Women’s Reservation Bill | తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడింది. లోక్‌సభ ఆమోదం పొందింది. అయినా, మహిళ పాలన మనకు కొత్తేం కాదు. తరాలుగా తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నదామె. స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్లో మంత్రిగా కొలువైన అమృత కౌర్ నుంచి ఇప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు చాలామంది మగువలు దేశానికి ప్రాతినిధ్యంవహించారు. ఇక విశ్వ మహిళలు ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, అంగ్‌సాన్ సూకీ, బెనజీర్ భుట్టో తమదైన ముద్రతో అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా దేశాధ్యక్షులను కూడా తలుచుకుని తీరాలి.
షేక్ హసీనా
Sheikh Hasina
పాకిస్తాన్ నుంచి విడివడిన దేశం. ఛాందసం ఒకవైపు, మిలటరీ ప్రాబల్యం మరోవైపు.. అధికార పీఠం పీకనొక్కే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈ సవాళ్లను తట్టుకుంటూనే 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్ హసీనాను తల్చుకుంటే చాలు, మహిళల నాయకత్వ సామర్థ్యం పట్ల మన అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. మిలటరీ తిరుగుబాటులో బంగ్లాదేశ్ జాతిపితగా భావించే తండ్రి ముజిబుర్ రెహమాన్‌ను, తల్లిని, కొడుకును, ముగ్గురు సోదరులను కోల్పోయింది. అయినా నిబ్బరంగా రాజకీయాల్లోకి దిగి, తండ్రి వారసత్వాన్ని చాటుకున్నది. తిరుగుబాట్లను తట్టుకుని తిరుగులేని నాయకురాలిగా నిలిచింది. ఆమెకు దీటుగా నిలిచింది కూడా మరో మహిళే.. ఖలీదా జియా! సమర్థ్ధ ప్రధానిగా దేశాన్ని గాడిన పెడుతున్నారు హసీనా.
తాయ్ ఇంగ్ వెన్
Tsai Ing Wen
తైవాన్.. ఒక అతిచిన్న దేశం. ప్రచ్ఛన్న యుద్ధంలో, ప్రపంచశక్తుల అహంకారంతో నలిగిపోయిన ప్రాంతం. అయినా ఆ సంక్షోభాల మధ్య నిలదొక్కుకోవడమే కాకుండా ధనిక దేశంగా మారింది. ఈ మార్పును విశ్లేషకులు ‘తైవాన్ మిరకిల్’ గా పేర్కొంటారు. పక్కనే ఉన్న చైనా ఎప్పుడెప్పుడు తైవాన్ను ఆక్రమిద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఓ పసికూన ప్రపంచశక్తిని ఎదుర్కొని నిలబడి, ముందుకు సాగడం వెనుక ఆ దేశాధ్యక్షురాలు తాయ్ ఇంగ్ వెన్ ఉన్నారు. ఆమె తండ్రి ఓ ఆటో షాప్ యజమాని. తొమ్మిది మంది పిల్లల మధ్య సాధారణ జీవితం గడిపింది. అంచెలంచెలుగా ఎదుగుతూ, ఈ స్థాయికి చేరుకున్నది. దేశ అభివృద్ధిని వేగవంతం చేస్తూ, చైనా కవ్వింపులను నేర్పుగా ఎదుర్కొంటూ, అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ… ప్రపంచంలోని ప్రతిభావంతులైన నాయకుల జాబితాలో చోటు సంపాదించుకున్నది. వారసత్వంతోనే మహిళలు రాజకీయాల్లో విజయం సాధిస్తారనే అపోహను పటాపంచలు చేసింది.
ఎలిజబెత్ బోన్
Elisabeth Borne
ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కొవిడ్ దెబ్బకైతే, నిలదొక్కుకోలేకపోయింది. ఈ విలాసదేశాన్ని ఇప్పుడు పేదరికం, నిరుద్యోగం అవహించాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని పదవిని చేపట్టిన ఎలిజబెత్ మీదే అందరి ఆశలూ! ఎలిజబెత్‌కు పదకొండేండ్లు ఉన్నప్పుడు.. ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ సంరక్షణలో పెరిగింది ఎలిజబెత్. బాగా చదువుకుని ప్రభుత్వ అధికారిగా పాలనకు దగ్గరైంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఐదేళ్లలోనే ప్రధాని పదవి చేపట్టింది. పరిపాలన దక్షతతో.. దేశపరిస్థితులను చక్కదిద్దుతూనే, మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నది. మహిళా నాయకులు ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్ని నిలువరించలేరనేవాదనను కొట్టిపారేస్తున్నది ఎలిజబెత్.
