బాలీవుడ్లో నెపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘స్టార్ కిడ్స్’ చుట్టూ ఇందుకు సంబంధించిన చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే, యువనటుడు అహాన్ పాండే మాత్రం.. తనను ‘స్టార్ కిడ్’గా పిలవొద్దని అంటున్నాడు. తన తండ్రి ‘సినిమా స్టార్’ కాదని చెబుతున్నాడు. తన మామ చంకీ పాండే అడుగుజాడల్లో నడుస్తూ.. ‘సైయారా’తో ఇండస్ట్రీలోకి వచ్చాడు అహాన్ పాండే. తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నాడు. తనను మీడియా ‘స్టార్ కిడ్స్’ జాబితాలో చేర్చిందనీ, నెపోటిజం గురించిన చర్చల్లోనూ తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నిజానికి తన తండ్రి ఓ వ్యాపారి అనీ, ఆయనకు బాలీవుడ్‌కు ఎలాంటి సంబంధం లేదనీ చెబుతున్నాడు. ఇక తన బాలీవుడ్ అరంగేట్రం గురించి చెబుతూ.. “మా మామ చంకీ పాండే బాలీవుడ్లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఆయన ఇబ్బందులను చూసిన మా తల్లిదండ్రులు.. నన్ను ఇండస్ట్రీలోకి పంపేందుకు ఆసక్తి చూపలేదు. నిజానికి నేను నటించగలనని కూడా వారికి తెలియదు. నా మొదటి సినిమా చూసినప్పుడు, వారెంతో భావోద్వేగానికి గురయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్లో తన ప్రయాణం దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభమైందనీ, తన కజిన్ అనన్య పాండే సినిమాల్లోకి రాకముందే.. తన మొదటి ఆడిషన్ ఇచ్చానని అహాన్ అంటున్నాడు. “నేను స్కూల్ డ్రామాలు, ప్రసంగాలలో పాల్గొనేవాణ్ని. నటనపై అంత నమ్మకంగా ఉండేవాణ్ని కాదు. మొదట్లో రచయిత కావాలని కోరుకున్నాను. కానీ, అనుకోకుండా యాక్టర్‌ను అయ్యాను.
16 ఏళ్ల వయసులో నా మొదటి ఆడిషన్ ఇచ్చాను” అంటూ తన నటనా ప్రయాణం గురించి పంచుకున్నాడు. ఇక అహాన్ తర్వాతి సినిమాపై అప్పుడే బీటౌన్‌లో చర్చ మొదలైంది. తాజాగా, సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ వద్ద అహాన్ కనిపించడంతో.. అతని తర్వాతి సినిమా ఆ స్టార్ డైరెక్టర్‌తోనే అని బాలీవుడ్ టాక్.