e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిందగీ యువర్‌ ఆర్డర్‌.. మేడమ్‌!

యువర్‌ ఆర్డర్‌.. మేడమ్‌!

జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది అంకిత. అందాల్సిన సమయానికి ఓ నిమిషం ముందే, కాలింగ్‌ బెల్‌ మోగింది. డోర్‌ తీసేసరికి ఎదురుగా ఓ యువతి. చేతిలో ఫుడ్‌ కవర్‌. చిరునవ్వులు చిందిస్తూ ‘యువర్‌ ఆర్డర్‌ మేడమ్‌!’ అందాఅమ్మాయి. కవర్‌ అందుకుని లోనికి వెళ్లబోయింది అంకిత. అంతలోనే వెనక్కి తిరిగి ‘యు ఆర్‌ సింప్లీ సూపర్బ్‌’ అంటూ మనసారా అభినందించింది. ఫుడ్‌ డెలివరీ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించిన రచనకు రోజూ ఇలాంటి అనుభవాలు మామూలే. బైక్‌లపై రయ్య్‌మ్రంటూ దూసుకుపోయే ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ని దాటుకొని, తన ఉనికిని చాటుకుంటున్నది తెలంగాణ తొలి ఫుడ్‌ డెలివరీ గాళ్‌ రచన.

‘అన్నా! మీరు జొమాటోలో ఫుడ్‌ డెలివరీ చేస్తారా?’ అంది రచన.
అవునన్నట్టు తలూపాడు ఆ యువకుడు.
‘పైసలు బాగానే వస్తయా? ఆడోళ్లను చేయనిస్తరా?’ మళ్లీ ప్రశ్నించింది.
అప్పటి వరకు ఆ యువకుడు ఎవరో తనకు తెలియదు. అయినా, అవసరం పలుకరించేలా చేసింది.

- Advertisement -

వరంగల్‌ జిల్లా బాలసముద్రం రచన వాళ్ల ఊరు. నాన్న రవి. అమ్మ సాంబ. ఇద్దరు ఆడపిల్లలు రుచిత, రచన. రవి మేస్త్రీ పని చేస్తాడు. భార్యాభర్తలిద్దరూ కూలీకి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి. తన చదువు తల్లిదండ్రులకు భారం కావొద్దని స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంది రచన. ఇంటర్‌ పూర్తవగానే పెద్దకూతురు రుచిత పెండ్లి చేశాడు రవి. ఆ ఖర్చులకు అప్పుల్లో కూరుకుపోయాడాయన. ఇంటర్‌ అయ్యాక ఇంకా చదువాలనుకుంది రచన. పెద్ద ఉద్యోగం చేయాలన్నది తన ఆశయం. కానీ, నాన్నను ఇబ్బంది పెట్టొద్దని భావించింది. తన సంపాదనతోనే చదువుకోవాలని నిర్ణయించుకొంది. ‘డిగ్రీ చదివి, ఉద్యోగం చేయాలంటే చాలా కాలం పడుతుంది. చదువుకుంటూనే ఉద్యోగం చేయాలనుకున్నా. మెరుగైన ఉపాధి అవకాశాలున్న కోర్సులు ఏం ఉన్నాయో ఆరా తీశాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అయితే బాగుంటుందని కొందరు సూచించారు. స్నేహితుల సలహాతో చెన్నైలోని ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీని ఎంపిక చేసుకున్నా. అడ్మిషన్‌ అప్పుడు ఫీజు రెండున్నర లక్షల రూపాయలని చెప్పారు. కానీ, అంత ఖర్చు భరించే స్థితిలో మా కుటుంబం లేదు’ అని గుర్తు చేసుకుంది రచన. మళ్లీ ఆలోచనలు చుట్టుముట్టాయి. అయినా, ధైర్యం చేసి హైదరాబాద్‌ బ్రాంచ్‌లో జాయిన్‌ అయింది. స్నేహితురాలి సాయంతో ఫీజు చెల్లించింది.

పాలకేంద్రంలో తొలి పని
సంపాదన కోసం, తార్నాకలోని పాలకేంద్రంలో పనికి కుదిరింది రచన. ఉదయం నాలుగు గంటలకే లేచేది. పాల ప్యాకెట్లు వేసి వచ్చేది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు షాప్‌లో కూర్చునేది. తర్వాత సికింద్రాబాద్‌లోని కాలేజీకి వెళ్లి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పాఠాలు వినేది. ఇంతలో కరోనా కల్లోలం మొదలైంది. లాక్‌డౌన్‌ విపత్తు ఊడిపడింది. ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. ‘పాలకేంద్రంలో వచ్చే జీతం తక్కువ. అందులోనే గది అద్దె, ఫీజు చెల్లించాలి. అమ్మానాన్నకు పంపడం సాధ్యం కాదు. చదువు కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఆదాయం పెరిగితే తప్ప చదువు ముందుకు సాగదని అర్థమైపోయింది. అప్పుడే ఓ రోజు దుకాణంలో రాజు అనే జొమాటో బాయ్‌ కనిపించాడు’ అని తన కథంతా చెప్పుకొచ్చింది రచన.