జార్జియా మెలోని
Giorgia Meloni
2022లో ఫోర్బ్స్ పత్రిక ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైన మహిళలు’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. అందులో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకున్న ఏకైక ప్రధాని జార్జియా మెలోని. ఇటలీ నేత. మహిళలు రాజకీయాల్లోకి అనుకోకుండా వస్తారే కానీ, ఆ రంగాన్ని ఉద్దేశపూర్వకంగా ఎంచుకోరు అనే అభిప్రాయాన్ని కొట్ట్టిపారేసే కెరీర్ తనది. కౌమారం నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నది. 2022లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ‘ఎవరిని నేతగా ఎంచుకోవాలి?’ అనే విషయం మీద రోజుల తరబడి తర్జనభర్జన కొనసాగింది. దాన్ని దాటుకుని ప్రధాని పీఠాన్ని అందుకున్నది జార్జియా. కొవిడ్, అక్రమ వలసలు, డ్రగ్స్ లాంటి సమస్యల పట్ల కఠినమైన వైఖరి ప్రదర్శించింది. భారత్ సహా ఎన్నో దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని కూడా జార్జియానే!
ఆనా బ్రన్బిక్
Ana Brnabic
ఓ చిన్న దేశం. ప్రపంచ రాజకీయాలను ఎదుర్కొని ముందుకు సాగడమే కష్టం. అందులోనూ చుట్టూ ఎన్నో వివాదాలు. ఇదీ సెర్బియా పరిస్థితి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశం తన సరిహద్దుల్లోని కొసావా, బోస్నియా సమస్యలతో నలిగిపోతున్నది. వాటికి తోడు అటు అమెరికా, ఇటు రష్యా.. ఈ రెండూ కూడా సెర్బియా తమకే మద్దతు ఇవ్వాలని ఆశిస్తుంటాయి. ఇక కొవిడ్ ఓ కొత్త తలపోటు. ఈ నేపథ్యంలో తొలి మహిళా ప్రధానిగా గెలిచారు ఆనా. అంతేకాదు! స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకొన్న అతికొద్ది మంది నాయకులలో తనూ ఒకరు. 2017లో పదవిని చేపట్టిన ఆనా ఎన్నో సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. పార్టీ చేతిలో కీలుబొమ్మ అని ఎగతాళి చేసినా.. వ్యక్తిగతంగా, పాలనాపరంగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు.
సాహ్లె వర్క్ జూడ్
Sahle Work Zewde
ఆఫ్రికా.. ఆదిమ మానవుడి పుట్టిల్లు అని చెబుతారు. కానీ ఆధునిక ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోయింది. అణచివేత, బానిసత్వంతో చీకటి ఖండంగా మారింది. పేదరికం, నిరక్షరాస్యత లాంటి సమస్యలు ఎలాగూ ఉన్నాయి. వాటికి తోడు అనేక అంతర్గత అలజడులు ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటి ఓ గడ్డ.. ఇథియోపియా. ఆ దేశ అధ్యక్షురాలు వర్క్ జూడ్. 35 ఏళ్ల క్రితం రాయబారిగా మొదలైన ఆమె రాజకీయ ప్రయాణం, 2018లో ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి చేరుకుంది. నిర్ణయాల విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో, మానవతలో అంత ఉదారంగా వ్యవహరిస్తుందని సాహ్లెకు పేరు. వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టడమే ఇందుకు ఉదాహరణ. ‘మహిళల గురించి నేను మరీ ఎక్కువగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో… ఇది ఆరంభం మాత్రమే’ అంటూ తన ఆశయాన్ని స్పష్టం చేస్తారు వర్క్ జూడ్.
ఆరంభమే..
.. వీళ్లు మాత్రమే కాదు. ఐస్లాండ్, డెన్మార్క్, జార్జియా, స్లొవేకియా, గ్రీస్, టాంజానియా, హంగెరీ లాంటి దేశాలకూ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. పాలనలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. పౌరులను కన్నబిడ్డల్లా తీర్చిదిద్దగలమని, దేశాన్ని ఇంటిలా చక్కదిద్దగలమని చేతల్లో చాటుతున్నారు ఈ నారీ నేతలు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ నమ్మకానికి కొనసాగింపు.