సందర్భంలో వేగంగా పనిచేయడం, ప్రాణాలు కాపాడటం, చాకచక్యంగా వ్యవహరించి నష్టాన్ని నివారించడం రెస్య్యూ టీమ్ బాధ్యత. ఇవన్నీ చేయాలంటే మానసికంగా దృఢంగా ఉండటం మాత్రమే సరిపోదు. శారీరకంగా బలంగానూ ఉండాలి. ఎన్నో పరీక్షలు నిర్వహించి టీమ్‌ని ఎంపిక చేస్తారు. వారికి కఠోర శిక్షణ ఇస్తారు. ఇసుక బస్తాలు వంద మీటర్లు మోసుకెళ్లడం, అగ్నికీలలు చుట్టుముట్టినప్పుడు తెగువ ప్రదర్శించడం ఇలా అపాయాల్లో ఉపాయంగా బయటపడేసే మార్గాలు నేర్పించారు. రెస్క్యూ టీమ్‌కు ఎంపికైన 13 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. బొగ్గుబాయిలో సాధారణంగా జరిగే ప్రమాదాలను రామగుండం 2 రెస్యూ స్టేషన్లో కృత్రిమంగా సృష్టించి వీరికి శిక్షణ ఇచ్చారు. కూలిన బావుల్లో దారులు వేసుకుంటూ, ఊపిరాడని చోట సెల్ఫ్ కంటెయిన్డ్ బ్రీథింగ్ అపారెటస్ సాయంతో రెండు గంటలపాటు పనిచేయడం లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం కచ్చితమైన సేవలు అందించేలా రాటుదేలి రెస్యూ పట్టా అందుకున్నారు. ఫస్ట్ రెస్య్యూ ఉమెన్స్ టీమ్‌గా అభినందనలు అందుకుంటున్నారు. ఈ బృందం సింగరేణిలో మాత్రమే కాదు తెలంగాణలో, మరెక్కడైనా వరదలు, విపత్తులు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించడానికి రెడీగా ఉంటుంది. రిస్క్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధం అంటున్న ఈ సివంగులు మన నల్ల బంగారు గని సింగరేణిలో సానబెట్టిన వజ్రాలు అనడంలో సందేహం లేదు.
నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు మా స్కూల్ పిల్లల్ని ఊరికి దగ్గర్లో ఉన్న డోలమైట్ గనిలోకి తీసుకెళ్లారు. అప్పుడే మైనింగ్‌లో పని చేయాలని ఫిక్సయ్యా. మా మేనమామ జాన్ షహీద్ టీచర్. తనే నన్ను చదివించాడు. ఇష్టమైన పని చేయాలని ప్రోత్సహించాడు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో మైనింగ్ ఎంచుకున్నాను. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌లో చేరాను. మాపని చాలా కష్టంతో కూడుకున్నది. మేం ఎలాంటి పరిస్థితుల్లో పని చేస్తామో అమ్మకు చెప్పాను. అయినా ఆమె వద్దని చెప్పలేదు. నలుగురినీ కాపాడే అవకాశం రావడం గొప్ప విషయం అని ప్రోత్సహించింది.
షేక్ ఆసియా బేగం
మాదారం, ఖమ్మం జిల్లా