జర్నీ మొదలు
ఫుడ్‌ డెలివరీ గురించి అడుగుతున్న రచనను వింతగా చూడలేదు రాజు. కావాల్సిన సమాచారం ఇచ్చాడు. ఆమె ఫోన్‌నంబర్‌ను జొమాటో నిర్వాహకులకు రెఫర్‌ చేశాడు కూడా! టిక్‌ అంటూ రచన ఫోన్‌కు లింక్‌ ఏదో వచ్చింది. దాన్ని క్లిక్‌ చేసింది. డ్రైవింగ్‌?.. వచ్చంది. బండి.. లేకున్నా ఉందని టిక్‌ కొట్టింది. అడిగిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసింది. కస్టమర్‌తో ఎలా వ్యవహరించాలి? సెన్సిటివ్‌ పదార్థాలను ఎలా తీసుకెళ్లాలి? ఇలా రకరకాల ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చింది. ఎనిమిది స్టెప్స్‌ తర్వాత ‘సక్సెస్‌’ అన్న సందేశం, మర్నాడు రావాల్సిందిగా సమాచారం.. చకచకా అందాయి. స్నేహితుడి టూవీలర్‌ తీసుకొని వెళ్లింది. వెంటనే జొమాటో టీషర్ట్‌, ఫుడ్‌ డెలివరీ బ్యాగ్‌ చేతికిచ్చారు.

అందరి మద్దతుతో..
సాయంత్రం 5 గంటలకు విధుల్లోకి వెళ్తుంది రచన. రాత్రి 11 గంటల వరకు ఏ మూలనుంచి ఆర్డర్‌ వచ్చినా రయ్‌మంటూ ఆ వైపుగా దూసుకెళ్తుంది. ‘ఏదైనా చేయగలననే నమ్మకంతోనే ఫుడ్‌ డెలివరీ గాళ్‌ అవతారమెత్తా’ అంటుంది రచన. అయితే ఉద్యోగంలో చేరిన నాటి నుంచీ తనకు ఏ సమస్యా ఎదురవలేదు. అందరి మద్దతూ లభించింది. ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చిన వాళ్లు సైతం ఆమె కష్టానికి, ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. రెస్టారెంట్‌ ఓనర్లు ‘మొదటి డెలివరీ గర్ల్‌ వచ్చింద’ంటూ ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. సీనియర్‌ డెలివరీ బాయ్‌లు అయితే, ఏ ఆపదొచ్చినా నిమిషాల్లో వాలిపోతామన్నారు. ‘లాక్‌డౌన్‌ టైమ్‌లో రాత్రయితే చాలు రోడ్డుమీద ఒక్క మనిషీ కనిపించేవాడు కాదు. అయినా మొండిధైర్యంతో వెళ్లేదాన్ని. చెకింగ్‌ పాయింట్లవద్ద పోలీసులు నన్ను చూసి చప్పట్లతో స్వాగతం పలికిన సందర్భాలూ ఉన్నాయి. ‘ఏ సమస్య వచ్చినా కాల్‌ చేయమ్మా!’ అని ఆడబిడ్డను సాగనంపినట్టు పంపేవార’ని చెబుతున్నది రచన.

లక్ష్యం దిశగా..
చదువుకోవాలన్న తపన రచనను నడిపిస్తున్నది. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా కెరీర్‌లో రాణిస్తున్నది. “ఏ ఆటంకాలూ లేకుండా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నది నా లక్ష్యం. అమ్మను, నాన్నను ఏ కష్టం లేకుండా చూసుకోవడం నా బాధ్యత. ‘ఫుడ్‌ డెలివరీ నీవల్ల కాదు’ అని ఎవరు నిరుత్సాహపరిచినా నా కలలన్నీ కరిగిపోయేవే! మరో ఉపాధి మార్గం వెతుక్కోవాల్సి వచ్చేది. నాకు అండగా నిలిచినవారికి, సహకరించిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు. నేను మంచి స్థాయికి వచ్చాక నాలాంటి వారికి తప్పకుండా సాయం చేస్తా” అని ముగించింది జొమాటో రచన. అంతలోనే ఆమె సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌. ఆకలితీర్చడానికి అన్నపూర్ణలా బయల్దేరింది.

వెంబడించి.. బండి ఇప్పించి!

“ఒకరోజు రాత్రి ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకోవడానికి వెళ్తున్నా. అప్పటికే ఆ రెస్టారెంట్‌ క్లోజ్‌ చేశారు. వెనక్కి వస్తున్నప్పుడు ఎవరో నన్ను ఫాలో అయ్యారు. ‘ఓయ్‌ జొమాటో!’ అంటూ పిలిచాడు. నాకు చచ్చేంత భయం వేసింది. వెంటనే బండి స్టార్ట్‌ చేసి, ఆపకుండా వెళ్లిపోయా. ఒకచోట మా జొమాటో టీమ్‌ కనిపిస్తే, ఆపి వారికి విషయం చెప్పా. ఇంతలో ఫాలో అయిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. తన పేరు ఇమ్రాన్‌ అని చెప్పాడు. ‘పరేషాన్‌ బాయ్స్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నానన్నాడు. నా గురించి అన్ని విషయాలూ తెలుసుకొని మర్నాడు పది వేల రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. నేను నడుపుతున్న బండి నాది కాదని తెలుసుకొని, ఎవరి ద్వారానో బండి కూడా ఇప్పించాడు ఇమ్రాన్‌ అన్న”

… మధుకర్‌ వైద్యుల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana