పెళ్లంటే పందిళ్లు.. పచ్చని తోరణాలు.. బాజాభజంత్రీలే కాదు.. పసుపు కాన్వాస్ కూడా! పేరంటంలో కాళ్లకు పసుపు రాసుకోవడం తెలిసిందే. ఇవాళ్టి కల్యాణాల్లో హల్దీ వేడుకది ప్రత్యేక స్థానం. మంగళ స్నానాలప్పుడు పసుపుతో నలుగు పెట్టి వధూవరులను అందంగా ముస్తాబు చేసినట్టే.. కాన్వాసుపై పసుపు చేతులద్ది కొత్త జంటకు కొంగొత్త చిత్తరువు చదివిస్తున్నారు. ఈ వింతెన్నడూ చూడనివాళ్లంతా ఔరా! అంటున్నారు. పెళ్లి వేడుకల్లో కాన్వాస్‌పై పసుపుతో కొత్త ప్రయోగాలు చేస్తున్నది ఆర్టిస్ట్ గ్రీష్మశ్రీ రెడ్డి.
గ్రీష్మకు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఇష్టం. వాళ్లమ్మ కూడా బొమ్మలు బాగా గీస్తుంది. డాక్టర్ కావాలని నీట్ పరీక్ష రాసింది. సీటు రాలేదని ఫార్మసీలో చేరింది. చదువుతూనే బొమ్మలు వేసే పనిలో చాలా బిజీ అయిపోయింది. కరోనా కాలంలో ఖాళీగా ఉండకుండా రోజుకో బొమ్మ గీస్తూ సాధన చేసింది. వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్, పేస్టల్స్, పెన్సిల్, స్కెచ్‌లతో రకరకాల ఉపకరణాలతో బొమ్మలు వేసేది. అప్పుడు మాస్కులు కట్టుకోవడం తప్పని సరి కదా.
ఆ సమయంలో తన సృజనతో మాస్క్‌లపై పెయింటింగ్ వేసింది. లోగోలు, ఆకట్టుకునే బొమ్మలు గీయడం చూసి చాలామంది మెచ్చుకున్నారు. బంధువులు, మిత్రులు ‘మాకు ఇలాంటి బొమ్మ గీసి ఇవ్వమ’ని ఆర్డర్లు ఇచ్చేదాకా వచ్చింది. అలా నాలుగు నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత కాన్వాస్ మీద డ్రాయింగ్ సాధన చేయడం మొదలుపెట్టింది. అలా బొమ్మలు గీస్తున్న సందర్భంలో తన స్నేహితురాలు సత్యవర్షి చేస్తున్న వాల్ పెయింటింగ్ పనిలో చేరింది. వినియోగదారుల ఇంటి గోడలను అపురూప చిత్రాలకు ఆలవాలంగా మార్చేస్తూ వచ్చింది.
చదువుతోపాటు రంగులతో కలిసి ప్రయాణం చేస్తున్న గ్రీష్మ కెరీర్ ఓ రోజు అనుకోని మలుపుతిరిగింది. రెండున్నర సంవత్సరాల క్రితం స్నేహితురాలు రత్నా పెళ్లికి పిలిచింది. ఆ పెళ్లిలో ఆర్ట్‌తో ఏదైనా కొత్తగా చేయమని అడిగింది. కొత్తదనం కోసం ప్రయోగాలు చేస్తూ పసుపుతో మ్యాజిక్ చేసింది. కాన్వాస్‌పై వధూవరుల ఫొటోలు స్కెచ్ వేసింది. అది కంటికి కనిపించకుండా చిన్న కిటుకు ప్రదర్శించింది. పెళ్లికి వచ్చిన పేరంటాళ్లు తమ చేతులకు పసుపు రాసుకుని కాన్వాస్‌పై అద్దగానే ఆ జంట ఫొటో కాన్వాస్‌పై ఆవిష్కృతమైంది. ఇలా ప్రత్యక్షమైన చిత్రాన్ని చూసి అక్కడికి వచ్చినవారంతా ముచ్చటపడ్డారు. నాలుగేళ్ల క్రితం ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో ఈ వీడియో పెట్టగానే ఒక్కసారిగా రీచ్ పెరిగింది. పసుపు కళతోపాటు గ్రీష్మ కూడా పాపులర్ అయింది.

కాన్వాస్‌పై పసుపు చిత్రం తరహాలో మెరుపులతోనూ మరో మ్యాజిక్ చేసింది. డార్క్ కాన్వాస్‌పై ముందే స్కెచ్ చేసి పెడుతుంది. ఆ స్కెచ్ కనిపించదు. వధూవరులపై అక్షింతలు చల్లినట్టు మెరుపులు (గ్లిట్టర్స్) చల్లితే అవి స్కెచ్ గీసిన చోట అతికిపోతాయి. అలా ఓ బొమ్మ ఏర్పడుతుంది. ఇలా కాన్వాస్‌పై ఇంతకుముందు చూడని చిత్రవిచిత్రాలు చూపిస్తూ పెళ్లి వేడుకను మరింత సంతోషంగా మారుస్తున్నది గ్రీష్మ! కొన్ని వస్తువులు మధురమైన జ్ఞాపకాలకు సాక్ష్యాలు. వాటిని అపురూపంగా చూసుకుంటాం. దాచుకుంటాం. కానీ, అన్ని వస్తువులూ దాచేస్తే దాగవు. వాడిపోయే పూలు, ఇంకా కొన్ని నిలుపుకోవడానికి సాధ్యపడదు. అలా పెళ్లినాటి పూలదండలు, తొలిసారిగా వాడిన వాటిని దాచేందుకు రెజిన్ ఆర్ట్‌ని చేపట్టింది. ఇవన్నీ చేయడానికి సొంత స్టూడియో లేకున్నా ఇంట్లోనే విజయవంతంగా చేస్తూ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నది గ్రీష్మ. తన ఆర్ట్‌కి ఆదరణ పెరిగినా ఆర్టిస్ట్ కెరీర్ కంటే టీచింగ్ కెరీర్‌కే తన ప్రాధాన్యం అంటున్నది.
– నాగవర్ధన్ రాయల